తెలంగాణ

telangana

రేపటి సభకు సీఎం కేసీఆర్ హాజరైతే ప్రధానితో గజమాల వేయిస్తా: బండి సంజయ్

By

Published : Apr 7, 2023, 7:21 PM IST

Tarun Chug Visits Bandi Sanjay Family : బండి సంజయ్‌ను చట్ట విరుద్ధంగా అరెస్టు చేశారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్​చుగ్​ ధ్వజమెత్తారు. కొందరు పోలీసులు బీఆర్​ఎస్ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. పదో తరగతి విద్యార్థిని ఐదేళ్లు డిబార్‌ చేయడం దారుణమని బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అయితే మోదీ కార్యక్రమానికి రావాలన్నారు.

bandisanjay
bandisanjay

Tarun Chug Visits Bandi Sanjay Family : బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్​చుగ్ కరీంనగర్​లోని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. బండి సంజయ్ అత్త చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన తరుణ్​చుగ్.. బీఆర్​ఎస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ అరెస్టు, బెయిల్​పై కీలక వ్యాఖ్యలు చేశారు.

పోలీసులు బీఆర్​ఎస్​ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చట్ట విరుద్ధంగా బండి సంజయ్​ను అరెస్ట్ చేశారని తరుణ్​చుగ్​ ధ్వజమెత్తారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న ఆయన.. కొంతమంది పోలీసులు బీఆర్​ఎస్​ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయారని మండిపడ్డారు. ఐపీఎస్ అధికారులు చేసిన ప్రమాణాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఒక ఎంపీని వారెంట్ లేకుండా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యునికే ఇలా జరిగిందంటే రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నట్లే అనిపిస్తోందన్నారు.

'టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మంత్రి మండలి లేదు.. అలీ బాబా 40 మంది దొంగల ముఠా పాలన సాగిస్తోంది. బండి సంజయ్​ను జైల్లో పెట్టినంత మాత్రాన పోరాటం ఆగదు. 27 మంది యువకులు ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాల ఉసురు తప్పక తగిలి తీరుతుంది. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు బీఆర్​ఎస్ నేతలు సిద్ధమా ? పాత్రికేయుల సమక్షంలో బీజేపీ, బీఆర్​ఎస్ నేతలు బహిరంగంగా చర్చిద్దాం. రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.'-తరుణ్​చుగ్​, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ

ఉగ్రవాదిలా సంజయ్​ను అరెస్టు చేశారు : బండి సంజయ్ సెల్​ఫోన్ ఎక్కడ పెట్టినా పోలీసులు ఇవ్వక తప్పదని తరుణ్​చుగ్ హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను దొంగలుగా మార్చేసిందన్న ఆయన.. ఆ ఫోన్ పోలీసుల నుంచి తీసుకునేందుకు తప్పకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. లోక్​సభ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఉగ్రవాదిలా సంజయ్​ను అరెస్టు చేశారన్నారు. నిజంగా నేరం చేసి ఉంటే ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 30 లక్షల మంది పిల్లలు గందరగోళంలో పడిపోతే సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు.

'పేపర్ లీకేజీ కేసులో పాత్ర ఉన్న మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్ చేయాలి. మా పోరాటం యువకుల కోసం సాగుతోంది. స్వార్థం కోసం చేయడం లేదు. ఈ పోరాటానికి పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిది. ఈ కుటుంబ పాలన నుంచి కేవలం నిజాయతీ గల మోదీ మాత్రమే కాపాడగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రోజుకొక్కరు ఫిరాయిస్తున్నారు. ముందు మీ పార్టీని కాపాడుకొనేందుకు రేవంత్​రెడ్డి యత్నిస్తే మంచిది.'-తరుణ్​చుగ్​, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ

కేసీఆర్ సభకు హాజరైతే మోదీతో గజమాల వేయిస్తా : కమలాపూర్​లో పదో తరగతి విద్యార్థిని ఐదేళ్లు డిబార్‌ చేయడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లిన వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధి కావాలా.. రాజకీయాలు కావాలా అని నిలదీశారు. కేసీఆర్‌ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అయితే మోదీ కార్యక్రమానికి రావాలన్నారు. అభివృద్ధి పనుల కోసం మోదీ వస్తున్నారు.. సీఎం కేసీఆర్ రేపటి సభకు హాజరైతే మోదీతో గజమాల వేయిస్తానన్నారు. కేసీఆర్ సభకు రాకపోతే మాత్రం తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. కరీంనగర్ నుంచి బయల్దేరిన బండి సంజయ్, తరుణ్ చుగ్ రాత్రికి హైదరాబాద్‌ బీజేపీ ఆఫీసుకు చేరుకోనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details