తెలంగాణ

telangana

Netannaku Cheyutha scheme: 'నేతన్నకు చేయూత'.. సెప్టెంబర్ 1 నుంచి నమోదు ప్రక్రియ

By

Published : Aug 20, 2021, 6:47 AM IST

Updated : Aug 20, 2021, 7:36 AM IST

సెప్టెంబర్ 1 నుంచి నేతన్నకు చేయూత పథకం(Netannaku Cheyutha scheme) కోసం నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల పొదుపు నిధి, భద్రత పథకంగా దీన్ని అమలు చేయాలని అధికారులకు సూచించింది.

సెప్టెంబర్ 1 నుంచి ‘నేతన్నకు చేయూత’ నమోదు
సెప్టెంబర్ 1 నుంచి ‘నేతన్నకు చేయూత’ నమోదు

చేనేత కార్మికుల పొదుపు పథకం 'నేతన్నకు చేయూత(Netannaku Cheyutha scheme)'లో వచ్చే నెల మొదటి తేదీ నుంచి నమోదు ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. తమ ఆదాయంలో 50 శాతం నేత పని ద్వారా పొందే 18 ఏళ్లు దాటిన వారు అర్హులని పేర్కొంది. రూ.368 కోట్లతో పునఃప్రారంభించిన ఈ పథకంపై గురువారం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. చేనేత కార్మికుల పొదుపు నిధి, భద్రత పథకంగా దీనిని అమలు చేయాలని సూచించింది.

రాష్ట్రంలో చేనేత సంఘాల్లో, సహకారేతర రంగంలోని జియో ట్యాగింగ్‌ మగ్గాలపై పనిచేసే నేత కార్మికులు, వృత్తికి అనుబంధంగా డైయింగ్‌, టైయింగ్‌ డిజైన్‌, వైండింగ్‌, వార్పింగ్‌, సైజింగ్‌ పనులు చేసే వారికి దీనిని అమలు చేయనున్నారు. ‘సంబంధిత చేనేత సహాయ సంచాలకుల కార్యాలయాల్లో దరఖాస్తులు పొంది, తమ వివరాలను భర్తీ చేసి సమర్పించాలి. అర్హులైన వారిని ఏడీలు గుర్తిస్తారు.

ప్రభుత్వం ఎంపిక చేసిన అనంతరం లబ్ధిదారుడు, సంబంధిత ఏడీ పేరు మీద ఉమ్మడి ఖాతాను బ్యాంకులో ప్రారంభించాలి. లబ్ధిదారుడు తమ వేతనంలో 8 శాతాన్ని పొదుపు చేస్తే ప్రభుత్వం తమ వాటాగా 16 శాతం జమ చేస్తుంది. ప్రతి నెలా 15లోగా ఈ ప్రక్రియ జరుగుతుంది. కార్మికులు 36 నెలల పాటు పొదుపు చేసిన అనంతరం మొత్తం పొందుతారు. లబ్ధిదారుల్లో ఎవరైనా మరణిస్తే ఆయన కుటుంబీకులు లేదా ఇతర నామినీలు ఈ మొత్తాన్ని పొందవచ్చు.

దరఖాస్తు ఇలా..

చేనేత కార్మికుని పూర్తి పేరు, వివరాలు, చిరునామా, జియోట్యాగింగ్‌, ఆధార్‌, బ్యాంకు వివరాలు, మొబైల్‌ నంబర్‌, వృత్తిలో ఎన్నేళ్లుగా ఉన్నారు.. క్రితం సారి పథకం(Netannaku Cheyutha scheme)లో ఉన్నారా.. నెలవారి వేతనాలతో పాటు వాటి స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.

Last Updated : Aug 20, 2021, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details