Power Demand Peaks in Telangana : ప్రస్తుత వేసవి సీజన్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేసవి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం వినియోగిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్, వినియోగం సైతం అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. ఎస్పీడీసీఎల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పాల్గొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ సీజన్‌లో ఇప్పటికే ఏప్రిల్ 30వ తేదీన 4,214 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదయ్యిందన్నారు. మే 3వ తేదీన 89.71 మిలియన్ యూనిట్ల అత్యధిక వినియోగం నమోదయ్యిందని పేర్కొన్నారు, గతేడాది మే 3వ తేదీన నమోదయిన 58.34 మిలియన్ యూనిట్ల వినియోగంతో పోల్చుకుంటే ఈ ఏడాది 53.7 శాతం అధికంగా నమోదు అయ్యిందన్నారు. ఈరోజు కూడా 4,209 మెగావాట్ల డిమాండ్ నమోదైనట్లు వెల్లడించారు. విద్యుత్ వినియోగం సైతం 90 మిలియన్ యూనిట్లకు మించిపోయిందన్నారు. ఈ సీజన్‌లో మే నెల ముగిసేవరకు డిమాండ్ అనూహ్యంగా పెరిగే అవకాశముందన్నారు.
300 మంది ఆపరేషన్ విధుల్లో : ఈ సీజన్ ముగిసే వరకు ప్రతి 11 కేవీ ఫీడర్‌కు ఇంచార్జిగా ఒక ఇంజినీర్‌ను షిఫ్ట్ వారీగా నియమించాలన్నారు. దీనికి సంబంధించి సంస్థ ప్రధాన కార్యాలయంలో, ఇతర సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పని చేస్తున్న దాదాపు 300 ఇంజినీర్లను సైతం ఆపరేషన్ విధుల్లో నియమించారు. సర్కిల్ కార్యాలయాల్లో పని చేసే అకౌంటింగ్ సిబ్బందికి సైతం ఆపరేషన్ విధులు అప్పగించాలని సీఎండీ ఆదేశించారు.
వేసవి డిమాండ్ల నేపథ్యంలో ఇప్పటికే 4,353 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్‌లు అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటికి అదనంగా మరో 250 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్‌లు క్షేత్రస్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. అవసరమైన చోట విద్యుత్ సిబ్బంది వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు.