తెలంగాణ

telangana

అంపైర్​ తికమక.. ఔటా? నాటౌటా?

By

Published : Jan 2, 2022, 7:20 PM IST

BBL 2021-22: బిగ్​బాష్​ లీగ్​లో భాగంగా ఓ మ్యాచ్​లో అంపైర్​ ప్రవర్తించిన తీరు అందర్నీ నవ్విస్తోంది. మెల్​బోర్న్ స్టార్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య మ్యాచ్​ జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

umpire
అంపైర్

BBL 2021-22: క్రికెట్‌లో ఏ జట్టుకైనా అంపైర్లు ప్రకటించే నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కోసారి వారు వెల్లడించే ఔట్‌లు, నాటౌట్‌లు ఆయా మ్యాచ్‌ల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అన్ని వేళలా అంపైర్లు సరైన నిర్ణయాలే ఇస్తారని కాదు కానీ, అప్పుడప్పుడూ తప్పుడు నిర్ణయాలు ప్రకటించి కూడా ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతారు. అయితే, ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్‌బాష్‌ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో తాజాగా ఒక అంపైర్‌ ప్రవర్తించిన తీరు ఇప్పుడు అందర్నీ నవ్విస్తోంది. ఆదివారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌, పెర్త్‌ స్కార్చర్స్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన 31వ మ్యాచ్‌లో ఈ సరదా సంఘటన చోటుచేసుకుంది. దీంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొనడమే కాకుండా ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.

అసలేం జరిగిందంటే..

Funny Umpiring in BBL: పెర్త్‌ కెప్టెన్‌ ఆష్టన్‌ టర్నర్‌ (27) తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా మెల్‌బోర్న్‌ బౌలర్‌ క్జావియర్‌ క్రోన్‌ 14వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ఓ బంతిని పుల్‌షాట్‌ ఆడబోయిన టర్నర్‌ను అంపైర్‌ తొలుత పొరపాటున ఔటిచ్చాడు. ఆ బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకినట్లుగా అనిపించి వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడటంతో ఆ అంపైర్‌ ఔటిచ్చాడు. వెంటనే ఆష్టన్‌ ఆ బంతి తన బ్యాట్‌కు తగల్లేదని హెల్మెట్‌కు తగిలిందని చెప్పడంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకొని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో క్జావియర్‌ క్రోన్‌కు బిగ్‌బాష్‌ లీగ్‌లో తొలి వికెట్‌ దక్కినట్ల్లే దక్కి వెంటనే దూరమైంది.

ఇక ఈ వీడియోను బిగ్‌బాష్‌ లీగ్‌ ట్విటర్‌లో అభిమానులతో పంచుకోవడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు దీనికి నవ్వుకుంటుండగా ఇంకొందరు అంపైర్‌.. బ్యాట్స్‌మన్‌ మాటలకు విలువ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో పెర్త్‌ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180/8 స్కోర్‌ సాధించగా మెల్‌బోర్న్‌ టీమ్‌ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చదవండి:

'దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. ప్లాన్ సిద్ధం చేశా'

ఆ పరిస్థితుల్లో కోహ్లీ వ్యవహరించిన తీరు అద్భుతం: ద్రవిడ్

ABOUT THE AUTHOR

...view details