తెలంగాణ

telangana

ఇదేందయ్యా ఇది.. 10 మంది ఉండే గదిలో 36 మంది విద్యార్థులా..?

By

Published : Apr 26, 2022, 7:31 AM IST

AP High Court Serious on Govt : సంక్షేమశాఖ వసతి గృహాల నిర్వహణ తీరుపై ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు నిలదీసింది. వేలకోట్ల రూపాయల బడ్జెట్ ఏమవుతోందంటూ ప్రశ్నించింది. పది మంది విద్యార్థులకు మాత్రమే సరిపోయే గదిలో 36 మంది ఉంటున్నారంటే వసతి గృహాలు ఎలాంటి అధ్వాన్న స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది

AP High Court Serious on Govt
AP High Court Serious on Govt

AP High Court Serious on Govt : సంక్షేమ వసతిగృహాల నిర్వహణ తీరుపై ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు నిలదీసింది. తమది తొమ్మిది వేల కోట్ల బడ్జెట్‌ అని చెబుతున్న సాంఘిక సంక్షేమశాఖ.. రూ.16 లక్షల ఖర్చుతో ఓ వసతిగృహానికి అదనపు అంతస్తును నిర్మించలేకపోతోందా అని ఆక్షేపించింది. రూ.వేల కోట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పది మంది విద్యార్థులకు మాత్రమే సరిపోయే గదిలో 36 మంది ఉంటున్నారంటే వసతిగృహాలు ఎలాంటి అధ్వాన్న స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. 136 మంది విద్యార్థినులు కేవలం రెండు మరుగుదొడ్లు, మూడు స్నానపుగదులతో సర్దుకుపోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందని కోర్టు ముందు హాజరైన సంక్షేమశాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ను నిలదీసింది. వివిధ అంశాలపై న్యాయస్థానం లేవనెత్తుతున్న విషయాలను సమీక్ష సమావేశాల్లో ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంపై దాఖలైన ఓ వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో మీ జోక్యమేంటి?:ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయలేదని, ఆ సొమ్ము చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్‌ కళాశాల కార్యదర్శి షేక్‌ రహీం బాషా హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఫీజు చెల్లించకపోవడంపై వివరణ ఇవ్వాలని సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. డైరెక్టర్‌ కె.హర్షవర్ధన్‌ సోమవారం హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.

AP High Court News : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారం విద్యాశాఖదని.. ఆ విషయంలో నోడల్‌ ఏజెన్సీగా పని చేయాల్సిన అవసరం సంక్షేమ శాఖకు ఎందుకు వచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందు మీ శాఖ విధులను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. ఇటీవల శ్రీకాకుళంలో ఓ బాలికల సంక్షేమ వసతిగృహాన్ని పరిశీలించానన్నారు. కోర్టు హాలంత విస్తీర్ణం ఉన్న గదిని మూడుగా విభజించి 136 మంది విద్యార్థినులకు వసతి ఇచ్చారన్నారు. అక్కడున్న రెండు మరుగుదొడ్లు, మూడు స్నానాల గదులు అంతమందికి ఎలా సరిపోతాయని నిలదీశారు. 2017లో ప్రారంభించిన వసతిగృహం అదనపు గది నిర్మాణానికి రూ.16 లక్షలు కేటాయించకపోవడం వల్లే విద్యార్థినులు ఇరుకుగదుల్లో నివసిస్తున్నట్లు తెలిసిందన్నారు. అంతమంది విద్యార్థులకు ఒక్కటే వార్తా పత్రిక ఇస్తున్నారన్నారు. విజ్ఞాన సముపార్జనకు, పోటీ పరీక్షలకు సిద్ధపడటానికి వారికి తగినన్ని వార్తాపత్రికలు వేయడం లేదని ఆక్షేపించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details