తెలంగాణ

telangana

రాజకీయ పిడికిట్లో భారత క్రికెట్‌.. ఆటకు తిరోగమనం తప్పదా?

By

Published : Nov 6, 2022, 11:53 AM IST

Indian Cricket Politics : ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డయిన బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. బీసీసీఐ కార్యవర్గంలోనూ మార్పులు జరిగాయి. దాని వెనక పెద్ద రాజకీయమే నడిచిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ పూర్తిగా రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్తోందని క్రికెట్‌ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

Indian Cricket Politics
Indian Cricket Politics

Indian Cricket Politics : సౌరభ్‌ గంగూలీ స్థానంలో మరో మాజీ ఆటగాడైన రోజర్‌ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గంగూలీ మూడేళ్ల పాటు బోర్డును నడిపించారు. 2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం కుదిపేస్తున్న సమయంలో జాతీయ జట్టు పగ్గాలందుకుని భారత క్రికెట్‌ తలరాతనే గంగూలీ మార్చేశాడు. అంత గొప్ప కెప్టెన్‌ను గ్రెగ్‌ చాపెల్‌ కోచ్‌ అయ్యాక వివాదాస్పద రీతిలో సారథ్య బాధ్యతల నుంచే కాక, జట్టు నుంచీ తప్పించడంపై పెద్ద దుమారమే రేగింది. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుకుని తిరిగి జట్టులో చోటు సంపాదించిన గంగూలీ- గౌరవంగా కెరీర్‌కు వీడ్కోలు పలికి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన నిష్క్రమణ సైతం వివాదాస్పదమే అయింది.

సౌరభ్​ గంగూలీ

వారిదే హవా!
బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో కలిపి వరసగా ఆరేళ్లు పదవుల్లో కొనసాగాక మూడేళ్ల పాటు విరామం తీసుకోవాలని లోధా కమిషన్‌ సిఫార్సు చేసింది. దాని ప్రకారం 2019 అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడైన గంగూలీ 2020 జూన్‌లోనే పదవి నుంచి దిగిపోవాలి. ఎందుకంటే అప్పటికే గంగూలీ అయిదేళ్లు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. తప్పనిసరి విరామ నిబంధన సహా లోధా కమిషన్‌ సిఫార్సులను మరి కొన్నింటిని మార్చాలని బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

టీమ్ఇండియా

ఆ కేసు రెండేళ్లకు పైగా విచారణలో ఉండటంతో మూడు సంవత్సరాల పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగాడు. ఇటీవలే ఆ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆరేళ్లు కాకుండా తొమ్మిదేళ్ల పాటు క్రికెట్‌ సంఘాల పదవుల్లో కొనసాగాక మూడేళ్లు విరామం తీసుకునేలా నిబంధనలను మార్చింది. దాని ప్రకారం గంగూలీ మరోదఫా బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ పడటానికి అవకాశం దక్కింది. రాజకీయ బలంతో బీసీసీఐని గుప్పిటపట్టిన వర్గం బలవంతంగా గంగూలీని బయటకు సాగనంపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

'దాదా' నిష్క్రమణ..
గంగూలీ నిష్క్రమణ ఆయన సొంత రాష్ట్రం పశ్చిమ్‌ బెంగాల్‌లో రాజకీయ కాక రగిలించింది. గంగూలీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడే కార్యదర్శి పదవి చేపట్టిన కేంద్ర హోంమంత్రి తనయుడు జై షా, మరో పర్యాయం అదే పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గంగూలీని మాత్రం పంపించి వేయడానికి కారణం అతడు భారతీయ జనతా పార్టీలో చేరకపోవడమేనని బెంగాల్‌ అధికార పార్టీ నేతలు ఆరోపించారు. వాటిని భాజపా తిప్పికొట్టింది. రెండు పార్టీల మధ్య ఆ విషయమై కొద్దిరోజుల పాటు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఏదిఏమైనా బీసీసీఐలో భాజపా ఆధిపత్యం పెరిగిందన్నది వాస్తవం.

జై షా, సౌరభ్​ గంగూలీ

జై షాకు తోడు కొత్తగా బీసీసీఐ కోశాధికారిగా ఎన్నికైన ఆశిష్‌ శేలార్‌ మహారాష్ట్రకు చెందిన భాజపా నాయకుడే. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సన్నిహితుడైన దేవ్‌జిత్‌ సైకియా సంయుక్త కార్యదర్శి పదవిని చేపట్టారు. ఇన్నాళ్లూ బీసీసీఐ కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి, తాజాగా ఐపీఎల్‌ ఛైర్మన్‌ అయిన అరుణ్‌ ధూమల్‌- కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ సోదరుడు. ఇలా బీసీసీఐలో కీలక కార్యవర్గమంతా భాజపా నాయకులతోనే నిండిపోయింది. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రోజర్‌ బిన్నీకి ఆటగాడిగా, క్రికెట్‌ పాలకుడిగా మంచి పేరుంది. ఆయన సున్నిత మనస్కుడని, ఘర్షణ వైఖరికి దూరంగా ఉంటారని చెబుతారు.

టీమ్ఇండియా

అధ్యక్షుడిగా బిన్నీని ముందు నిలిపి, బీసీసీఐని జై షా బృందమే నడిపించబోతోందన్న చర్చ సాగుతోంది. దూకుడుగా ఉండే గంగూలీతో ఇబ్బంది కాబట్టి బోర్డు నుంచి ఆయనను తప్పించారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గంగూలీని ఐసీసీ ఛైర్మన్‌ పదవికి నామినేట్‌ చేసే అవకాశం ఉన్నా, దానిపై మిన్నకుండటాన్ని ఆయన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం దానిపై డిమాండ్‌ చేసినా ఫలితం లేకపోయింది. ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవిని గంగూలీకి ఇవ్వజూపగా, బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశాక అది తన స్థాయికి చిన్నదవుతుందని తిరస్కరించినట్లు కథనాలు వెలువడ్డాయి.

అభిమానుల్లో ఆందోళన
గంగూలీ కెప్టెన్‌ బాధ్యతలు అందుకున్నాక ఎందరో ప్రతిభావంతులు జట్టులోకి వచ్చారు. కెప్టెన్‌గా ధోనీ సైతం తనదైన ముద్ర వేయడంతో భారత జట్టు ప్రపంచ క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2010లో టెస్టుల్లో నంబర్‌ఒన్‌ అయింది. 2011లో ఒన్డే ప్రపంచకప్‌ గెలిచింది. సచిన్‌ సహా దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టు నుంచి నిష్క్రమించాక భారత్‌ కొంత ఇబ్బంది పడింది. అదే సమయంలో 2015లో ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం క్రికెట్‌ను శరాఘాతంలా తాకింది. వాటన్నింటినీ అధిగమించి భారత జట్టు పునర్వైభవం సాధించింది. కొన్నేళ్లలో ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా ఎదిగింది.

టీమ్​ఇండియా అభిమానులు

ఆటగాళ్ల ఎంపికలో మునుపెన్నడూ లేనంత పారదర్శకత వచ్చింది. ఎంతోమంది ప్రతిభావంతులకు అవకాశం దక్కింది. ఒకే సమయంలో రెండు జట్లను ఆడించే స్థాయికి భారత్‌ చేరుకుంది. ఇలా అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో బీసీసీఐలో రాజకీయ నేతల ప్రాబల్యం పెరిగిందన్న విశ్లేషణలు చర్చనీయాంశం అవుతున్నాయి. వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే క్రికెట్‌ బోర్డు రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్తే ఏం జరుగుతుందోనన్న ఆందోళన భారత క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. క్రికెట్‌ జట్టు, సహాయ సిబ్బంది ఎంపిక, ఆటకు సంబంధించిన వ్యవహారాలకు రాజకీయ మకిలి అంటకూడదని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

కుదిపేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌

టీమ్ఇండియా
ఆటల్లో భారత్‌ మందగమనానికి క్రీడాసంఘాలు, సమాఖ్యల్లో రాజకీయ నేతల ప్రాబల్యం పెరిగిపోవడమే ప్రధాన కారణం. ఆశ్రిత పక్షపాతం, ఆధిపత్య పోరుతో ఆటకు ప్రాధాన్యం తగ్గి దేశంలో ఎన్నో క్రీడాసంఘాలు, సమాఖ్యలు కునారిల్లుతున్నాయి. బీసీసీఐపై మాత్రం మొదటి నుంచీ రాజకీయాల ప్రభావం తక్కువే. శరద్‌ పవార్‌, రాజీవ్‌ శుక్లా లాంటి నేతలు బీసీసీఐలో కీలక పదవులు దక్కించుకున్నా, రాజకీయాల ప్రభావం బోర్డుపై ఎక్కువగా పడకుండా, క్రికెట్‌ గాడి తప్పకుండా చూసుకున్నారు. 90 దశకంలో జట్టు ఎంపికలో పక్షపాతం, రాజకీయాల గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండటానికి వాటినే కారణాలుగా చెప్పేవారు. ఆ తరవాత మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసింది. గంగూలీ కెప్టెన్‌గా పగ్గాలందుకున్నాక పరిస్థితి మారింది.

ఇవీ చదవండి :హయ్యెస్ట్ ఫాలోవర్స్ కలిగిన టాప్ 10 క్రికెటర్స్ వీరే

కింగ్స్​ కోహ్లీ ఆడిన ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్​

ABOUT THE AUTHOR

...view details