డ్రైవర్‌ లేని ఎలక్ట్రిక్​ కారు.. ధర ఎంతో తెలుసా?

author img

By

Published : Jul 22, 2022, 4:51 AM IST

Updated : Jul 22, 2022, 6:53 AM IST

Driver Less Electric Car:

Driver Less Electric Car: చైనాకు చెందిన సెర్చ్​ ఇంజిన్​ సంస్థ బైదూ.. డ్రైవర్​ అక్కర్లేని విద్యుత్​ కారు 'అపోలో ఆర్‌టీ6'ను రూపొందించింది. బైదూకు చెందిన రోబో టాక్సీలో ఇదీ భాగం కానుంది. మరోవైపు, జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో '50 జారే ఎం ఎడిషన్‌'ను గురువారం విడుదల చేసింది.

Driver Less Electric Car: డ్రైవర్‌ అక్కర్లేని విద్యుత్‌ వాహనం 'అపోలో ఆర్‌టీ6'ను చైనాకు చెందిన కృత్రిమ మేధ, సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ బైదూ ఆవిష్కరించింది. బైదూకు చెందిన రోబో టాక్సీలో ఇదీ భాగం కానుంది. పూర్తి స్థాయి విద్యుత్‌ వాహనమైన ఈ కారులో స్టీరింగ్‌ ఉంటుంది. అవసరం లేదనుకుంటే తీసేయవచ్చు. దీని ధర 250,000 యువాన్లు (37,000 డాలర్లు లేదా సుమారు రూ.29 లక్షలు). స్టీరింగ్‌ లేకపోవడం వల్ల కలిసొచ్చే స్థలంలో అదనపు సీటు లేదా గేమింగ్‌ కన్సోల్‌, వెండింగ్‌ మెషీన్‌ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.

టాక్సీ వ్యయంలో సగం ధరకే.. ప్రస్తుతం టాక్సీలపై వెచ్చిస్తున్న వ్యయంలో సగానికే రోబోటాక్సీ వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు బైదూ వరల్డ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్‌ లీ అంటున్నారు. ‘ఖర్చు భారీగా తగ్గితే, చైనా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో వాహనాలను తీసుకురావడానికి వీలవుతుంద’న్నారు.

ఆర్‌టీ6 పరిమితులు ఇవీ.. సాంకేతికత విషయంలో ఆర్‌టీ6కు అయిదింట నాలుగో స్థాయి(లెవల్‌ 4) దక్కింది. అంటే డ్రైవర్‌ లేకుండా దీనిని నిర్వహించవచ్చు. అయితే ప్రీలోడెడ్‌ మ్యాప్‌తో మాత్రమే ఇది పనిచేస్తుంది. అంటే పరిమిత ప్రాంతాల్లోనే నిర్వహించవచ్చు. ప్రస్తుతానికి నగర రహదారులపై అనుమతిస్తారు. లెవల్‌ 3లో అయితే జాతీయ రహదారులపై హ్యాండ్స్‌ ఫ్రీ డ్రైవింగ్‌కు అనుమతి ఉటుంది.

ఇప్పటికే ఒకటి ఉంది కానీ.. బైదూ సంస్థ ఇప్పటికే, అపోలో గో అనే అటానమస్‌ టాక్సీ సర్వీసులను నిర్వహిస్తోంది. వీటిలో డ్రైవర్‌ అక్కర్లేకపోయినా.. భద్రత నిమిత్తం డ్రైవర్‌ సీటులో సిబ్బందిని నియమించారు. బీజింగ్‌, షాంఘై, షెంజెన్‌, గ్వాంఝు వంటి నగరాల్లో ఈ సేవలను ఆవిష్కరించారు. అమెరికాకు చెందిన ఆల్ఫాబెట్‌ వేమో ఇప్పటికే ఫీనిక్స్‌, ఆరిజోనాలలో డ్రైవర్‌ రహిత టాక్సీ సేవలను అందిస్తోంది.

6.1 సెకన్లలో 100 కి.మీ. వేగం.. జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో '50 జారే ఎం ఎడిషన్‌'ను గురువారం విడుదల చేసింది. దీని ధర రూ.67.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). కంపెనీ చెన్నై ప్లాంట్‌ నుంచి ఈ పెట్రోల్‌ వేరియంట్‌ బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్‌ను తీసుకొచ్చారు. పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండే ఈ మోడల్‌ కార్లకు (10) ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. 2-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 252 హెచ్‌పీ గరిష్ఠ సామర్థ్యంతో 6.1 సెకన్లలోనే 100 కి.మీ. గరిష్ఠ వేగాన్ని ఈ కారు అందుకుంటుందని పేర్కొంది.

‘50 జారే ఎం ఎడిషన్‌’
బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ '50 జారే ఎం ఎడిషన్‌'

ఇదీ చదవండి: పెట్రోలుపై ఎగుమతి సుంకం ఎత్తివేత

Last Updated :Jul 22, 2022, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.