తెలంగాణ

telangana

Telangana Formation Day 2023 : నీళ్లు,నిధులు, నియామకాలు కోసమే పోరాటం.. నాటి ఉద్యమ ఫలాలు నేడు యువతకు

By

Published : Jun 2, 2023, 4:26 PM IST

Telangana Decade Day 2023 : నీళ్లు.. నిధులు.. నియామకాలు వీటి కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి, కేవలం నీళ్లు అందితేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్లా.. అందుకే ఖజానా పెంచుకోవడంతో పాటు.. నియామకాలు కూడా జరగాలని సీఎం కేసీఆర్​ ఆకాక్షించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి ఉండాలని కలలు కన్నారో.. వాటిని కళ్లకు కట్టినట్లు ఈనాడు చూపిస్తున్నారు. ఒక్క ఈ రంగంలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ తెలంగాణ పురోభివృద్ధి సాధిస్తోంది. ఈ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని ఒకసారి తెలుసుకుందాం.

Telangana Formation Day
Telangana Formation Day

హైదరాబాద్​ ప్రపంచ ఫార్మా రాజధానిగా అవతరించబోతోంది

Telangana Formation Day Celebrations : ఎంతో మంది త్యాగాల ఫలం తెలంగాణ. ఒకప్పుడు అన్ని రంగాల్లో దేశంలోనే చిట్టచివర ఉన్న తెలంగాణ జిల్లాలు. ఇప్పుడు ప్రతి రంగంలోనూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధిలో కూడా దూసుకుపోతున్నాయి. పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో టీఎస్ ఐపాస్ విధానం తీసుకువచ్చారు. దీంతో పెట్టుబడులు గణనీయంగా పెరిగి.. ఇప్పటికి రూ.2,61,732 కోట్లకు చేరుకుంది. ఈ పెట్టుబడులతో 23,065 యూనిట్ల ద్వారా 15,74,798 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తూ యువతకు నైపుణ్య శిక్షణ కోసం టాస్క్, టీహబ్, వీహబ్, టీవర్క్స్ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.

Telangana Day 2023 : ఐటీ రంగంపై సర్కార్​ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రపంచస్థాయి సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ భాగ్యనగరం ఐటీ రంగంలో దూసుకుపోతోంది. భారతదేశ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి గాంచిన బెంగళూరును కూడా అధిగమించేలా పురోగతిని సాధిస్తోంది అంటే అందుకు ప్రభుత్వ విధానాలే కారణం. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఐటీ ఎగుమతుల విలువు రూ.57 వేల కోట్లు ఉంటే.. 2022నాటికి రూ.1,83,569 కోట్లకు చేరుకుంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేశాయి.

"తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాల్లోనే దేశంలోనే నంబర్​ 1 రాష్ట్రంగా మారింది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించింది. దేశంలో ఏటా వస్తున్న ఐటీ ఉద్యోగాల్లో మూడోవంతు హైదరాబాద్ నుంచే ఉంటున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. హైదరాబాద్​ విశ్వనగరంగా వ్యాప్తి చెందుతోంది. ఒకప్పుడు తెలంగాణలో అభివృద్ధి అంటే అందరూ అపహాస్యం చేశారు." - దాసోజు శ్రవణ్​ కుమార్​, బీఆర్​ఎస్​ సీనియర్​ నేత

విద్య, వైద్య రంగంపై దృష్టి : ఈ కీలకమైన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మన ఊరు- మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొత్తగా జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. మహిళా విశ్వవిద్యాలయం, గిరిజన, సంస్కృతం, అటవీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 12 వైద్య కళాశాలను ప్రారంభించగా.. ఈ ఏడాది మరో 9 కాలేజీలను ప్రారంభించేందుకు సర్కార్​ సిద్ధమైంది.

ఫార్మా రాజధానిగా భాగ్యనగరం : వైద్య రంగం అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుంటోంది. బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయడం.. వైద్యులను నియమించడం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచేలా కేసీఆర్​ కిట్​ కార్యక్రమం తీసుకువచ్చింది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్​, కంటి వెలుగు వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. హైదరాబాద్​ను ప్రపంచ ఫార్మా రాజధానిగా చేయాలని సంకల్పించుకుంది.

స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు : తెలంగాణ ఉద్యమ ఫలాలు యువతకు అందించేందుకు సర్కార్​.. స్థానికులకే 95 శాతం ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చట్టం తీసుకువచ్చింది. సర్కార్ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేట్​ పరంగా ఉద్యోగాలకు చర్యలు తీసుకుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే రెండు కార్యక్రమాలను చేపట్టి.. జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంది. పోలీస్​ సిబ్బందిని పెంచడంతో పాటు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్న నగరంగా భాగ్యనగరం నిలిచింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details