తెలంగాణ

telangana

Huzurabad by election campaign: ప్రచారానికి పది రోజులే గడువు.. హోరెత్తుతున్న పార్టీల జోరు!

By

Published : Oct 17, 2021, 4:53 PM IST

Updated : Oct 17, 2021, 5:12 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election campaign)లో ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారానికి గడువు సమీపిస్తుండటం వల్ల ఆయా పార్టీలు జోరు పెంచాయి. తమదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

Huzurabad by election
హుజూరాబాద్ ఉపఎన్నిక

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి (Huzurabad by election campaign) మరో పదిరోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ జోరు పెంచాయి. బతుకమ్మ, దసరా పండుగ రావడం వల్ల మూడు రోజులుగా ఎన్నికల ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు దూరంగా ఉన్నారు. 5 నెలలుగా తెరాస నాయకులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై నియోజకవర్గాన్ని హీటెక్కించారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలందరూ సొంతూళ్లకు వెళ్లిపోవడం వల్ల నియోజకవర్గం సైలెంట్‌గా మారింది.

ప్రచారంలో పెరిగిన వేగం...

పండుగ అనంతరం తిరిగి నియోజకవర్గానికి చేరుకున్న నాయకులు ప్రచారాన్ని (Huzurabad by election campaign) ముమ్మరం చేశారు. మండలాల వారీగా చేరుకున్న ఆయా పార్టీల ఇంఛార్జిలు ప్రచార వేగాన్ని పెంచారు. పోలింగ్​కు మరో 13 రోజులే గడువు మిగిలి ఉండటం, 72 గంటల ముందే స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం సూచిస్తుండటం వల్ల ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ఓటర్లను తిప్పుకొనేందుకు యత్నిస్తున్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు స్థానికులైన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ ఛైర్మన్ కృష్ణ మోహన్ రావు, తదితర స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్​కు అండగా ఉండనున్నారు.

తెరాస, భాజపా హోరాహోరీ.. చక్కబెట్టుకొనేయత్నంలో కాంగ్రెస్‌

18 ఏళ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా పదవిలో ఉన్న భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Etela Rajender) అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి (Balmuri Venkat) స్థానికేతరుడు కావడం.. ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరిపోవడం కొంత మేర నష్టంగానే భావించాలి. 5 నెలల నుంచి నియోజకవర్గంలో మకాం వేసిన తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన స్థానికేతర ప్రచార తారలు ఈనెల 27న సాయంత్రం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లక తప్పదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పోల్ మేనేజ్​మెంట్ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

సీఎం కేసీఆర్ సభ...

మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నికను అధికార తెరాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఈనెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr Meeting) ఆధ్వర్యంలో హుజూరాబాద్​లో సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. హుజూరాబాద్ బై ఎలక్షన్​లో గెలిచి తీరుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ సభను విజయవంతంగా చేసేందుకు ప్రణాళికలు రచించారు.

ఉపఎన్నికకు సీపీఐ దూరం...

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సీపీఐ (CPI) దూరంగా ఉంటోంది. అందుకు కారణాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజల మనోభీష్టాలను ప్రతిబింబించాలి. కానీ అవి రోజురోజుకు అధికారం, డబ్బు, మద్యం ప్రలోభాలకు లోనవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికలు(Huzurabad by election campaign) వాటిని తలదన్నే రీతిలో ఎన్నికల తీరు అపహాస్యం చేస్తున్నాయి. ఇప్పటికే కోట్లాది నగదు, లక్షలాది రూపాయల విలువ చేసే మద్యం, బంగారం, వెండి వస్తువులు, చీరెలు, దుస్తులు నిఘా బృందాలకు పట్టుబడినట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో గంజాయి కూడా ఉండటం విస్తుగొలుపుతోంది. ఈ ఉపఎన్నికలలో రాజకీయాలు, విధానాల కన్నా వ్యక్తిగత దూషణ, ద్వేషం, కక్ష-కార్పణ్యాలు ప్రధానమైన తీరు ఏవగింపు కల్గిస్తోందని రెండు అధికార పార్టీ మధ్య కేంద్రీకృతమైన ఎన్నికల ప్రక్రియ తీరుకు దూరంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర సమితి ప్రకటించగా కార్యకర్తలు సైలెంట్ అయ్యారు.

ఇదీ చూడండి: Huzurabad By Election 2021 : బరిలో 20 మంది స్వతంత్రులు.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో గుబులు

Last Updated :Oct 17, 2021, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details