తెలంగాణ

telangana

D.Srinivas joins Congress : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్​లో డీఎస్ చేరిక.. నిజమేనా?

By

Published : Oct 17, 2021, 2:51 PM IST

D.Srinivas joins Congress
D.Srinivas joins Congress

తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో(D.Srinivas joins Congress) చేరుతున్నారా? అవుననే వాదనలు పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. డిసెంబర్ 9న కాంగ్రెస్ జంగ్ సైరన్ సభకు హాజరవుతున్న రాహుల్ గాంధీ సమక్షంలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎస్​ రాకను పార్టీలో సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెరాస ఎంపీ డి.శ్రీనివాస్​ను కలవడం కాంగ్రెస్​ పార్టీ(D.Srinivas joins Congress)లో కలవరం రేపుతోంది. డీఎస్​ తిరిగి కాంగ్రెస్​ పార్టీలో చేరతారన్న ప్రచారం జోరందుకోవడం వల్ల ఇది చర్చనీయాంశమైంది. కానీ.. డీఎస్​ను పార్టీలోకి తీసుకోవాలన్న యోచన సరైంది కాదని నిజామాబాద్​ కాంగ్రెస్ నేతలు, పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

కాస్త చలనం..

పీసీసీ చీఫ్​గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్​లో కాస్త చలనం వచ్చింది. పార్టీలో నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పుడున్న నాయకత్వం బలంగా ఉందన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు తటస్థంగా ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్​లోకి వచ్చే వారికి సంబంధించి.. పార్టీ నాయకులతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పీసీసీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాలనుకుంది కానీ ఇప్పటికీ ఆవైపుగా అడుగు పడలేదు.

డీఎస్ రీఎంట్రీ..

ఇటీవల కొంతమంది కాంగ్రెస్​లో చేరారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్​ ఇంటికి వెళ్లడం, దాదాపు గంట పాటు వివిధ అంశాలపై చర్చించడం పార్టీలో దుమారం రేపింది. డీఎస్​ కాంగ్రెస్​లోకి రీఎంట్రీ(D.Srinivas joins Congress) ఇస్తారన్న పుకార్లు వస్తున్నాయి.

రాహుల్ సమక్షంలో చేరిక!

డిసెంబర్ 9న నిరుద్యోగులు, విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జంగ్ సైరన్ సభకు రాహుల్ గాంధీ వస్తుండటం వల్ల ఆయన సమక్షంలోనే డీఎస్​ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. మరోవైపు డీఎస్​ రాకను కొందరు సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజామాబాద్​కు చెందిన నేతలు డీఎస్​ చేరికపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వీడిన డీఎస్​ను.. ఇప్పడు చేర్చుకోవద్దనే వాదనలు వినిపిస్తున్నాయి.

డీఎస్​ చేరికపై వ్యతిరేకత

ప్రధానంగా నిజామాబాద్​కు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీలతో పాటు పలువురు సీనియర్ నాయకులు శ్రీనివాస్ చేరికను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎస్ కాంగ్రెస్ వైపు వస్తున్నట్లు ప్రచారం.. సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై ఇటు కాంగ్రెస్ కానీ అటు తెరాస కానీ ఖండించలేదు. ఎవరూ స్పందించకపోవడం వల్ల కాంగ్రెస్​లో డి.శ్రీనివాస్ చేరిక ఖాయమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details