తెలంగాణ

telangana

లింగాయత ఓట్ల కోసం కుస్తీ.. ఆ అభ్యర్థులకే పెద్దపీట.. సీఎం పదవీ వారికే!

By

Published : Apr 25, 2023, 7:19 AM IST

Karnataka Assembly Election 2023 : కర్ణాటక ఎన్నికలకు, లింగాయత సామాజిక వర్గానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల తర్వాత అత్యధిక జనాభా ఉన్న లింగాయత ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం అధికార పార్టీపై వ్యతిరేకత, అవినీతి, రిజర్వేషన్ల సవరణలతోపాటు 'లింగాయత సీఎం' అభ్యర్థి అంశం.. ఎన్నికలను ప్రభావితం చేసే జాబితాలో చేరింది. ఇదే అంశంపై పార్టీలు రసవత్తర రాజకీయాన్ని ప్రారంభించాయి. ఇటీవల ముగిసిన టికెట్ల కేటాయింపుల్లోనూ అన్ని పార్టీలు.. లింగాయత అభ్యర్థులకు ఎక్కువ టికెట్లు ఇచ్చాయి.

karnataka-assembly-election-2023-lingayats-effects-on-karnataka-election
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023

కర్ణాటకలో అత్యంత ప్రభావశీలమైన సామాజికవర్గమైన లింగాయత్‌లు.. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషిన్నారు. ఈ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇటీవలి కాలంలో భాజపాకు లింగాయత్‌ల మద్దతు ఎక్కువగా ఉండగా.. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నేతలు వలస పోతుండడం ఆసక్తికరంగా మారింది. టికెట్‌ కోసం ఎదురుచూసి భంగపడిన భాజపా నేతలు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ సవది.. భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరడం ఎన్నికలను రసవత్తరంగా మార్చాయి.

ఈ క్రమంలో.. సున్నితమైన లింగాయత అంశాన్ని భాజపా, కాంగ్రెస్‌ రాజకీయ అస్త్రంగా మలచుకున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన రోజే జగదీశ్‌ శెట్టర్‌.. భాజపాలో లింగాయత నేతలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇందుకు బ్రాహ్మణ సముదాయానికి చెందిన బి.ఎల్‌.సంతోషే కారణమని బహిరంగంగానే విమర్శించారు. అప్పటికే కాంగ్రెస్‌లో చేరిన మరో లింగాయత నేత లక్ష్మణ సవది కూడా ఇదే నిర్లక్ష్య రాజకీయాలకు బలైనట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం ప్రారంభించింది. వీరిద్దరి ఘటనలకు లింగాయత వర్గానికే చెందిన మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప బలవంతపు రాజీనామా ఉదంతాన్ని జోడించి ప్రచారాన్ని మరింత పదునెక్కించింది.

జగదీశ్‌ శెట్టర్‌ రాజీనామాను కలలోనైనా ఊహించని భాజపా.. లింగాయత నేతలను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలతో కాస్త కంగారు పడింది. తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆ వర్గం ఎక్కడ తమకు దూరమవుతుందోననే ఆందోళనతో వేగంగా పావులు
కదిపింది. లింగాయత్ సామాజికవర్గ నేత బి.ఎస్‌.యడియూరప్పను మరోసారి తెరపైకి తెచ్చింది. శెట్టర్‌ రాజీనామా చేసిన రోజే యడియూరప్పతో లింగాయత్​లకు భాజపా పట్ల నిబద్ధత ఉందన్న సందేశాన్ని ఇప్పించేందుకు ప్రయత్నించింది. ఇదే క్రమంలో.. ఇటీవల యడియూరప్ప నివాసంలో లింగాయత నేతలు, మఠాధిపతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేశారు.

లింగాయత ఓట్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలూ ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఆ వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చాయి. 2018లో 55 మందికి సీట్లు ఇచ్చిన భాజపా.. ఈసారి 68 మందికి కేటాయించింది. కాంగ్రెస్‌ కూడా 44 నుంచి 46కు పెంచింది. కర్ణాటకలో మూడో అతిపెద్ద పార్టీ అయిన జేడీఎస్​ కూడా గతంలో 30మందికి టిక్కెట్లు ఇస్తే.. ఈ సారి ఏకంగా 41 మందికి కేటాయించింది.

లింగాయత సీఎం
ఇదే సమయంలో.. కాంగ్రెస్‌, భాజపా మధ్య లింగాయత సీఎం అభ్యర్థి ప్రకటనపై సవాళ్లు, ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా.. భాజపా మళ్లీ అధికారంలోకి వచ్చాక అనివార్యమైతే లింగాయతకు చెందిన వారినే సీఎం చేయనున్నట్లు ప్రకటించారు. తమపార్టీ అధికారంలోకి వస్తే లింగాయత నేత సీఎం కావడం బహిరంగ సత్యమే కదా అని భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ విధానాన్ని మరింత స్పష్టం చేశాయి. భాజపా మంత్రులైతే మరింత ముందుకెళ్లి తమ పార్టీ లింగాయత అభ్యర్ధిని సీఎం చేయడం తథ్యమని చెబుతున్నారు. ధైర్యముంటే.. కాంగ్రెస్‌ ఆ ప్రకటన చేయాలన్నారు. సీఎం బసవరాజ్ బొమ్మై సైతం ఇదే సవాలు చేశారు.

కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్
భాజపా ప్రచారంపై కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగారు. కర్ణాటకలో లింగాయతలను భాజపా ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తోందని విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల్లో గెలిచిన వారిని పక్కనబెట్టడం భాజపాకు అలవాటుగా మారిందని.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం​బీ పాటిల్ ధ్వజమెత్తారు. యడియూరప్పతో బలవంతంగా రాజీనామా చేయించిన తర్వాత బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేయడం భాజపాకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. వాస్తవానికి ఆర్​ఎస్​ఎస్​ నేతలు బీఎల్​ సంతోష్‌ లేదా ప్రహ్లాద్‌ జోషీని ముఖ్యమంత్రిని చేయాలని భాజపా నాయకత్వం చూసిందని పేర్కొన్నారు. లింగాయతలు, వీరశైవుల ఆందోళనలతో విధిలేని పరిస్థితుల్లోనే బొమ్మైని ముఖ్యమంత్రిని చేసిందని ఎమ్​బీ పాటిల్ విమర్శించారు. బస్వరాజ్‌ బొమ్మై 'యాక్టిడెంటల్ సీఎం' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారంలో లింగాయత అంశం ప్రధాన అస్త్రంగా మారిన వేళ.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా అదే మంత్రాన్ని అందుకున్నారు. లింగాయతకు ప్రాధాన్యం దృష్ట్యా ఆయన ఆదివారం బాగల్‌కోటెలోని బసవ కల్యాణలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం బసవణ్ణ జయంతి కావడం వల్ల అక్కడి బసవణ్ణ ప్రతిమకు ప్రత్యేక పూజలు, మఠాధిపతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. లౌకికవాద సందేశాలిచ్చిన బసవణ్ణ సిద్ధాంతాలకు భాజపా మతపరమైన రంగు అద్దుతున్నట్లు రాహుల్‌ ఆరోపించారు.

'లింగాయత సీఎంలు అవినీతిపరులు'
అటు తన నియోజకవర్గం వరుణలో ప్రచారం సందర్భంగా.. విపక్ష నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. అధికారంలోకి వస్తే లింగాయతలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అని మీడియా అడగ్గా.. లింగాయత ముఖ్యమంత్రులంతా అవినీతిపరులని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను.. భాజపా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసింది. కాంగ్రెస్‌లోని లింగాయత నేతలంతా సిద్ధరామయ్య వ్యాఖ్యలను పార్టీలకతీతంగా ఖండించాలని.. భాజపా అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సిద్ధరామయ్య.. లింగాయత నేతలంతా అవినీతి పరులని తాను అనలేదన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్‌, జేహెచ్‌.పటేల్​ ఆ వర్గానికి వన్నె తెచ్చినవారేనని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అవినీతిపరుడన్న ఉద్దేశంతోనే మాట్లాడానని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details