తెలంగాణ

telangana

'సినిమాలపై ఇష్టం అలా పెరిగింది'

By

Published : Dec 17, 2020, 10:31 AM IST

చదువు మధ్యలోనే ఆపేసి.. సినిమాపై ఉన్న అమితమైన ఇష్టంతో 'కర్మ' అనే చిత్రాన్ని తెరకెక్కించి తన దశనే మార్చుకున్నారు యువ నటుడు అడివి శేష్‌. 'పంజా' చిత్రంలో విలన్‌గా మెప్పించిన ఆయన కేవలం హీరోగా రాణించాలనే ఉద్దేశంతో ఎన్నో సినిమా(విలన్‌, విలన్‌ కొడుకు పాత్రలు) ఆఫర్లను కాదనుకున్నారు. గురువారం ఈ యువ కథానాయకుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

special story about tollywood actor Adivi Shesh on his birthday
'పంజా'లో విలన్​ పాత్ర చేయెద్దనుకున్నా:అడివి శేష్​

కేవలం నటుడిగానే కాకుండా 'క్షణం', 'గూఢచారి'లతో రచయితగానూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు యువ నటుడు అడివి శేష్. తన కలల ప్రాజెక్ట్‌ 'మేజర్‌'తో త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు‌. గురువారం ఈ నటుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి పలు సందర్భాల్లో ఆయన ఇలా చెప్పారు.

ఇండస్ట్రీలోకి అలా..

నా అసలు పేరు సన్నీ చంద్ర. మా నాన్న అడివి చంద్ర పేరున్న వైద్యుడు. ఆయనకి సినిమాలంటే ఎంతో ఆసక్తి. కె.విశ్వనాథ్‌గారి సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ అదే సమయంలో నాన్నకు యాక్సిడెంట్‌ అయ్యింది. అలా ఆయన సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయారు. ఆయన వల్లే నాకు చిన్నప్పటి నుంచి సినీ రంగంపై విపరీతమైన ఇష్టం పెరిగింది. యుక్తవయసులోకి వచ్చేసరికి అది మరింత బలపడింది.

అడివి శేష్​

ఆడిషన్స్‌ టు యూనివర్సిటీ..

పదిహేను సంవత్సరాల వయసులోనే కృష్ణవంశీ 'మల్లెపువ్వు' కోసం ఆడిషన్‌లో పాల్గొన్నా. కొంచెం పెద్ద వ్యక్తిలా కనిపించాలనే ఉద్దేశంతో ఆ సమయంలో పెన్సిల్‌ లెడ్‌ను గడ్డంలా పూసుకున్నాను. 'మల్లెపువ్వు'లో అవకాశం రాలేదు. సినిమాపై ఆశ మాత్రం పోలేదు. అలా, శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో 'బ్యాచిలర్‌ ఆఫ్‌ సినిమా' కోర్సులో ప్రవేశించా. చదువుకున్నంత మాత్రాన ఏమీ తెలియదని అక్కడికి వెళ్లాక అర్థమైంది. కోర్సు మధ్యలో ఆపేసి వెబ్‌ డిజైనింగ్‌ మొదలుపెట్టా.

అడివి శేష్​

ఎన్నో ఇబ్బందులుపడ్డా

నేను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 'కర్మ'. వెబ్‌ డిజైనింగ్‌లో సంపాదించిన కొద్ది మొత్తంతో 'కర్మ'ను తీశాను. ఆ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఆర్థిక సమస్యలు కూడా చూశా. ఎట్టకేలకు సినిమాని విడుదల చేశాం. మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు.

అడివి శేష్​

'పంజా' ఆఫర్‌ వద్దనుకున్నా..

'పంజా'లో విలన్‌ పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను మొదట చేయకూడదనుకున్నా. ఆ విషయాన్నే నా కజిన్‌కు చెబితే.. 'పవన్‌ సినిమా ఎన్నో కోట్ల మంది చూస్తారు. నటన బాగుంటే నీకు గుర్తింపు వస్తుంది' అని చెప్పాడు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా ఓకే అన్నాను. నిజం చెప్పాలంటే 'పంజా' నాకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత విలన్‌, విలన్‌ కొడుకుగా చేయమని ఆఫర్స్‌ వచ్చాయి. చేయలేదు.

అడివి శేష్​

'కిస్‌' నేర్పిన పాఠం

'పంజా' తర్వాత 'కిస్‌' చిత్రానికి దర్శకత్వం వహించా. ఆ సినిమా నాకెన్నో పాఠాలు నేర్పించింది. ఆ సినిమా వల్ల ఎంతో కోల్పోయా. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఆఖరికి నేను ఉంటున్న ఇంటికి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేకుండా పోయాయి. అలాంటి సమయంలో కొంచెం నిలదొక్కుకోవడం కోసం కొన్ని సినిమాల్లో నటించా.

అడివి శేష్​

సుమారు 15 వెర్షన్స్‌.

'కిస్‌' పరాజయంతో కథలు రాసుకునే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. అలాంటి సమయంలో 'క్షణం' కథ అనుకున్నా. సుమారు 15 వెర్షన్స్‌ రాసిన తర్వాత నిర్మాణ సంస్థకు 'క్షణం' కథ చెప్పా. కథ విని వాళ్లు కొన్ని మార్పులు చేయమన్నారు. అలా చివరికి మీరు చూస్తున్న చిత్రం రూపొందింది.

అడివి శేష్​

'మేజర్‌' నాకిష్టమైన చిత్రం

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'మేజర్‌' చిత్రానికి కథ రాసుకున్నా. 26/11 దాడుల తర్వాత మొదటిసారి సందీప్‌ ఫొటో చూడగానే నా అన్నయ్యని చూసినట్లు అనిపించింది. ఆయన గురించి ఎంతో రిసెర్చ్‌ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఆయన నాలో స్ఫూర్తి నింపారు. అలా ఆయన కుటుంబసభ్యుల్ని కలిసి పర్మిషన్‌ తీసుకున్నాక ప్రాజెక్ట్‌ ఓకే చేశా. 'మేజర్‌' నాకెంతో ఇష్టమైన ప్రాజెక్ట్‌.

ఇదీ చూడండి:తెలుగు టీజర్​తో 'మాస్టర్'.. ఫస్ట్​లుక్​తో 'మేజర్'

ABOUT THE AUTHOR

...view details