ETV Bharat / bharat

Hyderabad Rains : విశ్వనగరమే.. చినుకు పడితే ఆగమే..!

author img

By

Published : Jul 27, 2023, 6:53 AM IST

Heavy Rains in Hyderabad
Heavy Rains in Hyderabad

Hyderabad rains 2023 : విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ వర్షం పడితే మాత్రం విశ్వనరకంగా మారుతోంది. అభివృద్ధిపై శ్రద్ద చూపుతోన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్షాల కాలంలో తలెత్తే సమస్యలపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. వర్షాకాలంలో తలెత్తే సమస్యలను కేవలం సీజనల్ సమస్యలగానే చూడడంతో దీర్ఘకాలంలో పెనుప్రమాదంగా మారుతోంది. వర్షాల ఇబ్బందులు తీర్చేందుకు చేపట్టిన స్ట్రేటజిక్ నాలా డెవ్‌లప్ మెంట్ కార్యక్రమం కూడా నగరాన్ని కాపాడ లేకపోతోంది. దీంతో జంటనగరాల వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీయాల్సి వస్తోంది.

విశ్వనగరమే.. చినుకు పడితే ఆగమే..!

Hyderabad Rains Updates : హైదరాబాద్ నగరవాసులు వర్షాకాలంలో నరకయాతన అనుభవిస్తున్నారు. దాదాపు కోటిన్నర మంది నివస్తిస్తున్న భాగ్యనగరంలో వర్షకాలంలో కనీస సదుపాయాలు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల నుంచి వర్షాల సమయంలో ఎందరో నగరవాసులు మ్యాన్ హోల్స్‌లోపడి ప్రాణాలు కోల్పోవడంతో పాటు గాయాలపాల ఘటనలు అనేకం ఉన్నాయి. వర్షాలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. వర్షాలు పడిన సందర్భంలో హాడావుడి చేసి మమ అనిపిస్తున్నారు.

హైదరాబాద్‌లో వర్షకాలంలో ఇబ్బందులు రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా స్ట్రేటజిక్ నాలాల అభివృద్ధి పథకం తీసుకొచ్చారు. దీనికి ఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా చిన్న వర్షాలకే జలమయమయ్యే ప్రాంతాలు ఏ మాత్రం తగ్గట్లేదు. నగరం పూర్తి కాంక్రీట్ జంగల్‌గా మారిపోయింది. ఎక్కడ చిన్న చినుకు పడినా భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. మురుగు కాలువలు ఉన్నట్లే వాన నీరు వెళ్లేందుకు ప్రత్యేకంగా కాలువలు నిర్మించాల్సి ఉంది. హైదరాబాద్‌లో మొత్తం 9013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వరద నాలాలు మాత్రం 1302 కిలోమీటర్లే ఉన్నాయి. మురుగు నీటి పైపు లైన్లు 10 వేల కిలోమీటర్లు ఉన్నాయి.

Hyderabad Rain Problems : మురుగు నీటి పైపు లైన్లు ఉన్నంత వరకు వరద నాలాలు నిర్మిస్తేగాని వరద సమస్య తగ్గేట్టు లేదు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయకపోవడం.. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. వారం రోజులుగా బల్దియా కంట్రోల్ రూంకు అందుతున్న ఫిర్యా దులే నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికి జీహెచ్​ఎంసీ కంట్రోల్ రూం, జీహెచ్​ఎంసీ డీఆర్ఎఫ్ విభాగానికి, ఆల్‌లైన్ ద్వారా, డయల్ 100 ద్వారా ఇలా మొత్తంగా 560 చోట్ల రోడ్లపై నీరు నిలిచిందని ఫిర్యాదులు అందాయని అధికారులు చెబుతున్నారు. నాలా పక్కనే ఉన్నా వర్షం పడితే మైత్రీవనం కూడలిలో మోకాల్లోతులో నీరు నిలుస్తోంది.

రూ.30వేల కోట్లతో వ్యూహాత్మక రహదారులు: వర్షాలకు మూసీనది పొంగి ప్రవహిస్తుంటే అత్తాపూర్, చాదర్ ఘాట్, మూసారంబాగ్ వంతెనలు నీటమునుగుతున్నాయి. రూ.30వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం పేరుతో నగర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి బల్దియా నడుం బిగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత అయ్యప్ప సొసైటీ కూడలిలో అండర్ పాస్ నిర్మించింది. కానీ, వానొస్తే ఆ అండర్ పాస్ మొత్తం వరద చేరుతోంది. అందులోంచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోంది. లింగంపల్లి రైల్వే స్టేషన్, కేపీహెచ్​బీ రైల్వేస్టేషన్ల వద్దనున్న ఆర్​యూబీల వద్ద కూడా నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంటోంది.

Hyderabad Traffic Problems : నగరంతో పాటు శివారు ప్రాంతాల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. రాజధానిలో రోడ్లు పొడవు, వెడల్పునకు తగ్గట్లుగా వరద నీటి వ్యవస్థ అభివృద్ధి కాలేదు. రోడ్ల నిర్మాణంలో శాస్త్రీయత లేదు. 5ఏళ్ల కిందట అంటే 2018లో నగర వ్యాప్తంగా రోడ్ల స్థితిపై సర్వేచేసి వర్షం నీరు వేగంగా వరద నాలాల్లోకి చేరుకునేలా, వరద నాలాల్లోంచి మూసీకి పరుగు తీసేలా రోడ్ల నిర్మాణాన్ని మార్చుకోవాలని సూచిస్తూ నివేదికను రూపొందించారు. దాని అమలుకు 4 వేల కోట్ల నుంచి 5 వేల కోట్లు అవసరం.

జీహెచ్​ఎంసీ నాలాలకు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు లెక్కలు చూపుతున్నారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి చెబుతున్నారు. నాలాల పూడికతీత వ్యర్థంగా మారుతోందన్నారు. నగరంలో స్ట్రామ్ వాటర్ డ్రేన్స్ కూడా ఇంకా నూతనంగా నిర్మించాల్సి ఉందని పద్మనాభ రెడ్డి చెబుతున్నారు. ఇంట్లో పనికి రాని వస్తువులు కూడా నాలాల్లో పడేస్తున్నారని.. ప్రజలు కూడా ఈ విషయంలో మారాల్సిన అవసరం ఉందంటున్నారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ నిర్లక్ష్యంతో పాటు.. ప్రజల నిర్లక్ష్యం కూడా రోడ్లపై నీరు నిలిచేందుకు కారణంగా కనిసిస్తోంది.

Hyderabad drainage problems : జేఎన్​టీయూ హైదరాబాద్‌ నిపుణుల బృందం జీహెచ్​ఎంసీకి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రధాన రహదారులన్నింటికీ ఇరువైపులా వరదనీటి నాలాలు నిర్మించాలని సూచించింది. దాంతోపాటు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటిపై.. ఒక వర్షాకాలంలో గరిష్ఠంగా లక్ష లీటర్ల వర్షపు నీరు పడుతుందని ఆ నీటని ఆ ఇళ్లలోనే ఇంకుడుగుంతలో ఇంకేలా చూడాలని సూచించారు. లేదా ట్యాంకులు నిర్మించుకొని నీటిని నిల్వ చేసుకునేలా పౌరులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.