తెలంగాణ

telangana

కామారెడ్డిలో ఉద్రిక్తత.. బండి సంజయ్‌ అరెస్ట్

By

Published : Jan 6, 2023, 8:23 PM IST

Updated : Jan 7, 2023, 6:17 AM IST

Kamareddy
Kamareddy

20:17 January 06

బండి సంజయ్‌ అరెస్ట్.. హైదరాబాద్​కు తరలింపు

బండి సంజయ్‌ అరెస్ట్.. హైదరాబాద్​కు తరలింపు

Bandi Sanjay Arrest in Kamareddy:పారిశ్రామిక జోన్‌లో సాగు భూములు కలపొద్దని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కామారెడ్డిలో ఆందోళనకు దిగారు. కార్యకర్తలతో కలిసి అకస్మాత్తుగా చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి... ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. రెండు గంటల పాటు పోలీసులు, కార్యకర్తల మధ్య పెద్దఎత్తున తోపులాట జరిగింది. కలెక్టరేట్‌ లోపలికి అనుమతించాలని కార్యకర్తలు, రైతులు నినాదాలు చేశారు. కలెక్టరేట్‌ గేట్లు ఎక్కేందుకు కొందరు రైతులు, మహిళలు ప్రయత్నించారు. చివరకు పోలీసులు బండి సంజయ్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కించారు. ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు, రైతులు వాహనాన్ని అడ్డుకున్నారు.

కొందరు వాహనం అద్దాలు పగలగొట్టడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో... పలువురు కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన రైతు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. చట్టాలను అతిక్రమించి ప్రవర్తించినవారిని ఉపేక్షించేది లేదని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు .

అంతకు ముందు పారిశ్రామిక జోన్ కింద భూమి పోతుందని.. కలత చెంది ఆత్మహత్య చేసుకున్న రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని బండి సంజయ్‌ పరామర్శించారు. పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యేనని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. పంటలు పండే భూములను.. పారిశ్రామిక జోన్ కోసం లాక్కొని వ్యాపారులకు అప్పగించడం దారుణమని అన్నారు.

రైతులేం పాపం చేశారు: రైతులేం పాపం చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. కనీసం వాళ్ల అభిప్రాయం తీసుకోరా అని ప్రశ్నించారు. అన్నదాతల పొట్టకొట్టడమే రహస్య మాస్టర్ ప్లానా అని నిలదీశారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 8 గ్రామాల్లో 2,500 ఎకరాలు పోతోందని తెలిపారు. వారి అభిప్రాయం లేకుండా మాస్టర్‌ ప్లాన్‌ చేయడం సరికాదని అన్నారు. మున్సిపల్‌ తీర్మానం చేసేవరకు.. వారికి వాస్తవాలు చెప్పలేదని వివరించారు. రైతులు ఉద్యమం చేయకుంటే ముసాయిదా ఆమోదించే వారని ఆరోపించారు.

కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి కాదు.. రియల్ ఎస్టేట్ మంత్రి: కేటీఆర్‌ పురపాలకశాఖ మంత్రిగా కాకుండా రియల్‌ ఎస్టేట్‌ మంత్రిగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. పట్టణాల అభివృద్ధికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పట్టణాల అభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటుకు భాజపా వ్యతిరేకం కాదన్నారు. కామారెడ్డి బృహత్‌ ప్రణాళికను కుట్రకోణంతోనే రూపొందించారన్నారు. బంజరు, ప్రభుత్వ భూములను పారిశ్రామిక జోన్‌లో చేర్చాల్సి ఉండగా పొలాలను కలిపారన్నారు. కొందరు భారాస ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. సమావేశంలో భాజపా నేతలు అరుణతార, ఏనుగు రవీందర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐ దిల్లీ విభాగానికి అప్పగింత

ఆజాద్​కు బిగ్​ షాక్.. 17 మంది నేతలు గుడ్​బై.. తిరిగి కాంగ్రెస్​లో చేరిక

Last Updated :Jan 7, 2023, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details