తెలంగాణ

telangana

గోదావరిని కలుషితం చేస్తోన్న ఆల్కహాల్ వ్యర్థాలు

By

Published : Oct 19, 2020, 10:42 AM IST

బాసర పుణ్యక్షేత్రం నవరాత్రి ఉత్సవాల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. పాపాలు కడిగేసుకుందామని అనుకుంటారు. కానీ ఇక్కడే పెద్ద చిక్కొకటి వచ్చి పడింది. గోదావరికి వచ్చిన వరదలు మహారాష్ట్ర నుంచి ఆల్కహాల్ కర్మాగార వ్యర్థాలను భారీ ఎత్తున మోసుకొస్తున్నాయి. పాపాలు పోవడం తర్వాత సంగతి.. చర్మ వ్యాధులు వస్తాయేమో అని ఆ నీటిని చూసిన భక్తులు భయపడుతున్నారు.

godavari river polluting with factory wastage
గోదావరిని కలుషితం చేస్తోన్న ఆల్కహాల్ వ్యర్థాలు

నిర్మల్ జిల్లా బాసరలో నవరాత్రి ఉత్సవాలను ఏటా ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. కానీ గోదావరి వరద ప్రవాహం మాటున మహారాష్ట్రలోని ధర్మబాద్ పట్టణ సమీపంలోని ఆల్కహాల్ కర్మాగారం నదిలోకి వ్యర్థాలను వదులుతోంది. నిల్వ చేసిన వ్యర్థాలను వరద వచ్చే సమయంలో విడుదల చేసి గోదావరిని కలుషితం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్మాగార యాజమాన్యం గతంలోనూ నదిలోకి పలుమార్లు రసాయనాలను వదిలి కలుషితం చేసింది. తాజాగా రెండు మూడు రోజుల నుంచి మరోసారి విడుదల చేసింది. ఈ వ్యర్థాలు బాసరలోని తాగునీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. నదిలో స్నానాలు ఆచరించాలనుకున్న భక్తులు కలుషిత జలాలతో ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు పోతాయనుకుంటే.. చర్మ వ్యాధులు వస్తాయేమో అని భయంగా ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటా ఈ సమస్య తలెత్తుతున్నా పరిష్కరించటంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని వాపోయారు.

ఇదీ చూడండి: భూమి అధీనంలో ఉన్నవారికే హక్కులు...

ABOUT THE AUTHOR

...view details