తెలంగాణ

telangana

TS New Secretariat: ఆత్మగౌరవ పతాక.. ఆధునికతకు ప్రతీక @నూతన సచివాలయం

By

Published : Apr 21, 2023, 9:57 AM IST

Telangana New Secretariat: 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో.. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న ప్రాసాదం.. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలుల్లో రూపుదిద్దుకున్న రాష్ట్ర నూతన సచివాలయం ఈ నెల 30న ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. హిందూ, దక్కనీ, కాకతీయ శైలుల మేళవింపు ఈ నిర్మాణంలో దాగి ఉంది.

New Secretariat
ఆత్మగౌరవ పతాక.. ఆధునికతకు ప్రతీక.. తెలంగాణ కొత్త సచివాలయం

Telangana New Secretariat: తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు అత్యాధునిక హంగులతో సరికొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్‌ తీరాన.. ధవళ వర్ణ కాంతులతో దగదగలాడుతూ ఇంద్ర భవనాన్ని తలిపిస్తున్న కొత్త సచివాలయ భవనం చరిత్రలో అద్భుత కట్టడంగా నిలవబోతోంది. తెలంగాణ ఠీవిని ప్రతిబింబించేలా నూతన సచివాలయం రూపుదిద్దుకుంది. చారిత్రక వారసత్వ సంపదకు ఆలవాలమైన భాగ్యనగరం సిగలో ఇది మరో మకుటంగా నిలవనుంది.

హిందూ.. దక్కనీ.. కాకతీయ నిర్మాణ రీతులు.. సువిశాలమైన ప్రాంగణంలో ఆకాశహర్మ్యాలు.. రెండు గుమ్మటాలపై జాతీయ చిహ్నాలైన మూడు సింహాలతో తెలంగాణ ఆత్మగౌరవ పతాకంలా నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయ భవనం తళుకులీనుతోంది. దాదాపు రూ.617 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైన ఈ అద్భుత కట్టడం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం పేరుతో తెలంగాణ ప్రజలకు సేవలందించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు కొత్తగా నిర్మించిన ఈ భవనంలో మొదలు కానున్నట్లు సమాచారం.

భారీ సచివాలయంగా రికార్డుల్లోకి :ఇటీవల కాలంలో దేశంలో నిర్మించిన సచివాలయ భవనాల్లో తెలంగాణ నిర్మించిన ఈ నూతన ప్రాంగణమే అగ్రగామిగా నిలవనుంది. రెండు రాష్ట్రాలు గడచిన పదేళ్లలో నూతన సచివాలయాలను నిర్మించాయి. వాటిలో మహానది భవన్‌ పేరిట 2012లో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 6.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయాన్ని నిర్మించగా.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 2018లో వల్లభ్‌ భవన్‌ పేరుతో 9 లక్షల చదరపుటడుగుల్లో నూతన భవనాన్ని రూపొందించింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన కొత్త సచివాలయం భారీ నిర్మాణంగా రికార్డులకు ఎక్కనుంది.

ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం :సచివాలయంలోని ఆరో అంతస్తులో తెలంగాణ సీఎం కార్యాలయం కొలువు తీరింది. దీంతోపాటు ఆ అంతస్తులోనే నాలుగు సమావేశ మందిరాలను నిర్మించారు. అదేవిధంగా ప్రతి మంత్రికి కేటాయించిన అంతస్తులో ఒక్కో మినీ కాన్ఫరెన్స్‌ హాలు రూపొందించారు. ఏకకాలంలో 30 మందితో సమావేశమయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా మంత్రుల కార్యాలయాలతో పాటు ఆ శాఖ ప్రధాన అధికారుల కార్యాలయాలు కూడా ఒకే అంతస్తులో ఉండేలా సర్కార్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో రెండు ద్వారాలే (గేట్లు) ఉండేవి. అదేవిధంగా కాలక్రమంలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ వైపు గేటును మూసివేసి, కేవలం తూర్పువైపు గేటునే వినియోగించారు. కానీ నూతనంగా ఇప్పుడు నిర్మించిన కొత్త సచివాలయానికి నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలు(గేట్లు) ఏర్పాటు చేశారు.

కొత్త సచివాలయం 26 నెలల్లో పూర్తి :నూతన సచివాలయ భవనం నిర్మాణం కోసం గుత్తేదారులు, అధికారులు 26 నెలలు శ్రమించారు. అందులో నాలుగు నెలలు కొవిడ్ మహమ్మారితో ఎలాంటి పనులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయినా ఆ సమయాన్ని నిర్మాణ ప్రణాళిక రూపకల్పనకు అధికారులు వినియోగించుకున్నారు. కొత్తగా నిర్మించిన ఈ సచివాలయ నిర్మాణానికి 2019 జూన్‌లో సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. 2020 జులైలో పాత భవనం కూల్చివేత పనులు చేపట్టారు. కొత్త భవనం నిర్మాణ పనులు 2021 జనవరిలో మొదలుపెట్టారు. మొదట అధికారులు ఆమోదిత డ్రాయింగ్స్‌ రాకపోయినప్పటికీ చిత్తు కాగితాలపై డ్రాయింగ్స్‌ను సిద్ధం చేసి ఆ మేరకు పనులు చేపట్టిన సందర్భాలూ ఉన్నాయని పేర్కొన్నారు. ఆధునిక వసతులతో సౌకర్యవంతంగా రూపుదిద్దుకున్న ఈ భవనం తెలంగాణ రాష్ట్ర పరిపాలన విధులకు సర్వసన్నద్ధమైంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details