ETV Bharat / state

రేపట్నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Jan 9, 2022, 6:12 PM IST

Updated : Jan 9, 2022, 7:01 PM IST

CM KCR Review on Covid: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్​ సమీక్ష
CM KCR Review on Covid: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్​ సమీక్ష

18:03 January 09

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్​ సమీక్ష

CM KCR Review on Covid: రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సచివాలయ నిర్మాణ పనుల పురోగతి, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.

కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వైద్య-ఆరోగ్యశాఖ అప్రమత్తతపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో సమీక్షించారు. మంత్రి హరీష్ రావు, వైద్య-ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత సమీక్షలో సీఎం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలను సీఎంకు నివేదించారు. ఆక్సిజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా ఉన్నాయని చెప్పారు. కొవిడ్ పట్ల భయాందోళనలు అక్కర్లేదన్న కేసీఆర్.. ప్రజలు అశ్రద్ధ చేయకుండా మాస్కుల ధారణ, శానిటైజేషన్, భౌతిక దూరం లాంటి స్వీయ నియంత్రణా చర్యలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా టీకాలు వేసుకోవాలని కోరారు.

రేపట్నుంచి బూస్టర్​ డోసు..

ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నందున తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా తమ పిల్లలకు టీకాలు వేయించాలని అన్నారు. సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోసును ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. అర్హులైన వారందరూ తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలని కోరారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరి ఇళ్లలో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని సీఎం అన్నారు.

సచివాలయ నిర్మాణ పనులపై సమీక్ష

సచివాలయ నిర్మాణ పనులన్నీ సమాంతరంగా, వేగంగా సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్న సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఇంజనీర్లు, అధికారులు, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజతో సీఎం సమీక్షించారు. ముఖ్యమైన పనులతో పాటు, ల్యాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. సచివాలయానికి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసు వారికి కావాల్సిన వసతులు, తదితర అంశాలపై డీజీపీ మహేందర్ రెడ్డితో సంప్రదించి చర్యలు చేపట్టాలని చెప్పారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు

కేంద్రంపై సీఎం అసహనం

గోదావరిపై నిర్మాణంలో ఉన్న ఆరు ప్రాజెక్టులకు అనుమతుల కోసం డీపీఆర్​లు పంపి ఐదు నెలలు గడిచినా కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు రాకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో సీఎం ప్రగతిభవన్​లో సమీక్ష నిర్వహించారు. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్​లు, అనుమతుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జలసంఘం కోరుతున్న అన్ని వివరాలు, అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరగా అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర ఎత్తిపోతలు, చనాఖ - కొరాట ఆనకట్ట, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్​లు సమర్పించి ఐదునెలలు గడిచినా సీడబ్ల్యూసీ నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ ను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డుకు సమర్పించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రధాన ప్రాజెక్టుల టెండర్లకు చర్యలు చేపట్టాలి..

గోదావరి బోర్డు అధికారులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరిపి ఐదు గోదావరి ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర జలసంఘానికి పంపించాలని అధికారులకు స్పష్టం చేశారు. సాగునీటి శాఖలో ప్రస్తుత సంవత్సరంలో ముఖ్యమైన ప్రాజెక్టుల టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వపై నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు, గట్టు ఎత్తిపోతల, కామారెడ్డి - ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులు, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులు, ప్రాణహిత ప్రాజెక్టు ఆనకట్ట, చెన్నూరు ఎత్తిపోతల, కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాలు సంపూర్ణమవుతాయన్న సీఎం... ప్రభుత్వం నిర్ధేశించుకున్న ప్రతిపాదిత లక్ష్యాలు చేరుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated :Jan 9, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.