తెలంగాణ

telangana

జీవో 317 వివాదంపై.. సీఎం కేసీఆర్‌కు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి లేఖ

By

Published : Jan 23, 2022, 7:58 PM IST

USPC letter to CM KCR: సీఎం కేసీఆర్‌కు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి- యూఎస్పీసీ జాక్టో లేఖ రాసింది. బదిలీల విషయమై ఉద్యోగుల అభ్యంతరాలు పట్టించుకోకుండా కేటాయింపులు జరిగాయని లేఖలో ఆరోపించింది. 317 జీవోలోని లోపాలు సవరించి.. ఉద్యోగ నియామకాల్లో స్థానికతను కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

uspc letter to cm kcr
సీఎం కేసీఆర్​కు జాక్టో లేఖ

USPC letter to CM KCR: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల కేటాయింపుల విషయంలో లోపాలను సవరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ- యూఎస్పీసీ జాక్టో బహిరంగ లేఖ రాసింది. నూతన స్థానిక కేడర్లలో ఉద్యోగులను సర్దుబాటు చేయడానికి గతేడాది డిసెంబర్‌ 6 న జారీ చేసిన 317 జీవో మార్గదర్శకాలు వివాదాస్పదంగా మారాయని కమిటీ సభ్యులు లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల అభ్యంతరాలు, అభ్యర్థనలను పట్టించుకోకుండా కేటాయింపులు చేశారని ఆరోపించారు. తద్వారా కొందరు ఉద్యోగులు స్థానికతను శాశ్వతంగా కోల్పోయారని వెల్లడించారు. సీనియారిటీ జాబితాలు సమగ్రంగా తయారు చేయలేదని.. ప్రత్యేక కేటగిరి అభ్యర్థులను సక్రమంగా పరిశీలించలేదని విమర్శించారు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదనే అంశాలను లేఖలో లేవనెత్తారు.

మీ దృష్టికి రాలేదు

జిల్లాల కేటాయింపుల్లో కొన్నిచోట్ల అక్రమాలు జరిగాయని.. భార్యాభర్తలను ఒకే స్థానిక కేడర్‌కు బదిలీ చేయాల్సి ఉండగా అలా చేయలేదని లేఖలో ఆరోపించారు. దీంతో పలువురు ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని.. నష్టపోయిన ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని అప్పీలు చేసుకుని నెలరోజులు గడిచినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టినా అవి ముఖ్యమంత్రిగా మీ దృష్టికి ఉన్నతాధికారులు తీసుకురావడంలో విఫలమయ్యారని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులకు అనుమతి ఇచ్చినట్లయితే అన్ని సమస్యలను సమగ్రంగా వివరించగలమని.. తమ వినతిని సానుకూలంగా పరిగణిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో వివరించారు.

రాష్ట్రంలో కొత్తగా 33 జిల్లాల ఏర్పాటు తర్వాత 7 జోన్లు 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసి 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను శాఖల వారీగా జిల్లా, జోనల్ మల్టీ జోనల్‌ క్యాడర్లకు వర్గీకరించారు.

ఇదీ చదవండి:పారిశ్రామిక మౌలిక వసతులకు నిధులు కోరుతూ.. కేంద్రానికి మంత్రి కేటీఆర్​ లేఖ

ABOUT THE AUTHOR

...view details