ETV Bharat / state

ఫోన్‌ ట్యాపింగ్‌ అనుమతుల్లో గూడుపుఠాణి - ప్రభాకర్‌రావుకు అధికారం ఇచ్చిందెవరు? - Telangana Phone Tapping Case

author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 8:19 AM IST

Updated : May 15, 2024, 8:34 AM IST

SIB Ex Chief Prabhakar Rao in Phone Tapping Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో విస్మయకర కోణాలు బయటపడుతున్నాయి. ట్యాపింగ్‌కు సంబంధించిన పర్మిషన్లు ఇచ్చే అధికారాన్ని ప్రభాకర్‌రావుకు కట్టబెట్టడంలో ఎదో గూడుపుఠాణి ఉందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. మరోవైపు ఇండియన్‌ టెలీగ్రాఫ్‌ చట్ట ఉల్లంఘనపై ఆరా తీస్తోంది.

Telangana Phone Tapping Case Updates
Telangana Phone Tapping Case Updates (ETV Bharat)

Telangana Phone Tapping Case Updates : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌కు అనుమతి ప్రక్రియలో అడ్డదారులు తొక్కినట్లు సమాచారం. ట్యాపింగ్‌కు అనుమతులు జారీ చేసే అధికారాన్ని అప్పటి స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) ఓఎస్డీ ప్రభాకర్‌రావుకు అప్పగించినట్లు అధికారులు నిర్ధారించారని తెలుస్తోంది. ఆనాటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఇది జరిగిందని దర్యాప్తు బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఇండియన్‌ టెలీగ్రాఫ్‌ చట్టం రూల్‌ 419(ఎ) సెక్షన్‌ ప్రకారం, ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతిచ్చే అధికారం రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఉంటుంది. అయితే ప్రజాభద్రతకు సంబంధించి ఆపరేషన్లు నిర్వహించినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం హోంశాఖ పర్మిషన్‌ పొందే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సంయుక్త కార్యదర్శి(ఐజీ) లేదా ఆపై స్థాయి ఉన్నతాధికారి ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వొచ్చని టెలీగ్రాఫ్‌ చట్టం చెబుతోంది.

SIB Ex DSP Praneeth Rao Case Updates : ఈమేరకు సర్వీస్‌ ప్రొవైడర్‌కు లేఖ రాసి అనుమతి తీసుకోవచ్చు. అయితే ఇది తాత్కాలిక పర్మిషన్‌ మాత్రమే. దీని ద్వారా మూడు రోజులపాటు ట్యాపింగ్‌ చేయవచ్చు. అనివార్య పరిస్థితుల్లో గరిష్ఠంగా వారం రోజులు మాత్రమే కొనసాగించొచ్చు. ఆ తర్వాత మాత్రం తప్పనిసరిగా హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకొని కొనసాగించాలి. అప్పటికి పర్మిషన్‌ రాకపోతే సర్వీస్‌ ప్రొవైడర్లు ట్యాపింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలి.

ఆపరేషన్ 'పోల్​ 2023 - కేఎంఆర్' - ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరిన్ని కొత్త విషయాలు - Telangana Phone Tapping Case

ప్రభాకర్‌రావుకు అధికారం ఇచ్చిందెవరు? : అయితే ఐజీగా రిటైరై ఓఎస్డీగా కొనసాగిన ప్రభాకర్‌రావుకు, ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి అనుమతి ఇచ్చే అధికారం ఎవరు, ఎలా కట్టబెట్టారన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఇది టెలీగ్రాఫ్‌ చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పదవీ విరమణ బెనిఫిట్స్‌ పొందిన వారి సేవల్ని వినియోగించుకోవాల్సి వచ్చినప్పుడు, మరొకరి పర్యవేక్షణలోనే విధులు నిర్వర్తించే బాధ్యతను అప్పగించాల్సి ఉంటుంది. కానీ ప్రభాకర్‌రావు విషయంలో అలా జరగలేదు. ఎస్‌ఐబీనే కాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్‌ విభాగంలోనూ చీఫ్‌ బాధ్యతల్నీ ఆయనకు అప్పగించారు.

అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఉల్లంఘన జరిగితే ప్రభాకర్‌రావును బాధ్యుడిని చేసే అవకాశం ఎలా ఉంటుందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనకు ఈ అధికారాన్ని అప్పగించడంలోనే ఎదో గూడుపుఠాణి దాగి ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తుండటం తాజా అంశం. ఇదంతా ఎలా జరిగిందనేది తేలితే ట్యాపింగ్‌ కుట్ర కోణంలోని మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చు. ఇందులో మరింత స్పష్టత రావాలంటే ప్రభాకర్‌రావును విచారించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఎస్‌ఐబీలో డీఐజీగా అడుగుపెట్టి : వాస్తవానికి డీఐజీగా ఎస్‌ఐబీలో అడుగుపెట్టిన ప్రభాకర్‌రావు అక్కడే ఐజీగా పదోన్నతి పొంది 2020 జూన్‌లో రిటైర్ అయ్యారు. అయితే గత సర్కార్ ఆయన్ని పునర్నియమించి రెండేళ్లపాటు ఎస్‌ఐబీ ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించింది. అంతటితో ఆగకుండా అదే సంవత్సరం అక్టోబర్‌లో అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ ఉద్యోగ విరమణ పొందడంతో పూర్తి అదనపు బాధ్యతల్ని సైతం ప్రభాకర్‌రావుకు అప్పగించారు. ఈ నియామకం అప్పట్లో సంచలనం కలిగించింది.

వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనూ కీలకమైన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యతల్ని అలా పదవీ విరమణ చేసిన వారికి అప్పగించిన దాఖలాలు లేవు. 2021 ఆగస్ట్‌లో అదనపు డీజీపీ అనిల్‌కుమార్‌కు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యతలు అప్పగించేవరకు ప్రభాకర్‌రావు ఆ పోస్టులో కొనసాగారు. బీఆర్ఎస్ సర్కార్‌ మారే వరకు ఎస్‌ఐబీ ఓఎస్డీగా కొనసాగారు. గత ప్రభుత్వం ఆయనకు అంతటి ప్రాధాన్యం ఇవ్వడంపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి అప్పట్లోనే ప్రభాకర్‌రావుపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేశారు. ఎస్‌ఐబీ కేంద్రంగా ఆయన నేతృత్వంలో రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని బహిరంగ వేదికలపైనే ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - ఎస్​ఐబీ చీఫ్ అరెస్టుకు వారెంట్ జారీ - Prabhakar Rao Arrest warrant

ఫోన్​ ట్యాపింగ్​ కేసు అప్​డేట్స్​ - ఆ ఇద్దరిని అప్పగించాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని కోరనున్న పోలీసులు - Telangana Phone Tapping Case

Last Updated :May 15, 2024, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.