తెలంగాణ

telangana

కబ్జా కోరల్లో చిన్న వడ్డేపల్లి చెరువు.. నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

By

Published : Oct 15, 2022, 9:49 PM IST

Chinna Vaddepalli pond: చారిత్రక ఓరుగల్లులో చెరువుల కబ్జా కలకలం రేపుతోంది. నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువులో కబ్జాదారులు ఇప్పటికే కొంతభాగాన్ని మట్టి పోసి చదును చేశారు. ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. వరంగల్‌ నగరంలోనే ఇంత జరుగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Chinna Vaddepalli pond
చిన్న వడ్డేపల్లి చెరువు

కబ్జాకు గురవుతున్న చిన్న వడ్డేపల్లి చెరువు

Chinna Vaddepalli pond: చెరువు భూమిని కబ్జా చేసి.. ఇళ్లు నిర్మిస్తే ప్రకృతికి, మనుషులకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. చెరువు శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. సర్కారు యంత్రాంగం నిర్లక్ష్యంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువును చెరబట్టారు. ఇప్పటికే కొంతభూమిలో మట్టి పోసి చదును చేసి.. దసరా ఉత్సవాలు నిర్వహించారు. మరోవైపున రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్రమక్రమంగా చెరువును పూడుస్తూ ప్లాట్‌లుగా మార్చేస్తున్నారు.

చిన్నవడ్డేపల్లి చెరువులో గతంలోనూ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. శ్మశానవాటికకు వెళ్లే దారిలో చెరువులోనే గోడ కట్టారు. 2011లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. 2018లో కాల్వ వద్ద నిర్మాణాలు జరిగినప్పుడు సైతం కలెక్టర్ వాటిని కూల్చివేసేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా పదెకరాలను మాయం చేసేందుకు కబ్జాకోరులు కుట్రకు తెరలేపారు. అధికారులు దృష్టి సారిస్తేనే చెరువును రక్షించుకోగలమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల విషయాన్ని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చిన్న వడ్డేపల్లి చెరువును సర్వే చేసి.. భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. 100 ఎకరాల చెరువు ప్రాంతం సుమారు 30 ఎకరాల వరకు కబ్జాకు గురైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చెరువు ఆక్రమించడం వలన వరదలు వచ్చినపుడు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details