తెలంగాణ

telangana

'ప్రేక్షకులే నా గాడ్​ఫాదర్లు'.. చిరు ఉద్వేగభరిత ప్రసంగం

By

Published : Sep 29, 2022, 6:56 AM IST

chiranjeevi-speech-at-god-father-pre-release-event

God Father Movie : వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మాట్లాడారు మెగస్టార్​ చిరంజీవి. ఆయన నటించిన 'గాడ్​ ​ఫాదర్'​ చిత్ర ప్రీ రిలీజ్​ ఈవెంట్​ విజయవంతంగా సాగింది. చిరు ఉద్వేగభరిత స్పీచ్​లో సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

God Father Movie : 'నా వెనక గాడ్‌ఫాదర్స్‌ లేరని అంతా అంటుంటారు. కానీ, నా అభిమానులే నా గాడ్‌ఫాదర్స్‌' అని ప్రముఖ నటుడు చిరంజీవి ఉద్వేగభరితంగా అన్నారు. చిరు హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన 'గాడ్‌ ఫాదర్‌' చిత్రాన్ని అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. వర్షం పడుతున్నా చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ వేడుకనుద్దేశించి చిరు మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం సూపర్‌ స్టార్‌ కృష్ణగారి సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు. ఈ 'గాడ్‌ ఫాదర్‌' వేదికగా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు.

'నేనెప్పుడు ఏ సీమకు వచ్చినా ఆ నేల తడుస్తుంది. పులివెందులలో పొలిటికల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించినపుడు, 'ఇంద్ర' సినిమా చిత్రీకరణలోనూ వరుణు దేవుడిని ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది. అలానే ఈరోజూ వాన పడటం శుభపరిణామం అనిపిస్తోంది. ఇదంతా ఆ భగవంతుని ఆశీస్సులుగా భావిస్తున్నా. ఇంత వర్షం పడుతున్నా ఎవరూ కదలకుండా ఉన్నారు. అదే నిజమైన ప్రేమ. ఈ రాయలసీమలో నేల నెర్రులు చాస్తుంటే.. 'చిరంజీవి వచ్చాడు.. వర్షం వస్తుంది' అనే సెంటిమెంట్‌ పునరావృతమవటం విజయ సూచిక అనుకుంటున్నా. మరో సినిమా చిత్రీకరణ కోసం విశాఖపట్నంలో ఉండటంతో నేనిక్కడికి రాగలనా, లేదా? అని సందేహించా. కానీ, మిమ్మల్ని కలవాలనే ఆశ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. 'లూసీఫర్' రీమేక్‌ అయిన 'గాడ్‌ఫాదర్‌' చేయటానికి కారణం రామ్‌చరణ్‌. 'ఈ సమయంలో నీ ఇమేజ్‌కు తగ్గట్టు నువ్వు చేయాల్సిన సరైన సబ్జెక్ట్‌ ఇదే' అని తను చెప్పడం వల్లే ఇది సాధ్యమైంది.

"దర్శకుడిగా మోహన్‌రాజాను చరణే ఎంపిక చేశాడు. అనుకున్నదానికంటే ఆయన అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కీలక పాత్ర కోసం సల్మాన్‌ఖాన్‌ కావాలని మోహన్‌రాజా చాలా తేలికగా చెప్పారు. ఆ బాధ్యతనూ రామ్‌ చరణ్‌ తీసుకున్నాడు. ఇతర కీలక పాత్రల కోసం నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌లను తీసుకున్నాం. త్వరలోనే సత్యదేవ్‌ సూపర్‌స్టార్‌ అవుతాడనే నమ్మకం ఉంది. బ్రహ్మాజీ, గెటప్‌ శ్రీను తదితరులు ఈ చిత్రంలో అలరిస్తారు. 'నిర్మాతగా నేనొక్కడినే చేయలేను నాన్నా' అని చరణ్‌ చెబితే సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థతో చేతులు కలిపాం"అని చిరంజీవి చిత్రవిశేషాలను చెప్పుకొచ్చారు.

"మా పంచ ప్రాణాలు పెట్టి ఈ సినిమా చేశాం. అది మరింత ఎత్తుకు వెళ్లాలంటే ఆరో ప్రాణం పెట్టేవాడు కావాలనుకున్నాం. అతనే నా తమ్ముడు తమన్‌. చిన్నావాడైనా జాతీయ అవార్డు అందుకున్నాడు. సంభాషణలేవీ లేకుండా నిశ్శబ్దంగా కంటి చూపుతో హీరోయిజం ప్రదర్శించే పాత్రలు అరుదుగా లభిస్తాయి. ఈ సినిమాలో క్యారెక్టర్‌ అలాంటిదే. దానికి తమన్‌ మరింత పవర్‌ తీసుకొచ్చాడు. ఈ చిత్రంలో పొలిటికల్‌, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది.

" నేను సినిమా చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నా. మేం ఎంత చెప్పినా న్యాయనిర్ణేతలు మీరే (ప్రేక్షకులు). మీ తీర్పునకు గౌరవం ఇస్తాం. విజయదశమి మన అందరి జీవితాల్లో ఆనందం తీసుకొస్తుంది. 'గాడ్‌ఫాదర్‌'తో పాటూ విడుదలవుతున్న నా మిత్రుడు నాగార్జున 'ది ఘోస్ట్‌', యంగ్‌ హీరో బెల్లకొండ గణేశ్‌ 'స్వాతిముత్యం' చిత్రాలూ విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. జయపజయాలు సాధారణమే. కానీ, ప్రేక్షకులను అలరించలేకపోయానే అనే బాధ ఇటీవల కలిగింది. దానికి సమాధానమే ఈ 'గాడ్ ఫాదర్'. ఇది నిశ్శబ్ద విస్ఫోటం. మీరంతా నన్ను గాడ్‌ఫాదర్‌ అంటున్నారు. ఎందుకంటే ఏ గాడ్‌ఫాదర్‌ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకునే అవకాశం ఇచ్చిన ప్రతి అభిమాని నాకు గాడ్‌ఫాదరే" అంటూ చిరంజీవి సుదీర్ఘంగా ప్రసంగించారు.

ఇదీ చదవండి:పవర్​ఫుల్​గా 'గాడ్​ఫాదర్​' ట్రైలర్​​.. చిరు యాక్షన్​ అదరగొట్టేశారుగా

చిరుత 15 ఇయర్స్​.. చిరంజీవి ఎమోషనల్​.. 'నచ్చిమి' పాత్ర ఎలా వచ్చిందంటే

ABOUT THE AUTHOR

...view details