ETV Bharat / city

నిర్మలా సీతారామన్​కు మంత్రి కేటీఆర్ 5 లేఖలు.. ఏఏ అంశాలపై అంటే..?

author img

By

Published : Jan 23, 2022, 6:17 PM IST

Updated : Jan 23, 2022, 7:27 PM IST

KTR Letter To Nirmala Seetharaman: వచ్చే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​లో రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని కోరుతూ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు మంత్రి కేటీఆర్ ఐదు వేర్వేరు లేఖలు రాశారు. తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన.. ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్​లో నిధులను కేటాయించాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వినూత్నమైన విధానాలతో అభివృద్ధిలో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణకు కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్ లేఖల్లో పేర్కొన్నారు.

Minister KTR letter to Central minister Nirmala Seetharaman for industrial infrastructure funds
Minister KTR letter to Central minister Nirmala Seetharaman for industrial infrastructure funds

KTR Letter To Nirmala Seetharaman: త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ను మంత్రి కేటీఆర్​ కోరారు. ఈ మేరకు పలు అంశాల పైన నిర్మలాసీతారామన్​కు కేటీఆర్ సవివరమైన లేఖలు రాశారు. నిర్మలా సీతారామన్​ సూచనతో తెలంగాణలో నూతన నేషనల్ డిజైన్ సెంటర్ క్యాంపస్​ను ఏర్పాటు చేయడం లేదని.. ఇప్పటికే హైదరాబాదులో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రకక్షన్​లో నేషనల్ డిజైన్ సెంటర్ కార్యకలాపాలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన పరికరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్​కు సంబంధించి 8 ఏళ్ల పాటు కేంద్రం నుంచి నిర్వహణ ఖర్చులు భరించాలన్నారు. ఇందులో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్​లను గుర్తించిందన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్- జహీరాబాద్ నొడ్ల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సాయాన్ని మరింత వేగంగా కల్పించాలన్నారు. ప్రతిపాదిత రెండు నోడ్లలో మౌలిక వసతుల కల్పన చేసేందుకు సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ నాగపూర్ కారిడార్​లో భాగంగా మంచిర్యాల నోడ్​ను కొత్తగా గుర్తించాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్​లలోని ఈ మూడు నోడ్లకు 2వేల కోట్ల రూపాయల చొప్పున మొత్తం 6 వేల కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ - విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ లను జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ కార్యక్రమంలో భాగంగా చేపట్టేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే హుజూరాబాద్, జడ్చర్ల- గద్వాల్ - కొత్తకోట నొడ్లను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రెండింటికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతామని.. ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్​లలో ఒక్కొదానికి 1500 కోట్ల రూపాయల చొప్పున.. మొత్తం 3వేల కోట్ల రూపాయలను రానున్న బడ్జెట్లో కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్​ను చేర్చాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ దేశానికి భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉందని.. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అత్యంత సులువని వెల్లడించారు. దీంతో పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్​తో పాటు పలు అనేక రక్షణ సంస్థలు ఇక్కడ ఉన్నాయన్నారు. వీటితో పాటు టాటా అడ్వాన్డ్స్​ సిస్టమ్స్​తో పాటు అనేక ఇతర ప్రముఖ ప్రైవేట్ రక్షణ, ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే హైదరాబాద్​లో రెండు ఏరో స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కులు ఉన్నాయని.. దీంతో పాటు త్వరలో మరో భారీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జహీరాబాద్ నిమ్జ్​లోనూ ఏరోస్పేస్ క్లస్టర్​ని సిద్ధం చేసే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయన్నారు.

బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, సీ కోర్స్స్కి, రువాగ్ వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్​ను ఎంచుకున్నాయన్నారు. ఇక్కడ కనీసం 1000కి పైగా సూక్ష్మ మధ్యతరహా కంపెనీలు డిఫెన్స్ ఏరోస్పేస్ రంగంలో పనిచేస్తున్నాయన్నారు. ఉన్నత విద్య సంస్థలతో పాటు అద్భుతమైన మానవ వనరులతో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి కావలసిన అన్ని అవకాశాలు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్లో భాగంగా గుర్తించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. కేంద్రం చెబుతున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫార్మా రంగంలో అద్భుతమైన ప్రగతికి హైదరాబాద్ ఫార్మాసిటీ కేంద్రంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా సిటీకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హోదాకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. గతంలో హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలతో మాట్లాడిన సందర్భంగా ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాధాన్యత ఉన్నట్లు అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ కంపెనీల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 64 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 5.6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు. మాస్టర్ ప్లాన్ కోసం 50 కోట్ల రూపాయలు... రోడ్ల లింకేజీ, నీటి, విద్యుత్ సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల కోసం 1399 కోట్ల రూపాయలు, జీరో లిక్విడ్ డిస్ఛార్జ్ ఆధారంగా పనిచేసే ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి అంతర్గత మౌలిక వసతుల కోసం మరో 3554 కోట్ల రూపాయలను, మొత్తంగా అన్ని కలిపి హైదరాబాద్ ఫార్మా సిటీకి 5 వేల కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated :Jan 23, 2022, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.