ETV Bharat / international

అమెరికాలో జాబ్ కావాలా? గుడ్​న్యూస్.. టూరిస్ట్ వీసాతోనే అవన్నీ చేయొచ్చు!

author img

By

Published : Mar 23, 2023, 9:48 AM IST

Updated : Mar 23, 2023, 10:30 AM IST

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్​న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. యూఎస్​కు టూరిస్ట్ వీసా లేదా బిజినెస్ వీసాపై వచ్చినవారు కూడా.. అక్కడ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని పేర్కొంది.

us visa
us visa

అమెరికాలో ఉద్యోగం చేయాలని చూస్తున్న వారికి శుభవార్త. టూరిస్ట్ వీసా లేదా బిజినెస్ వీసాపై తమ దేశానికి వచ్చిన వారు కూడా.. అక్కడ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఇందుకు సంబంధించిన నిబంధనలపై అమెరికా పౌరసత్వం, వలసదారుల సేవల సంస్థ- యూఎస్​సీఐఎస్​ బుధవారం స్పష్టత ఇచ్చింది. అయితే.. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరేలోగా వారి వీసా స్టేటస్ మారేలా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది.
సాధారణంగా బీ1/బీ2 వీసాలను టూరిస్ట్, వ్యాపార పర్యటనలకు వెళ్లేవారికి అమెరికా జారీ చేస్తుంది. అయితే ఈ వీసాపై యూఎస్ వెళ్లినవారికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. అనంతరం వారు దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

టెక్ అగ్ర సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్ , అమెజాన్ వంటి సంస్థల్లో ఇటీవల కాలంలో తొలగింపుల కారణంగా అమెరికాలో భారత్​ సహా విదేశాలకు చెందిన నైపుణ్యం కలిగిన వేలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. లేఆఫ్​ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న వారు 60 రోజుల వ్యవధిలో మరో ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. వీరు అప్పటికి ఉద్యోగం సంపాదిస్తే అమెరికాలో ఉండవచ్చు. లేదంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ఆందోళనల నడుమ.. ఉద్యోగం వెతుక్కునేందుకు వేర్వేరు మార్గాలు ఉన్నాయంటూ బుధవారం టూరిస్ట్, బిజినెస్​ వీసాలకు సంబంధించి యూఎస్​సీఐఎస్​ వరుస ట్వీట్లు చేసింది.

గడువు ముగిసి ఇబ్బందులు..
అమెరికాలో ఇటీవల ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీసా గడువు సమయమైన (గ్రేస్‌పీరియడ్‌) 60 రోజుల్లో ఉద్యోగం దొరకక వేల మంది భారతీయ సాఫ్ట్‌వేర్‌ నిపుణులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కుటుంబాలతో వీరంతా అమెరికాను వీడి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌ అనే సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువు కారణంగా వేల మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన అధ్యక్ష ఉప సలహా సంఘం ఇటీవల గ్రేస్‌ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాలని సిఫార్సు చేసింది. దీని వల్ల ఉద్యోగం కోల్పోయిన వారు కొత్త జాబ్​ కోసం వెతుక్కోవడానకి కావాల్సిన సమయం దొరుకుతుంది. అయితే ఇది అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ కొత్త విధానాన్ని తక్షణమే తీసుకురావాలని యూఎస్‌సీఐఎస్‌ను, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ను.. ఎఫ్‌ఐఐడీఎస్‌ కోరింది. కాగా.. ఈ కొత్త సిఫార్సుకు వైట్‌హౌస్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒక వేళ తొందరగా అమల్లోకి వచ్చినా.. గత ఏడాది అక్టోబరు సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు. గతేడాది నుంచి 2,50,000 మంది హెచ్‌-1 బీ వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు.

Last Updated :Mar 23, 2023, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.