తెలంగాణ

telangana

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు

By

Published : Nov 29, 2020, 11:27 AM IST

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని... డిసెంబరు 25 నుంచి జనవరి 3 వరకు పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. కల్యాణమస్తు పునఃప్రారంభించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

ttd
వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని డిసెంబరు 25 నుంచి జనవరి 3 వరకు పది రోజులపాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. లోగడ ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల్లో మాత్రమే ఈ దర్శనం లభించేది. తిరుమలలో శనివారం తితిదే పాలక మండలి సమావేశం అనంతరం వైకుంఠద్వార దర్శనంలో తీసుకురానున్న మార్పులపై ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం విలేకరులకు వివరించారు. వాస్తవానికి గతేడాదే పది రోజుల దర్శనానికి ప్రతిపాదించామని ఆయన గుర్తు చేశారు. ఓ భక్తుడు అప్పట్లో ఏపీ హైకోర్టులో కేసు వేసినందున తగిన నిర్ణయం తీసుకోవాలని నాడు న్యాయమూర్తులు సూచించారని తెలిపారు. దీనికి అనుగుణంగా 26 మంది మఠాధిపతులు/పీఠాధిపతులతోపాటు జియ్యంగార్లు, ఆగమ సలహా మండలితో చర్చించి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరచి ఉంచాలని వీరందరూ లిఖితపూర్వకంగా తెలిపారన్నారు. ఆనంద నిలయం- అనంత స్వర్ణమయం ప్రాజెక్టు కొనసాగించడం లేదని ఆయన తెలిపారు. ఈ పథకం కింద దాతలు లోగడ ఇచ్చిన విరాళాలను వెనక్కి తీసుకోవచ్చని చెప్పామని.. ఎవరూ ముందుకు రాలేదని వివరించారు.

  • 'భక్తులిచ్చిన నిరర్థక ఆస్తులను విక్రయించాలని భావించాం. అయితే వీటిని విక్రయించకూడదని మేలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించాం. తితిదే ఆస్తులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామని అప్పట్లోనే ప్రకటించాం. దీనికి అనుగుణంగా ప్రస్తుతం శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. ప్రస్తుతానికి తితిదేకు వివిధ ప్రాంతాల్లో 1128 ఆస్తులున్నాయి. వీటిల్లో కొన్ని నిరుపయోగంగా ఉండటంతోపాటు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇలాంటివి గుర్తించి భక్తుల కోసం ఎలా వినియోగించవచ్చనే అంశంపై అధ్యయనానికి కమిటీని నియమిస్తున్నాం.
  • తితిదే డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీల్లో పెట్టాలని లోగడ అనుకున్నాం. దీనివల్ల ఎక్కువ వడ్డీ సమకూర్చుకోవచ్చని భావించాం. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడినందున ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాం. ఎక్కువ వడ్డీ ఎవరిస్తారో పరిశీలించి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లోనే పెట్టుబడి పెడతాం.
  • తిరుమల ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహద్వారాలకు బంగారు తాపడం చేయిస్తాం.
  • కాలినడక మార్గంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అక్కడ దెబ్బతిన్న గాలిగోపురాలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయిస్తాం.
  • తిరుమలలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 150 ఎలక్ట్రిక్‌ బస్సులను నడుపుతాం. ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాశాం.
  • రూ.29 కోట్లతో సాధారణ భక్తుల కాటేజీల మరమ్మతులు చేపడతాం. కొవిడ్‌ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న అన్నమాచార్య కళాకారులకు రూ.10వేలు ఇస్తాం.
  • తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకలో హిందూ ధర్మ ప్రచార రథాలను మళ్లీ ప్రారంభిస్తాం. కొత్తగా 6వాహనాలను కొంటాం.
  • ‘కల్యాణమస్తు’ను పునరుద్ధరించనున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
  • తమిళనాడులోని ఉలందూరులో ఆలయ నిర్మాణానికి ధర్మకర్తల మండలి సభ్యుడు కుమరగురు నాలుగెకరాలను ఇస్తున్నారు. ఆలయ నిర్మాణానికి రూ.10 కోట్లను ఇవ్వడానికీ సిద్ధమయ్యారు.

తితిదే వద్ద 7753.66 ఎకరాలు

శ్రీవారికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 7753.66 ఎకరాల వ్యవసాయ/వ్యవసాయేతర భూమి ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి స్థిరాస్తులకు సంబంధించి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి శనివారం శ్వేతపత్రం విడుదల చేశారు.

శ్వేతపత్రంలో పేర్కొన్న వివరాలు

  • తితిదేకు మొత్తం 233 ప్రాంతాల్లో 2085.41 ఎకరాల వ్యవసాయ, 895 ప్రాంతాల్లో 6003.48 ఎకరాల (29056843.88 చదరపు గజాలు) వ్యవసాయేతర భూములున్నాయి.
  • 1974 నుంచి 2014 వరకు 335.23 ఎకరాలకు సంబంధించి 141 ఆస్తులను విక్రయించారు. ఇందులో 293.02 ఎకరాల 61 వ్యవసాయ, 42.21 ఎకరాల (204342.36 చ.గజాలు) 80 వ్యవసాయేతర భూములున్నాయి. వీటి ద్వారా తితిదేకు రూ.6.13 కోట్ల ఆదాయం వచ్చింది.
  • నవంబరు 28 నాటికి తితిదేకు 7753.66 ఎకరాల వ్యవసాయ/వ్యవసాయేతర భూములున్నాయి. ఇందులో 1792.39 ఎకరాల వ్యవసాయ ఆస్తులతోపాటు 5961.27 ఎకరాల (28852501.52 చ.గజాలు) వ్యవసాయేతర ఆస్తులున్నాయి.
  • మొత్తం ఇప్పుడున్న వాటితోపాటు విక్రయించిన ఆస్తులతో కలిపి 1128 ఆస్తుల వివరాలను తితిదే వెబ్‌సైట్‌ www.tirumala.orgలో పొందుపర్చారు.
  • ఇదీ చదవండీ:రైతులకు పంట రుణం పుట్టట్లేదు!

ABOUT THE AUTHOR

...view details