తెలంగాణ

telangana

ఈటల గజ్వేల్​కు రావడంతో కేసీఆర్​కు నిద్రపట్టడం లేదు - ఓటమి భయంతోనే కామారెడ్డి నుంచి పోటీ : కిషన్​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2023, 1:55 PM IST

Kishan Reddy Fires on CM KCR : ఈటల రాజేందర్ గజ్వేల్​కు రావడంతో సీఎం కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. ఆ భయంతోనే కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని పునరుద్ఘాటించారు.

bjp election campaign 2023
Kishan Reddy Fires on CM KCR

Kishan Reddy Fires on CM KCR : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం వదిలిన బాణం ఈటల రాజేందర్‌ అని.. ఆయన గజ్వేల్‌కు రావడంతో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో గెలుస్తాననే నమ్మకం కేసీఆర్‌కు లేదని.. ఆ ఓటమి భయంతోనే కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. గజ్వేల్​లో ఈటల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన.. బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని పునరుద్ఘాటించారు.

Kishan Reddy on Opponent Parties : తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం : కిషన్ రెడ్డి

కేసీఆర్‌ కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయ్యిందని కిషన్​రెడ్డి విమర్శించారు. స్వరాష్ట్రంలో ప్రజలను కేసీఆర్.. బానిసలుగా మార్చారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​కు ఓటేస్తే కేసీఆర్‌ కుటుంబానికి వేసినట్లేనన్న ఆయన.. భారతీయ జనతా పార్టీకి వేస్తే భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ఓటేసినట్లవుతుందని పేర్కొన్నారు. డబ్బుతో గజ్వేల్‌ ప్రజల ఓట్లను కొనుగోలు చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వకపోగా, ఉన్నవాటినీ ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు.

Kishan Reddy Interesting Comments : 'అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి బీజేపీ సిద్ధం'

"ఈటల రాజేందర్‌ గజ్వేల్‌కు రావడంతో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదు. గజ్వేల్‌లో గెలుస్తాననే నమ్మకం కేసీఆర్‌కు లేదు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తి సీఎం అవుతారు. బీఆర్​ఎస్​కు ఓటేస్తే కేసీఆర్‌ కుటుంబానికి వేసినట్లే. బీజేపీకి ఓటేస్తే భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ఓటేసినట్లు." - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఈటల గజ్వేల్​కు వస్తే కేసీఆర్ కామారెడ్డి పారిపోయాడని.. కామారెడ్డిలోనూ బీఆర్ఎస్​కు మనుగడ లేదన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో నరేంద్ర మోదీ పాలన వస్తుందని.. బడుగు బలహీన వర్గాల పాలన రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

BJP State President Kishan Reddy Fires on BRS : 'నిరుద్యోగుల పాలిట బీఆర్ఎస్ ప్రభుత్వం యమపాశంలా తయారైంది'

కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పంచాయితీ జరుగుతుందని.. పేదల కలలు కొల్లగొట్టిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. హుజూరాబాద్ కంటే గజ్వేల్​లోనే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి నాయకుడు ఉద్యమంలా పని చేసి పార్టీని నిలబెట్టాలని.. నవంబర్ 30న ప్రతి బూతులో పెద్ద సంఖ్యలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

"కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పంచాయితీ జరుగుతుంది. పేదల కలలు కొల్లగొట్టిన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోబోతుంది. హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్​లో ఎక్కువ మెజార్టీ రాబోతుంది. ప్రతి నాయకుడు ఉద్యమంలా పని చేసి పార్టీని నిలబెట్టండి." - ఈటల రాజేందర్, ఎమ్మెల్యే

BJP Leaders Election Campaign in Telangana : బీజేపీ ఎన్నికల ప్రచార జోరు.. బీసీ సీఎం నినాదంతో ముందుకు..

ABOUT THE AUTHOR

...view details