తెలంగాణ

telangana

CM KCR REVIEW: 'వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు'

By

Published : Sep 13, 2021, 3:03 PM IST

Updated : Sep 13, 2021, 9:37 PM IST

cm-kcr-reviewing-the-implementation-of-the-dalita-bandhu-scheme
cm-kcr-reviewing-the-implementation-of-the-dalita-bandhu-scheme

15:02 September 13

దళితబంధు పథకం అమలుపై సమీక్షించిన సీఎం కేసీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఆర్థిక అవసరాలు, స్థితిగతులు పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రం నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. చింతకాని, తుంగతుర్తి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వాసాలమర్రి, హుజూరాబాద్‌లో ఇప్పటికే నిధుల విడుదల చేసినట్లు చెప్పారు. దళితబంధు పథకం పైలెట్‌ ప్రాజెక్టుపై సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. ఈ భేటీకి మంత్రులు, అధికారులతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించే 4 మండలాలకు కూడా 2, 3 వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 4 మండలాల్లోని అధికారులు గ్రామాలకు తరలి రావాలని ఆదేశించారు. 

ఏటా రెండు లక్షల  దళిత కుటుంబాలకు..

దళితబంధు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగిందని సీఎం వివరించారు. ఎస్సీలను ఆర్థికంగా, వ్యాపార వర్గంగా నిలబెట్టాలని సంకల్పించినట్లు చెప్పారు. దళిత ఎంపవర్‌మెంట్ కింద రూ.1,000 కోట్లు అసెంబ్లీలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఆర్థిక, సామాజిక వివక్షను తరిమికొట్టాలనే ఆశయంతో దళిత బంధు తీసుకొచ్చినట్లు సీఎం పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళితబంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఏటా రూ.20 వేల కోట్లు తగ్గకుండా కేటాయిస్తామని ప్రకటించారు. సంవత్సరానికి  రెండు లక్షల  దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పొతామన్నారు. ఆ తరువాత వరుస క్రమంలో ఇతర  కులాల్లోని పేదలకు ఈ పది లక్షల సహాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని వివరించారు. 

దళిత బంధు కమిటీలు ఏర్పాటు చేస్తాం

రైతుబంధు సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. తమకు కూడా మేలు చేయాలని మాత్రమే దళితజాతి ప్రజలు కోరుకున్నారన్నారు. ఇప్పుడు దళితబంధు పథకం అమలు విషయంలో కూడా మిగతా వర్గాలు అదే స్థాయిలో సహకరించాలని కోరారు. అర్హులైన ఎస్సీలకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మెడికల్, ఫర్టిలైజర్ దుకాణాలు, మీ సేవా  కేంద్రాలు, గ్యాస్ డీలర్‌షిప్‌లు కేటాయిస్తామన్నారు. మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. దళితబంధు కోసం లబ్ధిదారులకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు ఇస్తామని... గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు.

తిరిగి చెల్లించాల్సిన పని లేదు

పార్టీలు, దళిత పెద్దలు, మేధావులతో చర్చించాకే దళితబంధుకు రూపకల్పన చేశాం. ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయని ఆలోచన దళితబంధు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం. ఎస్సీలను అధికారులు దళితబంధు ద్వారా తల్లిదండ్రుల్లా ఆదుకోవాలి. చాలా పథకాలు పెట్టి ఎస్సీలనే అభివృద్ధి చేస్తున్నారనేది దుష్ప్రచారం. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించడంలేదు. మొదటిదశలో పథకం అమలు పటిష్ఠంగా జరగాలి. రెండో దశలో పథకం పర్యవేక్షణ కీలకం. కలెక్టర్లు, దళితబంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలి. దళితబంధుతో ఇచ్చే ఆర్థిక సహాయం బ్యాంకు రుణం కాదు. తిరిగి చెల్లించాల్సిన పని లేదు. 

-కేసీఆర్, సీఎం కేసీఆర్​

ఇదీ చదవండి:Bhatti vikramarka: 'దళిత బంధు సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించాం'

Last Updated :Sep 13, 2021, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details