తెలంగాణ

telangana

Booster Dose Vaccination: రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్‌ డోస్‌ పంపిణీ.. అదే రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సినేషన్

By

Published : Jan 10, 2022, 8:56 PM IST

Booster Dose Vaccination: రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్‌ డోస్‌ పంపిణీ ఇవాళ ప్రారంభమైంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పరిశీలించారు. చార్మినార్ యునానీ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్​ను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి అదే రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించనున్నట్లు తెలిపారు.

booster dose in telangana
బూస్టర్‌ డోస్ వేస్తున్న వైద్యసిబ్బంది

Booster Dose Vaccination: కరోనా కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా బూస్టర్‌ డోస్‌ పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. హైదరాబాద్‌లో బూస్టర్ డోస్ పంపిణీని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. గతంలో వ్యాక్సిన్ తీసుకున్న వారికి అదే రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సినేషన్ వేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించవచ్చని తెలిపారు.

అదే రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సినేషన్

Harish rao on vaccination: చార్మినార్ యునానీ ఆస్పత్రిలో బూస్టర్ డోస్ పంపిణీని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ అందించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో వ్యాక్సిన్ తీసుకున్న వారికి అదే రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించనున్నట్లు తెలిపారు. కొవిన్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లే వెసులుబాటు ఉందని చెప్పారు. రెండో డోస్ వేసుకుని 9 నెలలు పూర్తైవారికి బూస్టర్‌డోస్ ఇస్తామన్న హరీశ్ రావు... వ్యాక్సినేషన్‌కు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. త్వరలోనే యునానీ ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరిస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

ప్రపంచంలోనే మనదే అత్యధికం

Kishan reddy on covid vaccination: ప్రపంచంలోనే అత్యధికంగా వాక్సిన్లు పంపిణీ చేసిన దేశం భారత్ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కిషన్‌రెడ్డి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. దేశంలో 8 కోట్ల మంది బాలబాలికలు ఉంటే ఇప్పటివరకు 2 కోట్లమంది టీకా తీసుకున్నారని వివరించారు. ఒమిక్రాన్ దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న ఆయన.. కరోనా కట్టడికి అంతా సహకరించాలని సూచించారు. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించవచ్చుకోవచ్చని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకైతే కేంద్రానికి లాక్‌డౌన్ ఆలోచన లేదన్న కిషన్‌రెడ్డి.. సంక్రాంతి తర్వాత పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలోనూ హెల్త్ కేర్ , ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోస్‌ పంపిణీ ప్రక్రియ కొనసాగింది.

ABOUT THE AUTHOR

...view details