తెలంగాణ

telangana

CC Camera's in Hyderabad: పనిచేయని సీసీ కెమెరాలు.. పట్టించుకోని అధికారులు

By

Published : Mar 17, 2022, 9:17 AM IST

CC Camera's in Hyderabad: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో పోలీసులు అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. కొన్నిచోట్ల నెలల తరబడి అవి పనిచేయకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.

CC Camera's in Hyderabad
CC Camera's in Hyderabad

CC Camera's in Hyderabad: నేరస్థులను నియంత్రించేందుకు.. ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషరేట్ల పరిధుల్లోని జనావాసాలు, కాలనీలు, ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన నిఘానేత్రాలు మసకబారుతున్నాయి. వీటిని ఏర్పాటు చేయించడంలో ప్రదర్శిస్తున్న శ్రద్ధ నిర్వహణపై చూపించకపోవడంతో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. కొన్నిచోట్ల నెలల తరబడి అవి పనిచేయకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. వర్షాలు కురిసినా.. గట్టిగా గాలి వీచినా నిఘా నేత్రాలు పనిచేయడంలేదు. చెట్ల కొమ్మలను తొలగించేప్పుడు వాటి తీగలు తెగిపోతే ఇక అంతేసంగతులు.

సురక్షిత కాలనీలు..

ప్రైవేటు కంపెనీలు, కార్పొరేటు సంస్థలు, వ్యాపారులు, హోటళ్లు, బార్‌అండ్‌ రెస్టారెంట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటుండగానే పోలీస్‌ ఉన్నతాధికారులు సురక్షిత కాలనీల పేరుతో ప్రజాభాగస్వామ్యం పేరుతో కొత్త కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో కొన్ని ఠాణాల పరిధుల్లో సురక్షిత కాలనీలను ఎంపిక చేశారు. అక్కడ ప్రజలతో మాట్లాడి వారి నిధులతోనే నిఘా నేత్రాలు ఏర్పాటు చేయించారు.


పనిచేయనివిలా..

  • చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో సీఎస్‌ఆర్‌ ఫండ్‌ కింద పోలీసుశాఖ 80 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా ఇందులో 60 కెమెరాలే పనిచేస్తున్నాయి. ఎల్‌ అండ్‌ టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం, పోలీసుశాఖ ఏర్పాటు చేసిన 16 కెమెరాల్లో 13 కెమెరాలు పనిచేస్తున్నాయి. ఇవి నైట్‌ విజన్‌ కెమెరాల కాకపోవడంతో రాత్రయితే పనిచేయవు. ఆయా కెమెరాల్లో రికార్డయ్యే ఫుటేజీ కేవలం 24 గంటలే ఉంటోంది.
  • ఆదిభట్ల ఠాణా పరిధి తుర్కయంజాల్‌, నాగార్జునసాగర్‌ రహదారితో పాటు 19 ప్రాంతాల్లో 262 కెమెరాలు పోలీసులు ఏర్పాటుచేశారు. 60శాతం మాత్రమే పనిచేస్తున్నట్లు వారే పేర్కొంటున్నారు.
  • రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో ఏర్పాటు చేసిన 968లో సగానికిపైగా ప్రస్తుతం పనిచేయడంలేదు. ఇటీవల రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పద్మశాలిపురం బస్తీకి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా రైలు కింద పడి మృతిచెందాడు. అతడిది ఆత్మహత్యకాదని ఎవరో హత్యచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడ కెమెరాలను పరిశీలించడానికి ప్రయత్నిస్తే అందులో చాలా వరకు పనిచేయడంలేదు.
  • హయత్‌నగర్‌ బస్టాండ్‌ నుంచి వనస్థలిపురం వరకూ ప్రధాన రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన వాటిలో 30శాతం మాత్రమే పనిచేస్తున్నాయి.
  • జూబ్లీహిల్స్‌ సొసైటీలో దాదాపు రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన 400 నిఘా నేత్రాల్లో దాదాపు 40 శాతమే పనిచేస్తున్నాయి.

‘‘నేను సైతం’’ అంటూ

సురక్షిత కాలనీల్లో కెమెరాల ఏర్పాట్లు జరుగుతున్నప్పుడే పోలీసులు రెండేళ్ల క్రితం ‘సురక్షిత, సుభద్ర’నగరంగా హైదరాబాద్‌ రూపుదిద్దుకోవాలంటే నేరస్థులను గంటల వ్యవధిలో గుర్తించాలని అందుకు వీలుగా ‘నేనుసైతం’ పేరుతో ప్రతి ఇల్లు, దుకాణం, సంస్థ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఠాణా పరిధిలో వందల సంఖ్యలో కెమెరాలను అమర్చాలని ఇంటికో కెమెరాతోపాటు ఇంటి బయట రోడ్డుపై దృశ్యాలు కనిపించేలా అమర్చుకోవాలంటూ నిబంధనలు విధించారు.


నిర్వహణ అంతంతే...

మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ప్రభుత్వం, ప్రజలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో 20శాతం పనిచేయడం లేదని పోలీస్‌ అధికారులే అంగీకరిస్తున్నారు. ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఉంచిన కెమెరాల్లో 5శాతం కెమెరాలు తరచూ మరమ్మతులు చేస్తుంటామని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఆబిడ్స్‌ వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీటీజెడ్‌ కెమెరాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది.

ఇదీచూడండి:Viveka Murder Case: ' మూడు రోజుల్లోనే వివేకాను హత్య చేయాలన్నారు'

ABOUT THE AUTHOR

...view details