తెలంగాణ

telangana

అలా చేయడం వల్లే వికెట్లు దక్కాయన్న హార్దిక్​

By

Published : Aug 29, 2022, 2:46 PM IST

hardik
హార్దిక్​

hardik pandya pakistan match పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో తన ప్రదర్శనపై మాట్లాడాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య. ప్రత్యర్థులను ఎలా ఔట్​ చేశాడో వివరించాడు.

hardik pandya pakistan match పాకిస్థాన్‌పై భారత్‌ విజయం సాధించడంతో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య హీరో అయిపోయాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో అదరగొట్టేసిన పాండ్య ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో 3/25 ప్రదర్శన చేసిన పాండ్య.. బ్యాటింగ్‌లో కీలకమైన 33 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించి 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ను గుర్తుకుతెచ్చాడు. ఆ మ్యాచ్‌లోనూ అప్పటి సారథి ఎంఎస్ ధోనీ సిక్సర్‌తోనే భారత్‌కు విజయం చేకూర్చి పెట్టాడు. ఇప్పుడు పాక్‌తో చివరి ఓవర్‌లో ఏడు పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతులకు వికెట్‌ను చేజార్చుకుని కేవలం ఒక పరుగే వచ్చింది. ఇక నాలుగో బంతిని స్టాండ్స్‌లోకి పంపి టీమ్‌ఇండియాకు అద్భుత విజయం చేకూర్చాడు.

ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును అందుకొన్న అనంతరం హార్దిక్‌ పాండ్య మాట్లాడాడు. "ఇలాంటి ఛేజింగ్‌లో పక్కా ప్లానింగ్‌తో ఉండాలి. ప్రతి ఓవర్‌నూ ప్రణాళికతో ఆడాలి. పాక్‌ బౌలింగ్‌ దళంలో ఒక యువ బౌలర్.. అలాగే లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఉన్నారని నాకు తెలుసు. ఇక చివరి ఓవర్‌లో ఏడు పరుగులు మాత్రమే కావాల్సి వచ్చింది. ఒకవేళ 15 రన్స్‌ అయితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆలోచించా. దాని గురించి ఊహించాను కూడా. చివరి ఓవర్‌లో నా కంటే బౌలర్‌కే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని తెలుసు. అందుకే అప్పుడు ప్రత్యర్థి బౌలింగ్‌ గురించి పెద్దగా ఆందోళన చెందలేదు" అని వివరించాడు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేయడం వల్లే వికెట్లు దక్కాయని హార్దిక్‌ తెలిపాడు. ‘షార్ట్‌, హార్డ్‌ లెంగ్త్‌ బంతులను సంధించడం నా బలం. అందుకే ఇలాంటి బంతులను వేశా. బ్యాటర్లు టెంప్ట్‌ అయ్యేలా చేయడంతో ఫలితం రాబట్టగలిగాను" అని చెప్పాడు.

నిజంగా అద్భుతం..మ్యాచ్‌ ఆసాంతం తమ నియంత్రణలోనే ఉందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. ‘‘ఛేజింగ్‌ సగం ముగిసేనాటికే పరిస్థితులు ఎలా ఉన్నా సరే గెలుస్తామనే నమ్మకం వచ్చింది. ఆఖరికి మ్యాచ్‌ విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక హార్దిక్‌ పాండ్య గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టులో లేనప్పుడు తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం 140 కి.మీ వేగంతో బంతులను అవలీలగా సంధిస్తున్నాడు. షార్ట్‌ పిచ్‌ బంతులను వేస్తూ వికెట్లను రాబట్టాడు. అతడి బలం ఏంటో పాండ్యకు తెలుసు. ఆఖరి ఓవర్లలో పది కంటే ఎక్కువ రన్‌రేట్‌ ఉన్నప్పటికీ ఏమాత్రం ఆందోళన పడకుండా ఆడాడు. బ్యాటింగ్‌లోనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు’’ అని రోహిత్ వెల్లడించాడు.

ఇదీ చూడండి: పాకిస్థాన్​తో మ్యాచ్​, రోహిత్​ శర్మ, భువనేశ్వర్​ సూపర్ రికార్డ్స్​

ABOUT THE AUTHOR

...view details