తెలంగాణ

telangana

Road Accident: దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... ఒకరు మృతి

By

Published : Oct 24, 2021, 12:25 PM IST

తీర్థయాత్రలకు వెళ్లి వస్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురైన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి సమీపంలో చోటుచేసుకుంది. టైరు పగలడంతో అదుపు తప్పిన వాహనం... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Road Accident
Road Accident

నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం అటవీ ప్రాంతంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన మారుతి రెడ్డి(23) దంపతులు, ముక్కలు గ్రామానికి చెందిన వారి సమీప బంధువులతో కలిసి ఆంధ్రప్రదేశ్​లోని పలు తీర్థయాత్రలకు కారులో బయలుదేరారు. మొక్కులు చెల్లించుకుని తిరుగు వస్తుండగా... గల్ఫ్ నుంచి వస్తున్న తమ స్నేహితుడిని హైదరాబాద్ విమానాశ్రయం నుంచి తీసుకుని అయిదుగురు ఇంటికి బయలుదేరారు.

ఇందల్‌వాయి మండల కేంద్రం దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లగానే 44వ జాతీయ రహదారిపై కారు టైరు పగలడంతో అదుపు తప్పి... హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని అతి వేగంతో ఢీకొట్టింది. దీంతో మారుతి రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కారులోని మిగతా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని టోల్ ప్లాజా అంబులెన్స్​లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్​లోని ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి రెండేళ్ల క్రితమే పెళ్లి అయింది.

ఇదీ చదవండి:Road Accident News: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details