తెలంగాణ

telangana

కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటు: కేసీఆర్‌

By

Published : Dec 23, 2022, 12:06 PM IST

Updated : Dec 23, 2022, 2:14 PM IST

CM KCR paid tribute to Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ మరణం పట్ల రాజకీయ, సినీప్రముఖులు నివాళి అర్పించారు. విభిన్న పాత్రల్లో... విలక్షణ నటనతో నవరస నటనా సార్వభౌమగా పేరొందిన కైకాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వైవిధ్యమైన నటనతో మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

CM KCR
CM KCR

CM KCR paid tribute to Kaikala Satyanarayana: వెండితెరపై నవరసాలు పండించిన నటశిఖరం కైకాల సత్యనారాయణ మృతి పట్ల అభిమానలోకం విషాదంలో మునిగిపోయింది. కైకాల మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ... తన వైవిధ్యమైన నటన ద్వారా... మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కైకాల పొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. కైకాల కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు.. నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో కైకాల చెరగని ముద్ర వేసుకున్నారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా సీఎం అభివర్ణించారు. లోక్‌సభ సభ్యునిగా ఆయన చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం కొనియాడారు. ఆయన అందించిన సేవలకు గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రేపు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరుగుతాయని మంత్రి తలసాని వెల్లడించారు.

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ఆర్థిక, వైద్య మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. సుమారు 800 సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి... నవరసనట సార్వ భౌముడిగా తెలుగు‌చలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. కైకాల మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని హరీశ్​ రావు పేర్కొన్నారు. జానపద, పౌరాణిక, సాంఘిక, కుటుంబ కథా చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించి, ప్రతినాయకుడుగా విలక్షణ నటనతో సినీ అభిమానుల మనస్సులో స్థానం సంపాదించుకున్న గొప్ప నటుడని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

విలక్షణ నటుడిగా.. ఘటోత్కచుడిగా సినీ అభిమానులను మెప్పించి, అనేక చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ మృతి చిత్ర సీమకు తీరని లోటు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల మృతిపట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాఠోడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని, శ్రీనివాస గౌడ్, తదితరులు సంతాపం తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details