తెలంగాణ

telangana

కిసాన్‌ ఎరువులు అందేదెప్పుడు?.. స్పష్టత ఇవ్వని యాజమాన్యం!

By

Published : May 17, 2021, 6:44 AM IST

కిసాన్‌ బ్రాండ్‌కు చెందిన యూరియా, అమ్మోనియా ఎరువులు రైతులకు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రామగుండం కర్మాగారంలో ఇటీవల ప్రమాదాలు చోటుచేసుకోవడంతోపాటు కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం ఆ పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసే పరిస్థితులు లేవు. ఉత్పత్తిపై కర్మాగారం అధికారులూ స్పష్టత ఇవ్వడం లేదు.

no clarity on fertilizers to farmers, ramagundam fertilizers factory
రామగుండం ఎరువుల కర్మాగారం, కిసాన్ ఎరువులు

రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ప్రారంభోత్సవంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎరువుల సరఫరాకు సంబంధించిన పనులను ఈ ఏడాది జూన్‌ వరకు పూర్తి చేసి ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభిస్తామని యాజమాన్యం గతంలో ప్రకటించింది. కర్మాగారంలో ఇటీవల ప్రమాదాలు చోటుచేసుకోవడంతోపాటు కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. ఈ కారణాలతో కిసాన్‌ బ్రాండ్‌కు చెందిన యూరియా, అమ్మోనియా ఎరువులు రైతులకు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.


సహజవాయువును ఇంధనంగా వినియోగించే ఈ కర్మాగారం ప్లాంటులో ‘కిసాన్‌’ బ్రాండ్‌ పేరిట భవిష్యత్తులో యూరియా, అమ్మోనియా ఎరువులను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రతి రోజు 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియాను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఎరువుల ఉత్పత్తికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా మల్లవరం నుంచి ఈ కర్మాగారం వరకు 363 కిలోమీటర్ల గ్యాస్‌ పైప్‌లైనును నిర్మించారు. యూరియా స్టోరేజీ ట్యాంకు పనులూ పూర్తయ్యాయి. అమ్మోనియా ట్యాంకులకు సంబంధించిన విడిభాగాల బిగింపు, తొలగింపు పనులను పూర్తిచేసి అదనపు సామగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో 60 మంది కార్మికులు కరోనా బారినపడ్డారు. దీనికి తోడు ఈ నెల 1న యూరియా ప్లాంట్‌ యూనిట్‌లో గ్యాస్‌ లీక్‌ అయి ఓ కార్మికుడు గాయపడ్డాడు. ఇదే నెల 3న అమ్మోనియా కంప్రెషర్‌ హౌస్‌లో నైట్రోజన్‌ లీక్‌ అయి ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదాల వల్ల కొన్ని పరికరాలు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో బిగించాల్సిన పరికరాలను విదేశాల నుంచి తీసుకురావాలి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం ఆ పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేసే పరిస్థితులు లేకపోవడం, కార్మికులు కొవిడ్‌ బారిన పడటం.. తదితర కారణాలతో ఇప్పట్లో కర్మాగారంలో ఎరువులు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ అంశంపై కర్మాగారం అధికారులూ స్పష్టత ఇవ్వడం లేదు.

ఇదీ చదవండి:కొవిడ్‌ చికిత్సలో కొత్త మందు.. 2డీజీ ఔషధం నేడే విడుదల

ABOUT THE AUTHOR

...view details