తెలంగాణ

telangana

Dk Aruna Comments on Govt: 'పేదప్రజల పట్టాల జోలికొస్తే ఊరుకునేది లేదు'

By

Published : Dec 13, 2021, 7:02 PM IST

తెరాస ప్రభుత్వంపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లపట్టాలను అధికార పార్టీ లాక్కుంటోందని ఆరోపించారు.

Dk Aruna
డీకే అరుణ

Dk Aruna Comments on Govt: ప్రజా సమస్యల పట్ల అవగాహన లేని నాయకులు అధికార పార్టీ తెరాసలో ఉన్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పేదల ఇండ్ల స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్షం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆమె మాట్లాడారు. అవగాహన లేని లీడర్లకు అధికారం కట్టబడితే పరిస్థితులు దిగజారిపోతాయని విమర్శించారు.

గత ప్రభుత్వం పేదల కోసం ఇచ్చిన ఇళ్ల పట్టాలను తెరాస ప్రభుత్వం బలవంతంగా లాక్కొని ఆ స్థలంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని అరుణ మండిపడ్డారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు.

గద్వాల పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో 2013లో రెండోసారి ఎమ్మెల్యే అయిన సమయంలో నిరుపేదల కోసం సుమారు 2వేల ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన ఇళ్ల పట్టాల స్థానంలో తెరాస ప్రభుత్వం నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేసినట్లు వివరించారు. పట్టాదారులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టాదారులు పెద్ద సంఖ్యలో హాజరై... పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల స్థానంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం ఏంటీ? ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే... నియోజకవర్గంలో ఉన్న నాయకులు పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలను లాక్కున్నారు. తెరాసలో ఉండే నాయకులు ఇసుక, మట్టిపేరుతో దోచుకోవడం, దాచుకోవడం తప్ప పేద ప్రజల కష్టాల గురించి ఆలోచించరు. పేద ప్రజల పట్టాల జోలికొస్తే ప్రాణాలకు తెగించి పోరాడుతా.

-- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

ఈ అంశంపై కలెక్టర్, జిల్లా అధికారులు వెంటనే స్పందించి పేదలకు ఇచ్చిన పట్టాలను తిరిగి అందజేయాలని డిమాండ్ చేశారు.

'పేదప్రజల పట్టాల జోలికొస్తే ఊరుకునేది లేదు'

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details