ETV Bharat / business

మంచి క్రెడిట్​ కార్డ్​ను సెలెక్ట్ చేయాలా? ఈ టాప్​-7 టిప్స్ మీ కోసమే! - How To Choose The Right Credit Card

author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 1:29 PM IST

How to Choose suitable Credit Card
How to Choose the best Credit Card (ETV BHARAT TELUGU TEAM)

How To Choose The Right Credit Card : మీరు కొత్తగా క్రెడిట్ కార్డ్​ తీసుకుందామని అనుకుంటున్నారా? లేదా మీ అవసరాలకు అనుగుణంగా మరో క్రెడిట్ కార్డ్​ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ అవసరాలను తీర్చే సరైన క్రెడిట్ కార్డ్​ను ఎలా ఎంపిక చేసుకోవాలో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

How To Choose The Right Credit Card : క్రెడిట్ కార్డులు మన జీవితంలో ఒక భాగమైపోతున్నాయి. చాలా మంది ఆర్థిక లావాదేవీలన్నీ వీటి ద్వారానే చేస్తున్నారు. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపులు కూడా వీటి ద్వారానే చేసే వీలు కలిగింది. అవసరం ఉన్నప్పుడు డబ్బులు వాడుకునేందుకు; వస్తు, సేవలు కొనేందుకు, వాటిపై రాయితీలు పొందేందుకు ఇవి సహాయపడతాయి. అయితే మనకు అనుకూలమైన క్రెడిట్ కార్డును సెలక్ట్ చేసుకున్నప్పుడే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. లేకుంటే ఆర్థికంగా ఇబ్బందికి గురికాకతప్పదు. వాస్తవానికి నేటి కాలంలో మార్కెట్లో ఎన్నో రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఒక విధంగా కష్టమే. అందుకే ఈ ఆర్టికల్​లో మీకు సూటయ్యే మంచి క్రెడిట్ కార్డ్​ను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం.

1. ఖర్చులు :
చాలా మంది క్రెడిట్ కార్డును తీసుకునే ముందు తమ ఖర్చుల గురించి పట్టించుకోరు. ప్రతి అవసరానికీ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్న రోజులివి. హోటల్ బిల్లులు, ప్రయాణాలు, నిత్యావసరాలు, ఈ-కామర్స్ వెబ్​సైట్లలో కొనుగోళ్లు, పెట్రోలు బిల్లు చెల్లింపులు ఇలా పలు అవసరాలకు క్రెడిట్ కార్డ్ వినియోగిస్తుంటాం. ఈ పేమెంట్స్ చేసేటప్పుడు మీకు రివార్డు పాయింట్లు లభిస్తుంటాయి. వీటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అలాగే మీరు ఎక్కడ అధికంగా ఖర్చు చేస్తున్నారో చూసుకోవాలి. దీని కోసం రెండు మూడు నెలల ఖర్చుల జాబితాను పరిశీలించాలి. వీటికి అనుగుణంగా రివార్డ్ పాయింట్లు, క్యాష్​ బ్యాక్​ ప్రయోజనాలు అందించే సరైన క్రెడిట్​ కార్డును సెలక్ట్ చేసుకోవాలి.

2. వార్షిక ఫీజులు :
క్రెడిట్ కార్డ్ యూజర్లు వార్షిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కార్డులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుంటాయి. మరికొన్ని విలాసవంతమైన ప్రయోజనాలను అందిస్తుంటాయి. వీటిని మీరు ఎంత మేరకు ఉపయోగించుకుంటున్నారో ఒకసారి పరిశీలించుకోండి. అధిక ఫీజులు వసూలు చేసే కార్డులను తీసుకోకపోవడమే మంచిది. వార్షిక ఫీజులు లేని వాటిని తీసుకోవడం కొంత బెటర్. కొన్ని కార్డులు ఫీజులు విధించినా, తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కు ఇస్తుంటాయి. ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది.

3. వడ్డీ రేట్లు :
క్రెడిట్ కార్డు తీసుకోవడం గొప్ప కాదు. బిల్లులను సకాలంలో చెల్లించడం గొప్ప. ఒకవేళ ఆలస్యం అయితే క్రెడిట్ కార్డులపై విధించే వడ్డీ అధికంగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. కార్డును తీసుకునేటప్పుడు చాలా మంది ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. కేవలం రివార్డులు, ఇతర ప్రయోజనాలపై మాత్రమే ఫోకస్ పెడుతుంటారు. అనుకోని పరిస్థితుల్లో బిల్లు చెల్లించనట్లయితే, తక్కువ వార్షిక వడ్డీని వసూలు చేసే కార్డును ఎంచుకోవడం మంచిది.

4. దీర్ఘకాలిక ప్రయోజనాలు :
క్రెడిట్ కార్డును తీసుకున్నప్పుడు ఒకేసారి కొన్ని రివార్డ్ పాయింట్లు, బోనస్ పాయింట్లను అందిస్తుంటారు. ఇవి తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమేనని గుర్తుపెట్టుకోవాలి. రానున్న రోజుల్లో ఇచ్చే రివార్డులను కూడా ఓసారి పరిశీలించాలి. పాయింట్లను ఎలా రిడీమ్ చేసుకోవాలి. కస్టమర్లకు అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాతే సరైన కార్డును ఎంపిక చేసుకోవాలి.

5. షరతులతో జాగ్రత్తగా ఉండాల్సిందే :
క్రెడిట్ కార్డ్​ కోసం అప్లై చేసే ముందు ఫీజులు, వడ్డీ రేట్లు, రివార్డు పాయింట్ల విధానం, వాటిని ఎలా వాడుకోవచ్చు - మొదలైన అన్ని నిబంధనలను, షరతులను తప్పనిసరిగా పరిశీలించాలి. కనీస నెలవారీ చెల్లింపు, అదనపు గడువు, లావాదేవీలపై వసూలు చేసే ఫీజుల గురించి కూడా తెలుసుకోవాలి.

6. ఒకటికి మించి దరఖాస్తులు చేయవద్దు :
ఓకేసారి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయడం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్రతి దరఖాస్తు వివరాలు కూడా మీ లోన్ హిస్టరీలో కనిపిస్తాయి. ఫలితంగా మీ క్రెడిట్​ స్కోర్ తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంది. ఒక కార్డును తీసుకున్న తర్వాతనే మరో కార్డుకు అప్లై చేసుకోవాలి. ఒకవేళ కార్డు రాకపోతే దానికి కారణాలు తెలుసుకుని సరి చేసుకున్న తర్వాతే మరోసారి అప్లై చేసుకోవాలి. క్రెడిట్​ కార్డులు కావాలని బ్యాంకులను వెంటవెంటనే కోరితే, మీరు లోన్స్​పై ఎక్కువగా ఆధారపడుతున్నారని బ్యాంకులు భావిస్తాయి.

7. మోసపోవద్దు :
ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ హవా నడుస్తోంది. ఫలితంగా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ ఉంది. అందులోనూ క్రెడిట్ కార్డు మోసాలు అధికంగా ఉంటున్నాయి. అందుకే క్రెడిట్​ కార్డు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆన్​లైన్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు కార్డు వివరాలు, ఓటీపీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే, వెంటనే బ్యాంకుకు లేదా కార్డు జారీ చేసిన సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి.

అప్పు చేసి ఇల్లు కొంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Buying A House With Loan

లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ కారులో ఈ 6 వస్తువులు కచ్చితంగా ఉండాల్సిందే! - Road Trip Essentials

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.