తెలంగాణ

telangana

IND vs SA Virat Kohli: మరో టెస్టు గెలిస్తే.. కోహ్లీ ఖాతాలో 3 రికార్డులు

By

Published : Jan 2, 2022, 4:42 PM IST

IND vs SA Virat Kohli: టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా పలు రికార్డులపై కన్నేశాడు. జోహెనస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ మైదానంలో దక్షిణాఫ్రికాతో ఆడే రెండో టెస్టులో గెలిస్తే.. 3 కొత్త రికార్డులను కోహ్లీ సొంతం చేసుకోనున్నాడు.

virat kohli
విరాట్ కోహ్లీ

IND vs SA Virat Kohli: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ సోమవారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో పలు రికార్డులపై కన్నేశాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ గెలిస్తే.. టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ స్టీవ్‌వా (41) సరసన నిలుస్తాడు. ఈ జాబితాలో ఈ ఆసీస్‌ మాజీ సారథి ప్రస్తుతం మూడో స్థానంలో నిలవగా.. విరాట్‌ 40 విజయాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌ గెలవడం ద్వారా కోహ్లీ.. స్టీవ్‌వాతో సమానంగా మూడో స్థానంలో నిలుస్తాడు.

మరోవైపు, బ్యాటింగ్‌ పరంగా కోహ్లీ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో లేడు. అయితే, కొత్త ఏడాదిలోనైనా మునుపటిలా రాణించాలని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలోనే జోహెనస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ మైదానంలో దక్షిణాఫ్రికాతో ఆడే రెండో టెస్టులో మరింత రాణించి పాత రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నాడు. విరాట్‌ ఇప్పటికే ఈ మైదానంలో ఆడిన రెండు టెస్టుల్లో 310 పరుగులు సాధించగా.. న్యూజిలాండ్‌ మాజీ బ్యాట్స్​మన్‌ జాన్‌ రీడ్‌ సైతం రెండు టెస్టుల్లోనే 316 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో కోహ్లీ మరో ఏడు పరుగులు సాధించి జాన్‌ రీడ్‌ రికార్డును అధిగమించాలని చూస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌.. ఈ వాండరర్స్‌ మైదానంలోనే ఆడిన నాలుగు టెస్టుల్లో 263 పరుగులు చేసి ఆ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ రెండు టెస్టుల్లో 262 పరుగులు చేసి నాలుగులో నిలిచాడు.

కాగా, విరాట్‌కు ఈ మైదానంలో మంచి రికార్డే ఉంది. 2013లో తొలిసారి (119, 96) పరుగులు చేసిన అతడు 2018 పర్యటనలో (54, 41) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మూడోసారి మరింత చెలరేగి తన మునుపటి ఫామ్‌ను అందుకోవడమే కాకుండా జట్టును విజయతీరాలకు చేర్చాలని భావిస్తున్నాడు. అలాగే దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (11 మ్యాచ్‌లు, 624 పరుగులు)ను వెనక్కి నెట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం విరాట్‌ ఈ సఫారీల గడ్డపై 6 మ్యాచ్‌ల్లోనే 611 పరుగులతో కొనసాగుతున్నాడు. దీంతో మరో 14 పరుగులు చేస్తే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఈ దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్‌ఇండియా తరఫున అత్యధికంగా 15 మ్యాచ్‌ల్లో 1,161 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details