తెలంగాణ

telangana

రాముడు, కృష్ణుడు.. ఏ పాత్ర అయినా గుర్తొచ్చేది ఆయనే

By

Published : Jan 18, 2021, 5:30 AM IST

తెలుగువారి మదిలో శాశ్వత స్థానం సంపాదించుకున్న నందమూరి తారక రామారావు వర్ధంతి సోమవారం(జనవరి 18). ఈ సందర్భంగా ఆయన జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

sri nandamuri taraka rama rao death anniversary
రాముడు, కృష్ణుడు.. ఏ పాత్ర అయినా గుర్తొచ్చేది ఆయనే

క్రమశిక్షణే పరమావధిగా, లక్ష్యసాధనే ధ్యేయంగా, సాహసమే ఊపిరిగా నందమూరి తారకరామారావు వెండితెర జీవితం ఆసాంతం అసాధారణ విజయాలతో కొనసాగింది. 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించి 'ప్రజలే దేవుళ్లు. సమాజమే దేవాలయం' సిద్ధాంతంతో ప్రాంతీయ పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆ తారక రాముడిదే.

నందమూరి తారక రామారావు

ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్క రూపాయిని మాత్రమే జీతంగా స్వీకరించిన తెలుగుజాతి ముద్దుబిడ్డ ఆయన. తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన ధీశాలి. ఆ అభినవరాముని వర్ధంతి జనవరి 18న. ఈ సందర్భంగా ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ప్రస్థానం గుర్తు చేసుకుందాం.

నందమూరి నట జైత్రయాత్ర..

1950లో 'మనదేశం' సినిమాతో తారక రాముని నట జైత్రయాత్ర ప్రారంభమైంది. అది నిర్విఘ్నంగా 35 సంవత్సరాల పాటు కొనసాగింది. 'పాతాళభైరవి', వాహినీ వారి 'మల్లీశ్వరి'. 'పెళ్లిచేసిచూడు', లవకుశ, గుండమ్మ కథ, 'దానవీర శూరకర్ణ'.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్.

తల్లిదండ్రులతో సీనియర్ ఎన్టీఆర్
నందమూరి తారక రామారావు

సొంతంగా ఎన్‌.ఎ.టి నిర్మాణ సంస్థ

1952లో 'ఎన్‌.ఎ.టి' పేరుతో సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి, తొలి ప్రయత్నంగా 'పిచ్చి పుల్లయ్య'(1953) చిత్రాన్ని ఎన్టీఆర్ నిర్మించారు. 'తోడుదొంగలు', 'వద్దంటే డబ్బు'.. సొంత బ్యానర్‌ మీద నిర్మించిన ఈ రెండు సాంఘిక చిత్రాలు ఆర్ధిక విజయాన్ని సాధించకపోవడం వల్ల ఈసారి 'జయసింహ' (1955) పేరుతో తొలి జానపద చిత్రాన్ని నిర్మించారు. సినిమా అద్భుత విజయాన్ని నమోదుచేసి రామారావుకు సొంతబ్యానర్‌ మీద చిత్రాలు నిర్మించేందుకు అవసరమైన ధైర్యాన్ని ఇచ్చింది. తర్వాత 'పాండురంగ మహాత్మ్యం', 'సీతారామ కల్యాణం', 'గులేబకావళి' సినిమాల విజయాల గురించి చెప్పనవసరమే లేదు.

కృష్ణుడిగా, రాముడుగా నిలిపిన చిత్రాలు...

ఘంటసాల నిర్మించిన 'సొంతవూరు'లో కృష్ణుడుగా రామారావు గెటప్‌ ప్రేక్షకులకు రుచించలేదు. విజయా వారి 'మాయాబజార్‌'లో రామారావుకు గెటప్‌ మార్చి తీర్చిదిద్దిన కృష్ణుడి పాత్ర ఎంత గొప్పగా అమరిందంటే, ఆరోజుల్లో రామారావు చిత్రపటంతో వున్న ఐదు లక్షల క్యాలండర్‌లకు ప్రజలు ఫ్రేములు కట్టించి పూజా గదుల్లో పెట్టి పూజలు చేశారు.

కృష్ణుడి వేషధారణలో ఎన్టీఆర్

ఆయన రాముడుగా నటించిన 'లవకుశ' రంగుల చిత్రం 26 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. పి.పుల్లయ్య 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం'లో వేంకటేశ్వరునిగా రామారావు అద్భుతంగా నటించారు. ఆ రోజుల్లో ఈ సినిమా ప్రదర్శించే సినిమా హాళ్లు ఆలయ శోభను సంతరించుకున్నాయి.

'దాన వీర శూర కర్ణ'లో మూడు పాత్రలు (కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు), 'శ్రీమద్‌ విరాటపర్వం' చిత్రంలో 5 పాత్రలు పోషించి సత్తా చాటారు. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' (1991), 'సామ్రాట్‌ అశోక' (1992) వంటి చిత్రాలు నిర్మించి, తనను ఎంతగానో అభిమానించే మొహన్‌ బాబు నిర్మించిన 'మేజర్‌ చంద్రకాంత్‌' (1993) చిత్రంతో నటనకు స్వస్తి చెప్పారు ఎన్టీఆర్.

నందమూరి తారక రామారావు

రాజకీయంలోకి వచ్చి పార్టీ స్థాపించి...

'ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం' నినాదంతో రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 40 రోజుల పాటు రాష్ట్రమంతా అవిశ్రాంతంగా పర్యటించి 1983 ఎన్నికల్లో పోటీచేసి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు. ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు లేవదీసిన రాజకీయ సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని, సెప్టెంబరు 16న మరలా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బర్తరఫ్‌ అయిన నెలరోజుల్లోనే తిరిగి పీఠాన్ని నిలుపుకోవడం భారత రాజకీయ చరిత్రలో రామారావు ఒక్కరికే దక్కింది. భార్య బసవరామ తారకం ఈ సంక్షోభ సమయంలోనే క్యాన్సర్‌ మహమ్మారితో మరణించింది. ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన పార్టీ పార్లమెంటులో 30 సీట్లను గెలుచుకోవడం ఒక రికార్డుగా నిలిచింది.

1989లో కాంగ్రెసేతర పార్టీలను ఒక్క తాటిమీదకు తెచ్చి నేషనల్‌ ఫ్రంటు ఏర్పరచి, దానికి చైర్మన్‌గా వ్యవహరించి రామారావు కేంద్రంలో చక్రం తిప్పారు. పుట్టిన దగ్గరనుంచి తుదిశ్వాస విడిచేవరకు అలుపెరుగని ఆ మహా యోధుడు 1996 జనవరి 18న మరణించారు. ఆయన మరణంతో రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ మరణం ఒక యుగపురుషుని జీవిత ప్రస్థానానికి ముగింపు పలికింది.

మరిన్ని విశేషాలు...

* 'పాతాళభైరవి' చిత్రంలో తన సహచరుడుగా నటించిన బాలకృష్ణ మద్యానికి బానిసై షూటింగులకు ఆలస్యంగా రావడంతో అతణ్ణి తన చిత్రం నుంచి తప్పించాలని ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తే, దానివలన అతని కుటుంబానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని ఆ ప్రయత్నాన్ని వారించి, బాలకృష్ణను ఇంటికి పిలిచి రామారావు మందలించారు. ఆ తరువాత బాలకృష్ణ ఏనాడూ షూటింగుకు ఆలస్యంగా రాలేదు. అలా మానవత్వ విలువల్ని కాపాడే వ్యక్తిత్వం మూర్తీభవించిన మనీషి ఈ తారకరాముడు.

* సినిమాల్లో మారువేషాలు వేయడం రామారావుకు ఇష్టం. అది జానపదమైనా, సాంఘికమైనా ఒకటి లేక రెండు మారువేషాలు ఉండేలా స్క్రిప్టు తయారు చెయ్యమని రచయితలకు ప్రత్యేకంగా చెప్పేవారు. విజయవాడలోని దుర్గా కళామందిర్‌కు రామారావుకు అవినాభావ సంబంధం ఉంది.

* రామారావు తొలి చిత్రం 'మనదేశం' చివరి చిత్రం 'మేజర్‌ చంద్రకాంత్‌' ఈ చిత్రశాలలోనే ఆడాయి. అంతేకాదు, రామారావు నటించిన అధికశాతం సినిమాలు (63) ఆడింది ఈ సినిమా హాలులోనే కావడం విశేషం.

నందమూరి తారక రామారావు

* రామారావుది క్రమశిక్షణ గల జీవితం. ఉదయం నాలుగు గంటలకే లేచి వ్యాయామం, యోగాసనాలు వేసి, కాలకృత్యాలు తీర్చుకొని, ఉదయం ఆరు గంటలకే భోజనం చేసిమేకప్‌ చేసుకొని ఆరున్నరకే తయారై కూర్చొని, తన సొంత సినిమాల విషయాలు చూసుకోనేవారు. షూటింగుకి ఏనాడూ ఆలస్యంగా వెళ్లలేదు. నిర్మాతకు ఏనాడూ తనవలన ఇబ్బంది కలిగే అవకాశం ఇవ్వలేదు.

* రామారావుకు సొంత కుర్చీ తెచ్చుకోవడం అలవాటు. ఆయనకంటే ముందే సెట్‌లోకి కుర్చీ వచ్చిందటే రామారావు వస్తున్నట్లే. వెంటనే సెట్లో వాళ్లంతా అలర్ట్ అయి లేచి నిలబడేవారు. తన కుర్చీమీద ఎన్‌.టి.ఆర్‌ పేరు అందంగా కుట్టివుండేది. కుర్చీతోబాటు ఒక కంచు మరచెంబు నిండా మంచి నీళ్ళు, గ్లాసు, వెండి కంచం వచ్చేవి. అవసరమైతే ఇంటి నుంచి మంచినీళ్ల బిందె కూడా వచ్చేది. మంచి నీళ్లలో తేనె కలుపుకొని తాగడం రామారావుకి అలవాటు.

ABOUT THE AUTHOR

...view details