తెలంగాణ

telangana

కంటి వెలుగు కార్యక్రమం ఆలస్యం కానుందా..?

By

Published : Mar 19, 2023, 7:46 PM IST

Kantivelugu Program In Telangana: అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. కంటి వెలుగు ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు కాగా.. దాదాపు 50 శాతానికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు సర్కారు ప్రకటించింది. వందరోజుల్లో పూర్తి చేయాలని చూసినా.. ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.

kanti velugu
kanti velugu

Kantivelugu Program In Telangana: కాస్త శ్రద్ధ, సమయానికి పరీక్షలు చేయించటం ద్వారా ఎంతో మంది కంటి చూపును కోల్పోకుండా కాపాడవచ్చు అని వైద్యులు చెపుతున్నారు. ఆర్థిక ఇబ్బందులో లేక సమయం వృథా అవుతుందన్న ఆలోచనో కారణం ఏదైనా కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం ఒకరి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తోంది. ఈ నేపథ్యంలో నివారించదగిన అంధత్వం బారిన పడుతున్న వారిని కాపాడుకునేందుకు సర్కారు ఈ ఏడాది మరోమారు కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జనవరి 19 రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 50శాతానికి పైగా ప్రజలకు పరీక్షలు పూర్తి చేసినట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 50.84 శాతం మందికి కంటి పరీక్షలు పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది. 41.71 శాతం గ్రామ పంచాయితీలు, 53.42 శాతం వార్డుల్లో ఇప్పటికే కంటి పరీక్షలు పూర్తి చేయటం విశేషం.

Kanti Velam Program Second Phase: ఈ ఏడాది జనవరిలో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఖమ్మం వేదికగా కంటి వెలుగు రెండో దశ ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 15 నాటికి అంటే వంద రోజుల్లో వంద శాతం మంది ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది.

ఇప్పటివరకు ఎంతమందికి పరీక్షలు చేశారు: ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో 80,67,243 మందికి కంటి పరీక్షలు చేసినట్లు సర్కారు ప్రకటించింది. అందులో 37,83,554 మంది పురుషులు కాగా.. 42,76,460 మంది స్త్రీలు. మరో 2,623 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఇక కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 13,70,296 మందికి రీగిండ్ గ్లాసులు అందించిన సర్కారు.. మరో 9,96,915 మందికి ప్రిస్కైబ్ అద్దాలు అవసరమని గుర్తించి వారికి అవి అందించేందుకు కృషి చేస్తోంది. పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 70 శాతం మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని తేల్చింది.

జనవరిలో ప్రారంభమైన కంటి వెలుగు జూన్ 15 వరకు నిర్వహించాలని సర్కారు భావించింది. ఈ లోపే వంద శాతం పరీక్షలు పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. అయితే అరవై రోజుల్లో కేవలం 50.84 శాతం కంటి పరీక్షలు పూర్తి కావటంతో సర్కారు అనుకున్న సమయం కంటే కంటి వెలుగు పూర్తి చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details