తెలంగాణ

telangana

Today BRS Meeting : నేడు బీఆర్​ఎస్​ మీటింగ్​.. పలు విషయాలపై విస్తృతస్థాయి చర్చ

By

Published : May 16, 2023, 10:15 PM IST

Updated : May 17, 2023, 6:19 AM IST

kcr
kcr ()

BRS Meeting Today : భారత రాష్ట్ర సమితి కీలక సమావేశం నేడు జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పార్టీ శ్రేణులను చురుగ్గా భాగస్వామ్యం కావాలని పార్టీ శ్రేణులకు బీఆర్​ఎస్​ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని మరోసారి స్పష్టం చేయనున్నారు. రేపు మంత్రివర్గ సమావేశం కూడా జరగనున్నందున.. కీలక అంశాలపై కూడా చర్చించవచ్చని పార్టీ శ్రేణుల అంచనా.

BRS Meeting Today : ఇరవై రోజుల వ్యవధిలో బీఆర్​ఎస్ విస్తృతస్థాయి సమావేశం మరోసారి జరగనుంది. బీఆర్​ఎస్ శాసనసభ పక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన నేడు జరగనుంది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ కీలక భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు.. రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల ఛైర్మన్లు కూడా హాజరు కావాలని కేసీఆర్ తెలిపారు. గతనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి.. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇరవై రోజుల వ్యవధిలోనే కర్ణాటక ఫలితాలు వెలువడగానే మళ్లీ సమావేశం జరపడంపై రాజకీయ ఆసక్తి నెలకొంది.

21 రోజులు ఘనంగా దశాబ్ది ఉత్సవాలు : అయితే తెలంగాణ రాష్ట్రావిర్భావ దశాబ్ది వేడుకలే ప్రధాన అంశంగా సమావేశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాలను 21 రోజులు ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు ముందు.. ఆ తర్వాత పరిస్థితులను ప్రజలకు వివరించేలా విస్తృతంగా చేపట్టే కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులను కూడా భాగస్వామ్యం చేయాలని బీఆర్​ఎస్ భావిస్తోంది. మరోవైపు రాష్ట్రస్థాయి నేతల నుంచి వార్డు స్థాయి కార్యకర్తల వరకు భాగస్వామ్యం చేస్తూ పార్టీ పరంగా కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిన్నింటిపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు రోడ్​మ్యాప్​ ఇదేనా : అసెంబ్లీ ఎన్నికలు నవంబరు లేదా డిసెంబరులో జరగనున్నందున.. రోడ్‌మ్యాప్‌పై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల్లో నిరంతరం ఉండాలని.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు.. ప్రతిపక్షాల ఆరోపణలను ఎక్కడిక్కడ తిప్పి కొట్టాలని కేసీఆర్ కొంతకాలంగా ప్రతి సమావేశంలో చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్షాల విమర్శల దాడి పెరగనున్నందున వాటిని ఎలా తిప్పికొట్టాలో స్పష్టం చేసే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంలోనూ ఉంటుందని జరుగుతున్న ప్రచారంపై కూడా కేసీఆర్ స్పందించవచ్చునని పార్టీ శ్రేణుల అంచనా. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలకు విశ్లేషించి వివరించే అవకాశం ఉంది. రేపు మంత్రివర్గ సమావేశం జరగనున్నందున.. అభివృద్ధి, సంక్షేమం, కొత్త పథకాలు, కార్యక్రమాలపై కూడా పార్టీ నేతల వద్ద ప్రస్తావించవచ్చునని నాయకుల అంచనా.

ఇవీ చదవండి:

Last Updated :May 17, 2023, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details