తెలంగాణ

telangana

Private Schools Fee Increased : ప్రైవేట్ పాఠశాలలో 'దోపీడీ'.. యాజమాన్యం చెప్పిందే ధర..

By

Published : Jul 5, 2023, 11:57 AM IST

Private Schools Fee Increased in Suryapet : ఏడాది మొదలవుతుందనగానే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలుగుతోంది. ప్రైవేట్ బడిలో ఫీజులు గుర్తొస్తేనే భయం వేస్తోంది. ప్రతి ఏటా ఒక పద్ధతి, ఒక విధానం అంటూ లేకుండా అధికంగా ఫీజులు పెంచుతున్న పాఠశాలలు చాలానే ఉన్నాయి. కేవలం ఫీజులే కాదండోయ్.. డొనేషన్లు, డెవలప్​మెంట్ ఛార్జీలు అని రకరకాల ఫీజులతో దోపిడీ జరుగుతోంది. వేలకువేలు ఫీజుల సంగతి ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగులకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి. పిల్లలను చదివించాలంటే ప్రతి ఏడాది తల్లిదండ్రులు ఆందోళనల చెందుతున్నారు. చదువులు మోయలేని భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు నియంత్రణకు చర్యలు చేపడుతున్నామంటున్న కానీ.. సంవత్సరాలు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావట్లేదు.

Private Schools Fee Increased
Private Schools Fee Increased

Private Schools Fee Hike in Telangana : సూర్యాపేటకు చెందిన బండపెల్లి నాగరాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతను యూకేజీ పూర్తి చేశాడు. దీంతో ఆ తండ్రి ఓ ప్రైవేట్ బడిలో ఒకటో తరగతిలో చేర్పిద్దామని వెళ్లగా.. ఫీజు రూ.29,000 అని చెప్పారు. పుస్తకాలు, దుస్తులు, బూట్లు తదితర సామగ్రి అదనంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో ఇంటికి సమీపంలో ఉన్న ప్రైవేట్ బడిలో యూకేజీకి ఫీజు రూ.12,000 దాక చెల్లించారు. ఒకటో తరగతికి వచ్చే సరికి అదనంగా రూ.17,000తో పాటు ఇతర సామగ్రి భారం పడుతుండటంతో కొత్తబడిలో చేర్పిద్దామనే ఆలోచనకు స్వస్తి పలికి పాత బడిలోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

Parents on Private School Fee Hike :మరోవైపు అదే సూర్యాపేటకు చెందిన మరోవ్యక్తి బాలకృష్ణ. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు యూకేజీ, మరొకరు మూడో తరగతిని స్థానిక ప్రైవేటు స్కూల్​లో చదువుకుంటున్నారు. అక్కడ గతేడాది ఇద్దరికిగానూ.. ఫీజు రూ.26,000 తీసుకోగా, ఈ సంవత్సరం అదనంగా రూ.4,000 పెంచారు. ఇతర సామగ్రికి ఇద్దరికి రూ.8000 కట్టించుకున్నారు. ఈ సంవత్సరం అదనంగా మరో రూ.5,000 భారం పెరిగిందని.. వేరే స్కూలులో చేర్పిద్దామంటే అక్కడ ఇంకా ఎక్కువగా ఫీజులు ఉన్నాయని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ వైపు పిల్లలకు పుస్తకాలు, బూట్లు, దుస్తులు.. మరోవైపు ఫీజుల మోతతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వారి సంపాదన ఏ మాత్రం పెరగకున్నా గానీ, ఒక్కసారిగా ఫీజుల భారం పడటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అవి ఇవి అంటూ నిలువు దోపిడీకి చేస్తున్నారు. బయట మార్కెట్లో కొనడానికి ఒప్పుకోరు.. వారు చెప్పిన ముద్రణ పుస్తకాలనే కొనాలంటారు. ఇలా జిల్లాలో మాత్రం విద్యావ్యాపారం జోరుగా సాగుతోంది.

ప్రామాణికమంటూ దోపిడీ :సూర్యాపేటజిల్లాలో మొత్తం 244 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 59,490 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల దోపిడీలపై ఏటా సాక్ష్యాలతో విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా.. తనిఖీలు మాత్రం చేపట్టడం లేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క బడిపై ఎలాంటి చర్యలు లేవంటే అధికారుల తీరు అర్థమవుతోంది. విద్యాశాఖ జీవో నెం.1కి ఎంతో ముఖ్యమైనది. పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోళ్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో దొరికే పుస్తకాలనే విక్రయించాలని దుస్తులు, బూట్లు, ఇతర సామగ్రిపై నిబంధనలు రూపొందించారు. ఒకవేళ అమ్మినా మార్కెట్‌ కన్నా.. ధర ఎక్కవగా ఉండవద్దు. కానీ, ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలు దీన్ని పక్కన పెడుతూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Private Schools Hike Fee : ప్రాథమిక విద్యార్థులకు బ్రాండ్ల పేరుతో ఒక్కో పాఠశాలల్లో ఒక్కో రకం పుస్తకాలను ఎక్కవ ధరలకు పెట్టి వారికి అంటగడుతున్నారు. ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి సామగ్రిని రూ.3600 విక్రయించారని ఓ విద్యార్థి తండ్రి తెలిపారు. ఆ సామగ్రి బయట రూ.900లకు దొరుకుతాయని వాపోయారు. ఎక్కవ ధర ఏంటి అని యాజమాన్యాన్ని అడిగితే.. తాము ప్రత్యేకంగా తయారు చేయించామని, ప్రామాణికమని చెబుతున్నారని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని బడుల్లో ఇదే తరగతి పుస్తకాలను రూ.3500 నుంచి రూ.4300 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

కానరాని అధికారుల చర్యలు : ప్రభుత్వ నిబంధనలన్ని పక్కన పెడుతూ.. మూడు పువ్వులు ఆరు కాయలుగా విద్యావ్యాపారం జోరుగా సాగుతోంది. పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టులు తదితర ధరలు అమాంతం పెంచేసి అందినకాడికి దోచేస్తున్నారు. వాటి కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.4000 నుంచి రూ.5000 వరకు ఖర్చు చేయాల్సిందే. బయట మార్కెట్లో అవే వస్తువులు కొందామంటే కుదరదని.. మావే కొనాలని యాజమన్యాలు ముందుగానే చెప్పేస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లోనే విక్రయాలు జరుపుతుండగా.. మరికొన్ని ప్రత్యేక విక్రయశాలలు, లేదా బుక్‌స్టాళ్ల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకొని విద్యావ్యాపారం సాగిస్తున్నాయి. దీంతో జిల్లాలో చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం :ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాలు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారని సూర్యాపేట డీఈవో అశోక్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు విక్రయాలు జరపొద్దన్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details