తెలంగాణ

telangana

Hyderabad Rains : 10 రోజులుగా ఏకధాటి వర్షం.. జలమయమైన భాగ్యనగరం

By

Published : Jul 28, 2023, 10:20 AM IST

Heavy Rainfall In Hyderabad : ఎడతెరిపి లేని వర్షాలతో.. హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు.. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

10రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. భాగ్యనగర లోతట్టు ప్రాంతాలు జలమయం

Hyderabad Rains :హైదరాబాద్‌నగరంలో చిరుజల్లులే కురుస్తున్నా.. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. నాగారం చెరువు నుంచి వచ్చే వరద నీటి వల్ల సమస్యలు ఎదుర్కుంటున్నామని అరవింద్‌నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే సమస్య ఉంటుందని.. అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. అరవింద్‌నగర్ కాలనీలోకి నీళ్లు రాకుండా.. పైప్ లైన్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేదని వాళ్లు వాపోతున్నారు

GHMC Actions Heavy Rains In Hyderabad :ఈటీవీ భారత్‌ ప్రసారం చేసిన వార్తకు జీహెచ్‌ఎంసీ అధికారులు,కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్పందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని వరద నీటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్.. సిక్కు కాలనీ , పీజేఆర్‌ నగర్ కాలనీలోని వరద ముంపు ప్రాంతాల్లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి.. వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. గాజులరామారం క్వారీల నుంచి వస్తున్న వరద నీటిని తరలించేందుకు.. ప్రత్యేక కాలువలు తవ్వించారు.

"చిన్నపాటి వర్షానికే ఇక్కడ నీరు నిలుస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. జీహెచ్‌ఎంసీ అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ ఏం చర్యలు చేపట్టడం లేదు. పోలీసులే వాహనాలను అదుపు చేస్తున్నారు. నీళ్లను చూస్తే బయంగా వీటిని ఎలా దాటుకొని వెళ్లాలి. అలా అని ఇంట్లో ఉంటే సరిపోదు పనికి పోతేనే పూట గడుస్తది. ఈ మురుగు నీటి పరిష్కారం కోసం కలెక్టర్‌, కమిషనర్ దగ్గరికి వెళ్లాం కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది."- బాధిత స్థానికులు

10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకుమేడ్చల్ జిల్లా ఘట్‌ కేసర్ మండలం ఎదులబాద్ లక్ష్మి నారాయణ చెరువు తూముకు గండి పడింది. సమీపంలోని పొలాలు మునిగిపోయాయి. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్కాజిగిరి డీసీపీ జానకి, నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు చెరువును పరిశీలించారు. గండి పడిన చోట్ల ఇసుక సంచులతో నీటి ప్రవాహాన్ని ఆపేందుకు చర్యలు చేపట్టారు.

చెరువుకు రెండు తూములు ఉన్నాయని.. వాటి గేట్లు చెడిపోవడంతో మరమ్మతులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గాజులరామారాం సర్కిల్ వోక్షిత ఎంక్లేవ్ కాలనీ, ఆదర్శ్‌నగర్ ప్రాంతాలను సైబరాబాద్ కమీషనర్ స్టిఫెన్ రవీంద్ర సందర్శించారు. వర్షానికి ఎగువన ఉన్న పెద్ద చెరువు నిండి అలుగు ద్వారా కాలనీలోనికి నీరు ప్రవేశించి, కాలనీ రోడ్లు, సెల్లార్‌లలో నీరు నిలిచిపోయి ఐదు రోజుల నుంచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. స్టీఫన్‌ రవీంద్ర కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెరువులను ఆక్రమించి వెంచర్లు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.

"ఇక్కడ చెరువులని చూస్తే ఆక్రమించి ఇళ్లు కట్టినట్టు ఉంది. అందువల్లనే ఎక్కువ వర్షాలు పడడం వల్ల స్థానికులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని ఎలా పరిష్కరించాలి అన్నదానిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాం." - స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీస్ కమిషనర్

వికారాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. తాండూర్ నియోజక వర్గం బెల్కటూరు వాగు పొంగుతుండటంతో కర్ణాటక మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. యాలాల మండలంలోని శివసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారి అలుగుపడుతోంది. దారురు మండలం జైదుపల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరద నీరు పెద్దఎత్తున చేరింది. తాండూర్ సమీపంలోని కాగ్నా నది.. బషీరాబాద్ మండలం జీవంగి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టును ఆర్డీవో విజయ్‌కుమార్‌ సందర్శించి.. వరద దృష్ట్యా పర్యాటకులు రావద్దని సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details