తెలంగాణ

telangana

H1B వీసాదారుల ఎంపికలో మోసాలు.. వారికి అమెరికా వార్నింగ్​

By

Published : Apr 29, 2023, 7:39 PM IST

Updated : Apr 29, 2023, 8:15 PM IST

హెచ్​ 1బీ వీసాదారుల ఎంపిక కోసం ఉపయోగించే.. కంప్యూటరైజ్డ్‌ లాటరీ సిస్టమ్‌లో మోసాలు జరుగుతున్నట్లు అమెరికా గుర్తించింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు ఈ లాటరీ వ్యవస్థను మోసగిస్తున్నట్లు తేలిందని ప్రకటించింది. ఫలితంగా హెచ్​ 1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆధునీకరించేందుకు ఫెడరల్‌ ఏజెన్సీ సిద్ధమైంది.

h-1b-visa-lottery-system-abuse-and-fraud-says-uscis
ఎచ్​1బీ వీసాదారుల ఎంపికలో మోసాలు

అమెరికా కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్​1బీ వీసా అనుమతిని కల్పిస్తుంది. టెక్నాలజీ కంపెనీలు దీనిపై ఆధారపడి ఏటా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి.. వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ఏటా కొన్ని లక్షల మంది ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకొంటుండగా.. కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా ఎంపిక చేసి.. అర్హులైన వారికి వీసాలు జారీ చేస్తుంటారు. ఈ లాటరీ ప్రక్రియలో కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయని.. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ- USCIS గుర్తించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించామంటూ.. ఓ అసాధారణ ప్రకటన విడుదల చేసింది. హెచ్​ 1బీ వీసాలను దక్కించుకునే అవకాశాలను పెంచుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఒకే దరఖాస్తుదారు పేరుతో.. అనేక రిజిస్ట్రేషన్లను లాటరీలోకి నమోదు చేస్తున్నట్లు గుర్తించామని USCIS తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇటీవల చేపట్టగా.. అంతకుముందుతో పోలిస్తే పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చినట్లు USCIS పేర్కొంది.

హెచ్​ 1బీ వీసాల కోసం ఈ ఏడాది కంప్యూటర్‌ జనరేటెడ్‌ లాటరీలో ఏకంగా 7,80,884 దరఖాస్తులు వచ్చాయి. 2023 ఏడాదికి ఈ సంఖ్య 4,83,927గా ఉండగా.. 2022లో 3,14,470, 2021లో 2,74,237 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒకే లబ్ధిదారు ఎక్కువ సార్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు.. లేదా ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నప్పుడు ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది 4,8,891 మంది.. ఒకటి కంటే ఎక్కువ సార్లు లాటరీలో రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. గతేడాది.. ఈ సంఖ్య 1,65,180 మాత్రమే. కంపెనీలు తమ ఉద్యోగులకు.. వీసాలు రావాలనే దురుద్దేశంతో ఇలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాయని USCIS వెల్లడించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. తప్పుడు సమాచారంతో దరఖాస్తులు చేసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఈ మోసాల నేపథ్యంలో.. తమ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆధునీకరించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు USCIS తెలిపింది. తమ వలస వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థకు.. హెచ్​ 1బీవీసా కార్యక్రమం అత్యంత ముఖ్యమైనదని గుర్తుచేసిన ఫెడరల్‌ ఏజెన్సీ.. ఈ ప్రక్రియలో మోసాలు, దుర్వినియోగాన్ని తగ్గించేందుకు రిజిస్ట్రేషన్‌ విధానాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించింది.

అమెరికాలో జాబ్ కావాలా గుడ్​న్యూస్ టూరిస్ట్ వీసాతోనే అవన్నీ చేయొచ్చు..
అమెరికాలో ఉద్యోగం చేయాలని చూస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే శుభవార్త అందించింది. టూరిస్ట్ వీసా లేదా బిజినెస్ వీసాపై తమ దేశానికి వచ్చిన వారు కూడా.. అక్కడ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన నిబంధనలపై అమెరికా పౌరసత్వం, వలసదారుల సేవల సంస్థ- యూఎస్​సీఐఎస్​ స్పష్టత ఇచ్చింది. అయితే.. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరేలోగా వారి వీసా స్టేటస్ మారేలా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated :Apr 29, 2023, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details