తెలంగాణ

telangana

చైనా దూకుడుకు కళ్లెం- అమెరికా కాంగ్రెస్​లో బిల్లు!

By

Published : Feb 19, 2021, 1:13 PM IST

చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా సిద్ధమైంది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్​ అనుసరిస్తోన్న విధానాలు, అమెరికా మేధో సంపత్తిని తస్కరించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్​లో పలు బిల్లులను ప్రవేశపెట్టారు చట్టసభ్యులు.

US Congress
చైనా దూకుడుకు కళ్లెం- అమెరికా కాంగ్రెస్​లో బిల్లు

అమెరికాలో పెరుగుతోన్న చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు, దేశ హక్కులను కాపాడేందుకు డజనుకు పైగా బిల్లులను కాంగ్రెస్​లో ప్రవేశపెట్టారు రిపబ్లికన్​ పార్టీ చట్ట సభ్యులు. ప్రస్తుతం అమెరికా-చైనా సంబంధాలు పాతాళానికి పడిపోయాయి. వాణిజ్యం, కరోనా మూలాలు, దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్​ దూకుడు, మానవహక్కుల ఉల్లంఘన వంటి అనేక విషయాల్లో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. వీటిని ఎదుర్కొనేందుకు సభలో గురువారం ఈ బిల్లులను ప్రవేశపెట్టినట్లు చట్టసభ్యులు వెల్లడించారు.

సైనిక, ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చైనా చేస్తోన్న ప్రయత్నాలు అమెరికాకు ముప్పుగా మారుతున్నాయని ఐదు బిల్లులు ప్రవేశపెట్టిన చట్టసభ్యుడు మార్క్​ గ్రీన్ తెలిపారు.

"మన ఆర్థిక వ్యవస్థ, విద్యాసంస్థలు, సైనిక వివరాలపై పట్టు సాధించడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలను మనం ఎదుర్కోవాలి. మన మేధో సంపత్తిని దొంగిలించడం నుంచి, అమెరికన్ కంపెనీలపై ఉక్కుపాదం మోపడం వరకు వారి ప్రవర్తన దారుణంగా ఉంది. ఇది అమెరికన్​ ప్రజలకే కాక ప్రపంచానికే పెను ముప్పుగా మారింది."

- మార్క్​ గ్రీన్, అమెరికా చట్టసభ్యుడు

అమెరికా స్వేచ్ఛా వాణిజ్యానికి చైనా కమ్యూనిస్ట్​ పార్టీ సవాల్​ విసురుతోందని మరో ఐదు బిల్లులు ప్రవేశపెట్టిన జిమ్​ బ్యాంక్స్​ అభిప్రాయపడ్డారు.

"చైనా మనకు పెను సవాల్​ విసురుతోంది. అది మన ఆర్థిక వ్యవస్థ, విశ్వవిద్యాలయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, నిఘా సంస్థల్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తోంది. కనుక అమెరికన్ సంస్థలను చైనా నుంచి కాపాడటంపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలి.

- జిమ్ బ్యాంక్స్, కాంగ్రెస్​ సభ్యుడు

ABOUT THE AUTHOR

...view details