తెలంగాణ

telangana

మోదీ వచ్చే.. బీజేపీలో సరికొత్త జోష్​ తెచ్చే..!

By

Published : Apr 9, 2023, 7:14 AM IST

PM Modi Speech at Parade Grounds Meeting : తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీలో ప్రధాని మోదీ పర్యటన సరికొత్త జోష్‌ నింపింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రధాని ప్రకటన.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు.. ఎన్నికల ఏడాదిలో సానుకూలంగా ఉంటుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

PM Modi
PM Modi

ప్రధాని వచ్చే... బీఆర్​ఎస్​పై విమర్శలు గుప్పించే.. బీజేపీలో సరికొత్త జోష్​ తెచ్చే

PM Modi Speech at Parade Grounds Meeting : శాసనసభకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు రావడంతో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడం పరిస్థితులకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పరేడ్‌ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం జోష్‌ నింపింది. ఈ ఏడాదిలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్, బీఆర్​ఎస్​లను లక్ష్యంగా చేసుకుని ప్రధాని విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ రాష్ట్ర మంత్రులు, బీఆర్​ఎస్​ నేతలు బలంగా చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేలా ప్రధాని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని.. బీఆర్​ఎస్ సర్కారే సహకరించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒక విషయం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. దుఃఖం, ఆవేదనను కలిగిస్తోంది. రాష్ట్ర (తెలంగాణ) ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించనందున కేంద్రం చేపట్టే అనేక పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆ ఫలితం తెలంగాణ ప్రజలకు, మీకే నష్టం కలుగుతోంది. ఈ రాష్ట్ర (తెలంగాణ) ప్రభుత్వానికి నాది ఒక్కటే విజ్ఞప్తి. అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బంది రానీయకుండా చూడాలని కోరుతున్నాను. అభివృద్ధి వేగంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.'- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

అవినీతి సొమ్ము మొత్తం కుటుంబాల వద్దకే : అవినీతిలో కూరుకుపోయిన విపక్షాలు.. ఒక్కటవుతున్నాయని ప్రధాని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అవినీతికి ఎలా దారి తీస్తుందనే అంశాలపైనా సూటిగా మాట్లాడారు. ఇలాంటి అవినీతిపై వ్యతిరేకంగా పోరాడాలా? వద్దా? అంటూ ప్రజలనే కోరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

'అవినీతి, కుటుంబపాలన ఒకదానికి ఒకటి వేర్వేరు కానే కాదు. ఎక్కడైతే కుటుంబాలు, అన్నాదమ్ములు, అల్లుళ్లు ఉంటారో అక్కడే అవినీతి విస్తరించడం కనిపిస్తుంది. ఆయా కుటుంబాలు అన్ని వ్యవస్థలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని అనుకుంటారు. అలాంటి నియంత్రణను సవాల్ చేసే వారంటే కుటుంబ పాలకులకు అసలు ఇష్టం ఉండదు. వారు మూడు ఉద్దేశాలతో ఉంటారు. ఒకటి.. వారి కుటుంబానికి జేజేలు పలకాలని అంటారు. రెండోది అవినీతి సొమ్ము మొత్తం వారి కుటుంబాల వద్దకే రావాలనుకుంటారు. మూడోది ఏవైతే డబ్బులు పేదల కోసం పంపుతామో.. ఆ డబ్బు మొత్తం వారి అవినీతి సామ్రాజ్యం పరిధిలో పంచడానికి ఉపయోగపడాలని భావిస్తారు. ఇప్పుడు మోదీ అవినీతి చెట్టుపై దాడి ప్రారంభించారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడాలా.. వద్దా..? అవినీతిపరులకు వ్యతిరేకంగా చట్టం తన పని తాను చేయాలా వద్దా?'-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

అభివృద్ది కార్యక్రమాల కంటే సీఎంకు ఏం పని ఉంటుంది : ప్రధాని తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రకటించడం ప్రజల్లోకి వెళ్లేందుకు సానుకూలంగా మారుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం అభివృద్ధి నిరోధక చర్యగా జనంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో నేతలు విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు రాకపోవడంపై కంటే మించిన పని ముఖ్యమంత్రికి ఏం ఉంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

త్వరలోనే నిరుద్యోగ మార్చ్ :రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలపై బీజేపీ ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల వరకు ప్రధాని ప్రతి నెలా.. రాష్ట్రానికి వచ్చేలా రాష్ట్ర పార్టీ నేతలు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిశాక జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి సారిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్‌ జిల్లాలో త్వరలోనే.. మే నాటికి అన్ని జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details