ETV Bharat / city

Dk Aruna : కేంద్రం నిర్ణయంతో ఏపీ జల దోపిడీకి అడ్డుకట్ట

author img

By

Published : Jul 17, 2021, 12:28 PM IST

Dk Aruna
డీకే అరుణ

ఇన్నాళ్లు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(Dk Aruna) అన్నారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి న్యాయం జరగనుందని తెలిపారు. కేంద్ర జల్​శక్తి గెజిట్ నోటిఫికేషన్​ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

కేంద్ర జల్​శక్తి గెజిట్ నోటిఫికేషన్​ను స్వాగతిస్తున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(Dk Aruna) తెలిపారు. ఇన్నాళ్లు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. జగన్​తో కుమ్మక్కై కేసీఆర్.. దక్షిణ తెలంగాణ నోట్లో మట్టి కొట్టారు. కేంద్రం నిర్ణయంతో.. రాష్ట్రానికి న్యాయం జరగనుందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఏపీ జల దోపిడీకి అడ్డుకట్ట పడనుందని పేర్కొన్నారు.

క్షుణ్నంగా పరిశీలించాకే..

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికార పరిధిని నిర్దేశించే గెజిట్‌ నోటిఫికేషన్‌ను కేంద్ర జల్​శక్తి అధికారులు జాగ్రత్తగా రూపొందించినట్లు డీకే అరుణ(Dk Aruna) తెలిపారు. రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అంశానికున్న సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సీడబ్ల్యూసీ అధికారులు దీనిపై వ్యక్తిగత శ్రద్ధపెట్టి, రాత్రింబవళ్లు పనిచేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పదాన్ని క్షుణ్నంగా పరిశీలించాకే నోటిఫికేషన్‌ను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. దీనివల్ల ఇరు తెలంగాణకు లాభం చేరే అవకాశమున్నట్లు చెప్పారు.

తెలంగాణకు మేలు..

పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, పోతిరెడ్డిపాడు విస్తరణ వంటి ప్రాజెక్టు పనులను కేఆర్‌ఎంబీ నిలిపివేస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్​పై తెరాస నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారమే రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేసిన విషయాన్ని మర్చిపోవద్దని తెలిపారు. కేంద్రం తీసుకున్న రివర్ బోర్డుల పరిధి నిర్ణయం తెలంగాణకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డులకు ఎట్లాంటి సంబంధం లేదని.. సీడబ్ల్యూసీ అప్రూవ్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చని వెల్లడించారు. ఒకవేళ ఇప్పటి వరకు అనుమతి లేని ప్రాజెక్టులేమైనా ఉంటే వాటి డీపీఆర్​లు సమర్పించి 6 నెలల్లోగా అనుమతి తీసుకునే అవకాశం ఉందని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.