ETV Bharat / city

20%-50% ఫీజు పెంచిన ప్రైవేట్ పాఠశాలలు

author img

By

Published : Jun 8, 2022, 11:10 AM IST

Private School fee in telangana : వేసవి సెలవులు దగ్గరపడుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయం సమీపిస్తోంది. ఇప్పటికే రెండేళ్ల పాటు కరోనాతో బడులన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో.. రెండేళ్ల పాటు నష్టాలు మూటగట్టుకున్న ప్రైవేట్ పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచేందుకు సిద్ధమయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఇప్పడికే ఇష్టానుసారం పెంచేశాయి. కొత్తగా ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు పాఠశాలలు ప్రారంభమయ్యేలోగానే తొలి విడత ఫీజు చెల్లించాలని ప్రైవేట్ స్కూళ్లు అల్టిమేటమ్ జారీ చేశాయి. ఇక పిల్లలను కార్పొరేట్ బడుల్లోనే చదివించాలన్న తల్లిదండ్రుల తాపత్రయం ఈ ఫీజులను భరించలేక అప్పులు చేయాల్సిన పరిస్థితి తెచ్చిపెడుతోంది.

Private School fee in telangana
Private School fee in telangana

  • సికింద్రాబాద్‌లోని ప్రైవేటు పాఠశాల.. నగరం సహా శివారులో కలిపి మూడు బ్రాంచీలున్నాయి. గతేడాది నాలుగో తరగతి ఫీజు రూ.62వేలుగా ఉంది. ఈసారి ఏకంగా రూ.80వేలు చేసింది. పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు, రవాణా ఫీజులు అదనం. మొత్తంగా రూ.లక్షకు చేరిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
  • ఎల్బీనగర్‌ సమీపంలోని మరో పాఠశాలకు నగరంలో నాలుగు బ్రాంచీలున్నాయి. ఐదో తరగతిలో గతేడాది రూ.36వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.50వేలుగా నిర్ణయించింది. దాదాపు 40శాతం ఫీజులు పెంచి వసూలు చేస్తోంది. తల్లిదండ్రులు తగ్గించాలని ఒత్తిడి చేస్తున్నా కుదరదని స్పష్టం చేస్తున్న పరిస్థితి.

Private School fee in telangana : ప్రైవేటు పాఠశాలలు ఫీజుల పేరిట అడ్డగోలు దోపిడీకి తెరలేపాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా పాఠశాలలు నడిచీ..నడవనట్లుగా కొనసాగాయి. ఆన్‌లైన్‌ తరగతులకే తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో రెండేళ్లుగా వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు విద్యార్థులపై భారం మోపుతున్నాయి. 2022-23 సంవత్సరానికి సంబంధించి ఫీజులు ఇష్టానుసారం పెంచేశాయి. కొన్ని పాఠశాలలు ఏకంగా 20 నుంచి 50శాతం వరకు పెంచి వసూలుచేస్తున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. కొత్తగా ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు పాఠశాలలు ప్రారంభించే లోపే మొదటి విడత ఫీజులు చెల్లించాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. ఇప్పటికే చదువుతున్న విద్యార్థులు నెలాఖరులోపు చెల్లించాలని సందేశాలు పంపిస్తున్నాయి. పెరిగిన ఫీజులు భరించలేక తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి.

.

అదనంగా ప్రవేశ రుసుము

విద్యార్థులు ప్రవేశాలకు వాకబు చేయడం దగ్గర్నుంచే దోపిడీకి తెర లేపుతున్నాయి. దరఖాస్తు ఫారానికే రూ.500-1000 వసూలు చేస్తున్నాయి. దరఖాస్తు నింపిఇస్తేనే ప్రవేశ పరీక్ష పెడతామంటూ మెలిక పెడుతున్నాయి. తల్లిదండ్రులు చేసేది లేక దరఖాస్తులు కొనాల్సిన పరిస్థితి. విద్యార్థులకు సీట్లు వస్తే రెగ్యులర్‌ ట్యూషన్‌ ఫీజు కాకుండా అడ్మిషన్‌ ఫీజు పేరిట భారీగా దండుకుంటున్నాయి. వనస్థలిపురం సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్‌ ఫీజు కింద ఏకంగా రూ.40వేలు కట్టించుకుంటోంది. రెగ్యులర్‌ ట్యూషన్‌ ఫీజుకిది అదనం. ఇలా పాఠశాలలు ప్రాథమిక తరగతులకే ఇంజినీరింగ్‌ స్థాయిలో కట్టించుకొంటున్నాయి.

రవాణా మరింత భారం

డీజిల్‌ ధరలు పెరిగాయంటూ రవాణా ఫీజులను పాఠశాలలు పెంచేశాయి. గతంలో 5 కిలోమీటర్ల పరిధిలో రూ.15వేలు వసూలు చేయగా.. ఇప్పుడు ఏకంగా రూ.20-25వేలకు పెంచాయి. పాఠశాలలు సొంతంగా నిర్వహించే రవాణాతో పాటు ప్రైవేటు వాహనదారులు ఫీజులు అధికంగా తీసుకుంటున్నారు. పిల్లల ఫీజులకు తోడు రవాణా ఫీజుల భారంతో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు.

కమిటీలు ఎక్కడ?

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు 2017లో ఓయూ మాజీ వీసీ ప్రొ.తిరుపతిరావు అధ్యక్షతన సర్కారు కమిటీ వేయగా నివేదిక సమర్పించింది. అందులో ఏం ప్రతిపాదనలు చేసిందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈ ఏడాది మార్చిలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమై ఏటా స్కూలు ఫీజుల పెంపు పదిశాతం మించకూడదని స్పష్టం చేసింది. ప్రతి పాఠశాలలో ఫీజుల నియంత్రణకు కమిటీ వేయాలంది. అందులో పాఠశాల యాజమాన్యం ప్రతినిధి ఛైర్‌పర్సన్‌గా, ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా, ముగ్గురు ఉపాధ్యాయులు, ఐదుగురు తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. దీన్ని ఏ పాఠశాలా అమలు చేయడం లేదు. విద్యాశాఖ కళ్లప్పగించి చూస్తోంది.

ప్రత్యేక వ్యవస్థ అవసరం : 'పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై అధికారులు, మంత్రులు సహా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఈసారి చాలావరకు పాఠశాలలు 20 నుంచి 50శాతం వరకు ఫీజులు పెంచేశాయి. తిరుపతిరావు కమిటీ నివేదికను ఇప్పటివరకు సర్కారు బహిర్గతం చేయకపోవడం సరికాదు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకురావాలి.' -వెంకట సాయినాథ్‌, హైదరాబాద్‌ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం సంయుక్త కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.