తెలంగాణ

telangana

TSPSC పేపర్ లీకేజీ ఎఫెక్ట్‌.. ఆ పరీక్షనూ వాయిదా వేయాలని డిమాండ్

By

Published : Apr 3, 2023, 3:33 PM IST

TSPSC Paper Leakage Case Updates టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ముగ్గరు నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్ మోటార్‌ వెహికిల్స్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షపై స్పష్టతనివ్వాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్ష వాయిదా వేసి తదుపరి తేదీని త్వరగా ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.

Tspsc
Tspsc

TSPSC Paper Leakage Case Updates టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసులో ముగ్గరు నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ సహాయకుడిగా పనిచేసిన ప్రవీణ్‌ కుమార్‌ నుంచి గ్రూప్ వన్‌ ప్రిలిమినరీ ప్రశ్న పత్రాలు తీసుకున్న కమిషన్‌ ఉద్యోగులు రమేష్‌, సురేష్‌, షమీమ్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు... 5 రోజుల పాటు విచారించారు. గడువు ముగియటంతో ఈ ముగ్గురికీ వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన ప్రశాంత్‌రెడ్డి, తిరుపతయ్య, రాజేందర్‌కుమార్‌ కస్టడీ పిటిషన్‌పై కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోనుంది.

ఇక టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు వ్యక్తిగత సహాయకుడిగా ప్రవీణ్ వ్యవహరిస్తుండగా... ఈ మొత్తం వ్యవహారంలో కార్యదర్శి పాత్ర కీలకంగా మారింది. ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాస్తున్నప్పటికీ సెలవుపై ఎందుకు పంపలేదని అడిగారు. అతడికి 100కు పైగా మార్కులు వచ్చినా.. అనుమానం రాకపోవడానికి కారణాలు ఏంటని అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక నిందితుడు రాజశేఖర్‌రెడ్డి, లీకైన ప్రశ్నపత్రంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన సురేశ్‌ ఇద్దరూ టీఎస్​పీఎస్సీలో ఒప్పంద ఉద్యోగులే. ఒప్పంద ఉద్యోగుల నియామకం, ఎంపిక ప్రక్రియపై... అనితా రామచంద్రన్ నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం.

టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితురాలు రేణుక రాఠోడ్‌ బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం సరిగా లేదని, ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకోవాలని ఆమె బెయిల్‌ కోరగా... దర్యాప్తు కీలక దశలో ఉందని.. రేణుక బయటకు వస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిట్‌ వాదనలు వినిపించింది. దీంతో న్యాయస్థానం రేణుక బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇక టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్ మోటార్‌ వెహికిల్స్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షపై స్పష్టతనివ్వాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన పరీక్ష పైనా కమిషన్‌ అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులు వినతి పత్రం ఇవ్వడానికి టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చారు. పరీక్ష వాయిదా వేసి తదుపరి తేదీని త్వరగా ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా ఈ పరీక్ష కోసం సిద్దమవుతున్నామని వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details