ETV Bharat / state

Defender of snakes: ఒక్క పామును చంపానన్న పశ్చాత్తాపంతో.. వేల సర్పాలకు రక్షకుడయ్యాడు..!

author img

By

Published : Aug 20, 2021, 4:56 AM IST

Updated : Aug 20, 2021, 6:25 AM IST

పాము కనిపిస్తే ఏం చేస్తాం? భయపడి పారిపోతాం. ప్రాణానికి ప్రమాదమని భావిస్తే ఏకంగా చంపేస్తాం. చెట్టుపై నుంచి తనపైపడ్డ పాముని చూసి అతడూ.. అలాగే భయపడ్డాడు. ప్రాణభయంతో చంపేశాడు. ఆ తర్వాత అది విషంలేని పామని తెలిసి చాలాబాధపడ్డాడు. అప్పటినుంచి పాముల్నిచంపబోనని స్నేహితులకు మాటిచ్చాడు. ఇప్పటివరకు ఒక్కపామును చంపలేదు సరికదా... 4 వేలకు పైగా పాముల్నిరక్షించి అడవుల్లో వదిలాడు. తెలుగు రాష్ట్రాల్లోని 692 విద్యాసంస్థల్లో సర్పాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. ఏబీసీడీ అనే స్వచ్ఛందసంస్థను స్థాపించి వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడుతున్నాడు. ఇవన్నీ ఒక్కరూపాయి కూడా ఎవరినుంచి ఆశించకుండా సొంతడబ్బుతో నిర్వహిస్తూ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాడు. పాముల్ని మీరు రక్షిస్తే...అవి పర్యావరణాన్ని రక్షిస్తాయంటున్న సహాయ ఆచార్యుడు, సర్పసంరక్షకుడు సదాశివయ్యపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

degree collage lecturer became a Defender of snakes in two Telegu states
degree collage lecturer became a Defender of snakes in two Telegu states

మెడలో సర్పాన్ని ఆభరణంగా ధరించిన సదాశివున్ని భక్తులు భగవంతునిగా కొలుస్తారు. అదే సర్పం పాలమూరు జిల్లాలో ఎక్కడ కనిపింపిచినా జనం ఈ సదాశివున్ని పిలుస్తారు. ఎందుకంటే పాముల్ని అసలు చంపకూడదని, వాటిని రక్షిస్తే అవి పర్యావరణాన్ని రక్షిస్తాయని అంటాడు సదాశివయ్య. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యునిగా పనిచేస్తున్న ఆయన సర్పాల సంరక్షణలో తనదైనశైలిలో స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. తాను మాత్రమే కాదు ఆసక్తి ఉన్న యువకులు, విద్యార్ధులు, పర్యావరణ ప్రేమికులను సైతం అందులో భాగస్వాముల్ని చేస్తున్నారు. అవగాహన కల్పించి ప్రజల్లోనూ చైతన్యం నింపుతున్నారు.

degree collage lecturer became a Defender of snakes in two Telegu states
పొడవైన కొండచిలువతో సదాశివయ్య..

అలా మొదలైంది...

అనంతపురం జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి చెందిన సదాశివయ్య 2007లో పీహెచ్డీ చేసే సమయంలో చెట్టుపై నుంచి తనపైపడ్డ పామును చూసి భయపడి చంపేశాడు. తీరా అది విషంలేని సర్పమని తెలిసిబాధపడ్డాడు. అప్పటి నుంచి పాముల్నిచంపబోనని తన సహచరులకు మాటిచ్చారు. పీహెచ్డీ తర్వాత పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోసం వృక్షశాస్త్రం, జీవశాస్త్రంపై అధ్యయనం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయంలో అన్ని జంతువులతో పాటు పాముల గురించి కూడా ఆయన పరిశోధన చేశారు. అందులో భాగంగానే పాములను పట్టుకోవడంలో శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచి పాముల్ని సంరక్షించడం మొదలుపెట్టారు

degree collage lecturer became a Defender of snakes in two Telegu states
నాగన్నతో అవగాహన కార్యకర్రమం..

4వేలకు పైగా సర్పాలు అడవుల్లోకి...

2010 నుంచి పాముల రక్షణ మొదలైంది. అనంతపురం జిల్లా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే పాము కనిపిస్తే ఫోన్ చేయాల్సిందిగా తననంబర్ ను విస్తృత ప్రచారం చేశారు. ఎక్కడ పాము కనపించినా పరిసరగ్రామాల ప్రజలు సదాశివయ్యకు ఫోన్ చేసే వారు. 2012లో సహాయఆచార్యునిగా ఉద్యోగం రావడంతో ఆయన వనపర్తికి వచ్చారు. అక్కడా మీడియా ద్వారా తన ఫోన్ నెంబర్ ను ప్రాచుర్యంలోకి తెచ్చారు. వనపర్తి చుట్టూ 30కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ పాముందని తెలిసినా వెళ్లి రక్షించేవారు. రాత్రి,పగలనే తేడాలేకుండా ఏ సమయంలో ఫోన్ చేసినా సదాశివయ్య వెళ్లేవారు. అప్పట్లో వనపర్తి జిల్లాలో సదాశివయ్య ఫోన్ నెంబర్ తెలియని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వృత్తి రిత్యా ఆయన జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చారు. అక్కడా సర్పాలని రక్షించే ప్రక్రియ కొనసాగుతోంది. అలా 2012 నుంచి ఇప్పటి వరకూ 4678 పాముల్ని ఆయన రక్షించారు. 2012 నుంచి ఆయన అందుకు సంబంధించిన రికార్డును నిర్వహిస్తున్నారు.

degree collage lecturer became a Defender of snakes in two Telegu states
పిల్లలకు అవగాహన కల్పిస్తూ..

32 రకాల సర్పాలు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 39 రకాల పాములుంటే వాటిలో 7 విషసహిత సర్పాలు. మరో 7 అర్థవిష సర్పాలు. మిగిలిన 25 విషంలేని సర్పాలు. 39 రకాల్లో 32 రకాల్నిఇప్పటి వరకూ పట్టుకున్నారు. వీటిలో అత్యధికం నాగుపాములే. నాగుపాము, కట్లపాము, రక్త పింజర లాంటి విష సర్పాలు, కొండచిలువ లాంటి భారీ సర్పాలు, జేరిపోతు లాంటి విషరహిత సర్పాలు ఎన్నింటినో పట్టుకుని అడవుల్లోకి వదిలారు. అందులో భాగంగానే తెలంగాణలో ఇప్పటి వరకూ కనిపించడని సిబినోఫిస్ సబ్పంక్టేటస్ సర్పజాతిని 2016లో నల్లమల అడవుల్లో ఆయన గుర్తించారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేని పల్లిలో లైకోడాన్ ఫ్లావికల్లిస్ అనే అరుదైన సర్పాన్ని గుర్తించారు.

degree collage lecturer became a Defender of snakes in two Telegu states
నాగన్నతో సదాశివయ్య..

జనంలో అవగాహన కోసం...

తాను మాత్రమే పాముల్నికాపాడితే సరిపోదకున్నసదాశివయ్య.. ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం రక్షించిన పాముల్ని వారం పది రోజులు తమ వద్దే ఉంచుకుంటారు. వాటిని తీసుకువెళ్లి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో అవగాహన కల్పిస్తారు. పాములు ఎన్ని రకాలు..? వాటిలో విష సర్పాలు ఏవి..? విషం లేని పాములేవి..? పాములు ఎప్పుడు కాటేస్తాయి...? కాటేస్తే మనల్ని మనం రక్షించుకోవడం ఎలా? ఇలాంటి అంశాలను వివరిస్తారు. ప్రజల్లో ఉన్నఊహాగానాలు, వాస్తవాలేవో చెప్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 692 విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు అందులో భాగస్వాములయ్యారు. పాములను రక్షించడం తనకు మాత్రమే పరిమితం కావద్దని సదాశివయ్య భావించారు. తనతో పాటు.. ఆసక్తిఉన్న యువకులు, విద్యార్ధులు, వణ్యప్రాణి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులకు పాములను పట్టుకునే నైపుణ్యాలను నేర్పించారు. అలా 62 మందికి శిక్షణ అందించగా... తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో 20మంది పాముల్ని రక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.పాములు పట్టుకునే విద్యను నేర్చుకున్న వాళ్లు వారి వారి ప్రాంతాల్లో ఫోన్ కాల్స్ ద్వారా వాటిని రక్షిస్తారు. మిగిలిన సభ్యులు పాములపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

degree collage lecturer became a Defender of snakes in two Telegu states
గ్రామస్థుల్లో అవగాహన కల్పింస్తూ..

స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు

వణ్యప్రాణుల సంరక్షణ, జీవవైవిద్యాన్ని కాపాడటం కేవలం ఒక్కరివల్ల అయ్యే పని కాదు. అందుకే అసోసియేషన్ ఫర్ బయో డైవర్సిటీ కంజర్వేషన్ అండ్ డెవలప్​మెంట్ ఏబీసీడీ పేరిట జీవవైవిద్య పరిరక్షణ కోసం సంస్థను స్థాపించారు. జీవవైవిద్యాన్ని రక్షించాలనుకునే ప్రతి ఒక్కరు ఈ సంస్థలో ఉచితంగా చేరవచ్చు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏబీసీడీ సభ్యులున్నారు. ఆది నుంచి పాముల్ని పట్టుకునేందుకు ఒక్కరూపాయి కూడా వసూలు చేసేవారు కాదు సదాశివయ్య. వాటిని పట్టుకోవడం, వాటితో జనంలో అవగాహన కల్పించడం, తిరిగి అడవుల్లో వదిలేయడం కోసం అయ్యే ఖర్చంతా సొంతంగానే భరిస్తారు. సదాశివయ్య వద్ద శిక్షణ తీసుకున్న ఎంతోమంది పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం పాటు పడుతున్నారు.

degree collage lecturer became a Defender of snakes in two Telegu states
మెడలో కొండ చిలువతో..

బతకనిద్దాం-బతుకుదాం...

"వాటి జోలికి వెళ్లనంత వరకూ పాములు ప్రమాదకరం కాదు. ఆహారపు గొలుసులో పాముల పాత్ర ప్రత్యేకం. అవి రైతులకు మిత్రులు. పంటనష్టాన్ని నివారిస్తాయి. అనేక వ్యాధుల నివారణ లో ఉపయోగించే ఔషధాలు పాముల విషం నుంచి తయారవుతాయి. అందుకే వాటిని బ్రతకనివ్వాలి. తద్వారా మనమూ బతకాలి. పాముల పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలి. అపోహలు తొలగాలి. పాముకాటు లేని తెలంగాణ సమాజాన్ని చూడాలి అదే నా లక్ష్యం. విద్య, అటవీ, వైద్యశాఖలు సంయుక్తంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తే, ఐదు,పదేళ్లలోనే అది సాధ్యమవుతుంది." - సదాశివయ్య, సహాయ ఆచార్యుడు, డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల

degree collage lecturer became a Defender of snakes in two Telegu states
బావిలో పడిన పామును కాపాడుతూ..

ఇదీ చూడండి:

Snakebite: ఏటా పాము కాటుకు ఎంతమంది బలవుతున్నారో తెలుసా?

Last Updated : Aug 20, 2021, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.