ETV Bharat / state

రైతులకు పంట రుణం పుట్టట్లేదు!

author img

By

Published : Nov 29, 2020, 7:41 AM IST

పంట రుణాల పంపిణీలో సాంకేతిక సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల ఒకటిన యాసంగి(రబీ) సీజన్‌ మొదలైనప్పటి నుంచి రుణాల పంపిణీ నత్తనడకన సాగుతోంది. ఈ సీజన్‌లో రైతులకు మొత్తం రూ.24 వేల కోట్ల పంట రుణాలివ్వాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి నెల అక్టోబరులో కేవలం రూ.4,500 కోట్ల రుణాలే బ్యాంకులిచ్చినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్లు కొంతకాలం నిలిపివేయడం, కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పంటరుణాల పంపిణీపై ప్రభావం పడింది.

formers
రైతుల ఇక్కట్లు.. పంట రుణం పుట్టట్లేదు!

గతంలో బ్యాంకు రుణం తీసుకున్న రైతు పాత బాకీని వడ్డీతో సహా ఇప్పుడు చెల్లిస్తే తిరిగి పంటరుణాన్ని మళ్లీ రెన్యూవల్‌ పేరుతో ఇస్తున్నారు. గతంలో రుణం తీసుకోని, పాత బకాయిలు ఏమీ లేని కొత్త రైతులకు మాత్రం పలు బ్యాంకులు గత నెల రోజులుగా రుణాలివ్వడం లేదు. రైతు కొత్తగా పంటరుణం కావాలని సహకార బ్యాంకుకు వస్తే సహకార చట్టం ప్రకారం అవసరమైన ఛార్జి డిక్లరేషన్‌ ఫారంను రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి తీసుకురమ్మని సిబ్బంది చెపుతున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేసినందున ఈ ఫారాలు లేక కొత్త రైతులకు రుణాల పంపిణీ నిలిపివేశారు.

ఒత్తిడి చేసే రైతు పాసుపుస్తకం తీసుకుని..

ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. అయినా పంటరుణాల పంపిణీ పెరగలేదు. సాధారణంగా రైతులకు ‘స్వల్పకాలిక(ఎస్‌టీ), దీర్ఘకాలిక(ఎల్‌టీ) రుణాలను బ్యాంకులిస్తాయి. ఎలాంటి పూచీకత్తు అడగకుండా రూ.1.6 లక్షల దాకా రుణాలివ్వాలన్న రిజర్వుబ్యాంకు ఆదేశాలను పక్కనపెట్టి రైతు నుంచి పట్టాదారు పాసుపుస్తకాన్ని తీసుకుని మాత్రమే ఎస్‌టీ రుణాలిస్తున్నాయి. ధరణి పోర్టల్‌లో రైతు భూమి వివరాలు తీసుకుని.. పంటరుణం ఇచ్చి.. ఆ వివరాలు నమోదు చేస్తే చాలని.. పాసుపుస్తకం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను కోరింది. తమకు ధరణి పోర్టల్‌లో రుణం వివరాలు నమోదుకు అవకాశం ఇంకా ఇవ్వనందున కొత్త రుణాలివ్వడం లేదని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు.

ధరణిలో రుణం నమోదు చేసే అవకాశం ఇచ్చేదాకా కొత్త రుణాలు కష్టమేనన్నారు. వ్యవసాయంలో మౌలిక సదుపాయాల కల్పనకు భూములను తనఖా పెడితే దీర్ఘకాలిక(ఎల్‌టీ) రుణం బ్యాంకులివ్వాలి. ఇది తీసుకోవాలంటే గతంలో భూమిని బ్యాంకు పేరుతో మార్టిగేజ్‌ చేయించి ఆ పత్రాలను అందజేసేవారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఎల్‌టీ రుణాల పంపిణీ నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ మార్టిగేజ్‌ అధికారం తహసీల్దార్‌తో చేయాలా లేక రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో చేయాలా అనేది ప్రభుత్వం తేల్చలేదు. ఈ కారణంతో దీర్ఘకాలిక రుణాల పంపిణీ ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.