తెలంగాణ

telangana

'ఇక పొడిగించేది లేదు.. అదే డెడ్​లైన్'.. ఐటీఆర్‌ గడువుపై కేంద్రం క్లారిటీ

By

Published : Jul 22, 2022, 6:51 PM IST

ఐటీఆర్ గడువుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈనెల 31లోపు రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని, ఆఖరు తేదీని పొడగించే ఉద్దేశం లేదని తెలిపింది.

tax
పన్ను

ITR filing last date 2022: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగించే ఉద్దేశమేదీ కేంద్రానికి లేదని రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ అన్నారు. జులై 31లోపు వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జులై 20 నాటికి 2.3 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని తెలిపారు. అంతకుముందు ఏడాదికి సంబంధించి మొత్తం 5.89 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. ఆ ఏడాది రిటర్నుల దాఖలుకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఇచ్చారు.

"రిటర్నుల దాఖలు గడువు పొడిగించడం నిత్యం జరిగేదే అని ప్రజలు భావిస్తుంటారు. అందుకే రిటర్నుల ఫైలింగ్‌లను నెమ్మదిగా చేస్తూ వచ్చారు. ఇటీవల మాత్రం రిటర్నుల దాఖలు చేయడంలో వేగం పెరిగింది. రోజుకు 15 నుంచి 18 లక్షల రిటర్నులు ఫైల్‌ అవుతున్నాయి. ఇవి 25 నుంచి 30 లక్షలకు పెరుగుతాయని భావిస్తున్నాం. గతేడాది 9-10 శాతం మంది మంది అంటే 50 లక్షల మంది చివరి రోజు రిటర్నులు దాఖలు చేశారు. ఈ సారి ఆ సంఖ్య కోటికి చేరుతుందని భావిస్తున్నా" అని చెప్పారు.

"గతంతో పోలిస్తే కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌ ఎంత లోడ్‌ను అయినా తట్టుకోగలదు. కాబట్టి గడువు పొడిగించే ఉద్దేశమేదీ లేదు" అని తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. రిటర్నుల దాఖలు చేసే ప్రక్రియ సైతం సులువుగా ఉందని చాలా మంది ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారని చెప్పారు. చాలా మంది రిటర్నులు దాఖలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించగా.. ఇప్పటికే 2.3 కోట్ల మంది ఎలాంటి ఫిర్యాదులూ లేకుండానే రిటర్నులు దాఖలు చేశారని తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా వరుసగా రెండేళ్ల పాటు రిటర్నుల దాఖలు గడువును కేంద్రం పొడిగిస్తూ వచ్చింది. రిటర్నుల దాఖలు గడువు జులై 31తో ముగస్తున్న నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి ఈ ప్రకటన చేశారు.

ఇదీ చూడండి :డ్రైవర్‌ లేని ఎలక్ట్రిక్​ కారు.. ధర ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details