తెలంగాణ

telangana

'దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు తెరుస్తాం'

By

Published : May 24, 2020, 6:44 AM IST

దేశవ్యాప్తంగా సినిమాహాళ్లన్నీ ఒకేసారి తెరిచేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. శనివారం తెలుగు సినీనిర్మాతలతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడిన ఆయన చిత్రపరిశ్రమకు కావాల్సిన సాయాన్ని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

UNION MINISTER KISHAN REDDY ABOUT REOPENING CINEMA THEATERS
'త్వరలోనే థియేటర్లను పునఃప్రారంభిస్తాం'

దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లు ఒకేసారి తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని తెలుగు సినీపరిశ్రమ నిర్మాతలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మాతలు డి.సురేశ్​బాబు, వివేక్‌ కూచిభొట్ల, జెమిని కిరణ్‌, త్రిపురనేని వరప్రసాద్‌, దాము కానూరి, అనిల్‌ శుక్ల, అభిషేక్‌ అగర్వాల్‌, శరత్‌మరార్‌, ప్రశాంత్‌, రవి, బాపినీడు, దర్శకుడు తేజ తదితరులతో శనివారం కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కిషన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

థియేటర్లు తెరవడానికి రెండునెలలు ముందుగా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, అప్పుడే పరిశ్రమ నిలదొక్కుకుంటుందని, అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ఒకేసారి తెరవాలని సురేశ్​బాబు సూచించగా.. దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. షూటింగుల అనుమతి, థియేటర్లు, క్యాప్టివ్‌ పవర్‌, పైరసీ, ఓటీటీలో సినిమాల విడుదల, రీజనల్‌ జీఎస్టీ, టీడీఎస్‌, సినిమా కార్మికుల ప్యాకేజీ, టైలర్‌మేడ్‌ బీమా, బ్యాంకు రుణాలు తదితర అంశాలు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఓటీటీలో వచ్చే సినిమాలకు సెన్సార్‌ లేదని, సినీ పరిశ్రమలో వివక్ష ఉండకూడదని సురేశ్​బాబు కోరారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్‌, చెన్నారెడ్డిలు ప్రాంతీయ భాషల సినిమాలకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని ప్రస్తావించారు. హాలీవుడ్‌కు, అసోం లాంటి ప్రాంతీయ భాషా చిత్రాలకు ఒకే తరహా జీఎస్టీ సరికాదని తెలిపారు. సినిమా అంటేనే ఎక్కువ జనం ఉంటారని ఈ నేపథ్యంలో థియేటర్లు, షూటింగ్‌లపై కొన్ని భద్రత ప్రమాణాలను రూపొందించామని తేజ తెలిపారు.

"అంతర్జాతీయంగా సినిమా పైరసీని అడ్డుకుంటాం. వచ్చే మార్చికల్లా సీఆర్‌పీసీ, ఐపీసీ చట్టాలు మార్చనున్నాం. ప్రాంతీయ భాషల సినిమాలను ప్రోత్సహిస్తాం. క్యాప్టివ్‌ పవర్‌పై విద్యుత్తుశాఖ మంత్రితో మాట్లాడుతా. ఏ రాష్ట్రంలో షూటింగులు చేసుకున్నా ఇబ్బందులు లేకుండా చూస్తా. వలస కార్మికుల నిమిత్తం నిధులు విడుదల చేశాం. ఎంఎస్‌ఎంఈలను పటిష్ఠ పరుస్తున్నాం. అవసరమైతే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో ఫిల్మ్‌ కోర్సులు చేర్చుతాం" అని కిషన్‌రెడ్డి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ, మత, ప్రాంత బేధాలకు అతీతంగా అందరూ సమష్టిగా ఉండాలని సూచించారు. కరోనా నుంచి బయటపడితే దేశం మళ్లీ పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి... స్టార్ హీరోతో కమ్ముల.. నిర్మాణ సంస్థ క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details